కుక్క పిల్లను కాపాడిన కాలేబ్(ఫొటో: సీబీఎస్)
కాలిఫోర్నియా: కొంతమందికి పెంపుడు జంతువులంటే అమితమైన ప్రేమ. వాటిని కుటుంబ సభ్యులుగా భావిస్తూ కంటికి రెప్పలా కాపాడుకుంటారు. వాటికి ఏదైనా ప్రమాదం పొంచి ఉందనిపిస్తే.. ఎంతకైనా పోరాడతారు. కొన్ని సందర్భాలలో తమ శక్తి కన్నా రెండింతల బలం ఉన్న మృగాలను సైతం ఎదుర్కొంటారు. ఇందుకు నిదర్శనంగా నిలిచే ఘటన అమెరికాలో చోటుచేసుకుంది. కాలిఫోర్నియాలోకు చెందిన కాలేబ్ బెన్హామ్.. తన ఇంటి ప్రాంగణంలో గల తోట నుంచి వింత శబ్దం రావడంతో అప్రమత్తమయ్యాడు. వెంటనే అక్కడికి వెళ్లాడు. తను ప్రేమతో పెంచుకుంటున్న కుక్కపిల్లని సుమారు 160 కిలోల భారీ ఎలుగుబంటి లాక్కెళ్లడం గమనించాడు. ప్రాణాలు సైతం లెక్కచేయకుండా కాలేబ్ నేరుగా ఎలుగుబంటితో పోరాడి, దాని గొంతు పట్టుకుని ముఖం, కంటిపై పిడిగుద్దులు కురిపించాడు.(చదవండి: వరల్డ్ రికార్డు క్రియేట్ అవుతుంది)
చివరికి అది కుక్కను వదిలేయడంతో ప్రాణాలతో బయటపడింది. "నేను కొంతదూరంలో ఒక పెద్ద శబ్ధం విన్నాను. అక్కడికి వెళ్లగా ఎలుగుబంటి కుక్క తలను నోట కరచుకుని లాక్కెళ్లిపోతోంది. ఇది చూసి ఎలాగైనా నా బేబీని రక్షించాలని ఎలుగుబంటితో యుద్దం చేశాను. వెంటనే ఆస్పత్రికి తీసుకువెళ్లాను. కుక్క పిల్ల గాయాలకు కుట్లు వేశారు. అదృష్టవశాత్తూ అది మెల్లమెల్లగా కోలుకుంటోంది’’ అని చెప్పారు. అయితే, ఎలుగుబంటి మరోసారి తన పెట్‌పై దాడి చేస్తుందేమోనని కాలేబ్ భయపడుతున్నాడు. ఏదేమైనా దానిని కాపాడుకుంటానని చెబుతున్నాడు. కాగా కాలేబ్ కుక్కపిల్లను కాపాడిన వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయగా జంతు ప్రేమికులను ఆకర్షిస్తోంది. ప్రాణాలకు తెగించి మీరు పోరాడిన తీరు అద్భుతం అంటూ అతడిపై ప్రశంసలు కురుస్తున్నాయి. ఇక నీటిలో మొసలి నోటిలో ఉన్న తన కుక్కపిల్లను కాపాడడానికి ఓ యజమాని చేసిన సాహసానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియలో చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment