మాడ్రిడ్: ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలిగా భావిస్తున్న 117 ఏళ్ల బామ్మ ఇకలేరు. అమెరికాలో జన్మించిన, స్పెయిన్ దేశస్తురాలు మరియా బ్రన్యాస్ కన్నుమూశారని ఆమె కుటుంబసభ్యులు మంగళవారం ప్రకటించారు. బ్రన్యాస్ ‘ఎక్స్’పేజీలో వారు..‘మరియా బ్రన్యాస్ మనల్ని విడిచి వెళ్లిపోయారు.
కోరుకున్న విధంగానే నిద్రలోనే, ప్రశాంతంగా, ఎలాంటి బాధా లేకుండా తుదిశ్వాస విడిచారు’అని పేర్కొన్నారు. 110, అంతకంటే ఎక్కువ ఏళ్లు జీవించి ఉన్న వ్యక్తుల వివరాలను ఎప్పటికప్పుడు సేకరించే గెరంటాలజీ రీసెర్చ్ గ్రూప్.. ఫ్రాన్సుకు చెందిన లుసిలె రాండన్ అనే నన్ గతేడాది మరణించాక, మనకు తెలిసినంత వరకు అత్యంత వృద్ధ మహిళ బ్రన్యాస్ అని ప్రకటించింది.
బ్రన్యాస్ మరణంతో ఆ స్థానం 116 ఏళ్ల జపనీయురాలు తొమికొ ఇకూటాకు దక్కుతుందని తాజాగా ఆ గ్రూప్ తెలిపింది. 1907 మార్చి 4వ తేదీన అమెరికాలో శాన్ ఫ్రాన్సిస్కోలో బ్రన్యాస్ జని్మంచారు. ఆమె కుటుంబం కొన్నాళ్లపాటు న్యూఆర్లియన్స్‌లోనూ ఉంది. ఆమె తండ్రి స్పెయిన్‌లో ఓ మ్యాగజీన్‌ను ప్రారంభించడంతో, కుటుంబంతోపాటు ఆమె కూడా ఇక్కడికే వచ్చేశారు. మొదటి ప్రపంచ యుద్ధం జరుగుతున్న రోజుల్లో అట్లాంటిక్ సముద్రం మీదుగా స్పెయిన్‌కు జరిగిన అప్పటి ప్రయాణం తనకు గుర్తుందని చెప్పేవారు బ్రన్యాస్. ‘ఎక్స్’లోని సూపర్ కాటలాన్ గ్రాండ్‌మా అనే పేజీలో బ్రన్యాస్..‘నేను వృద్ధురాలిని. అత్యంత వృద్ధురాలిని. మూర్ఖురాలిని మాత్రం కాదు’అని పెట్టుకున్నారు.
113 ఏళ్ల వయస్సులో తక్కువ తీవ్రతతో సోకిన కోవిడ్ నుంచి ఆమె సురక్షితంగా బయటపడ్డారు. కాటలాన్ ప్రాంతంలోని ఒలోట్ పట్టణంలోని ఓ నర్సింగ్ హోంలో ఆమె కన్నుమూశారు. ‘ఎప్పుడో తెలియదు కానీ, ఈ సుదీర్ఘ ప్రయాణం త్వరలోనే ముగుస్తుంది. ఇంత దీర్ఘకాలం జీవించి శిథిలమైన స్థితిలో ఉన్న నన్ను మరణం ఆవహిస్తుంది. నవ్వుతూ మరణాన్ని ఆహ్వానిస్తాను. స్వేచ్ఛగా, సంతృప్తికరంగా జీవితం ముగించాలనుకుంటున్నాను’అని కొన్ని రోజుల క్రితం బ్రన్యాస్ తమతో అన్నారని కుటుంబసభ్యులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment