world oldest person
-
గ్రాండ్ ఓల్డ్ లేడీ ఇక లేదు
మాడ్రిడ్: ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలిగా భావిస్తున్న 117 ఏళ్ల బామ్మ ఇకలేరు. అమెరికాలో జన్మించిన, స్పెయిన్ దేశస్తురాలు మరియా బ్రన్యాస్ కన్నుమూశారని ఆమె కుటుంబసభ్యులు మంగళవారం ప్రకటించారు. బ్రన్యాస్ ‘ఎక్స్’పేజీలో వారు..‘మరియా బ్రన్యాస్ మనల్ని విడిచి వెళ్లిపోయారు. కోరుకున్న విధంగానే నిద్రలోనే, ప్రశాంతంగా, ఎలాంటి బాధా లేకుండా తుదిశ్వాస విడిచారు’అని పేర్కొన్నారు. 110, అంతకంటే ఎక్కువ ఏళ్లు జీవించి ఉన్న వ్యక్తుల వివరాలను ఎప్పటికప్పుడు సేకరించే గెరంటాలజీ రీసెర్చ్ గ్రూప్.. ఫ్రాన్సుకు చెందిన లుసిలె రాండన్ అనే నన్ గతేడాది మరణించాక, మనకు తెలిసినంత వరకు అత్యంత వృద్ధ మహిళ బ్రన్యాస్ అని ప్రకటించింది. బ్రన్యాస్ మరణంతో ఆ స్థానం 116 ఏళ్ల జపనీయురాలు తొమికొ ఇకూటాకు దక్కుతుందని తాజాగా ఆ గ్రూప్ తెలిపింది. 1907 మార్చి 4వ తేదీన అమెరికాలో శాన్ ఫ్రాన్సిస్కోలో బ్రన్యాస్ జని్మంచారు. ఆమె కుటుంబం కొన్నాళ్లపాటు న్యూఆర్లియన్స్లోనూ ఉంది. ఆమె తండ్రి స్పెయిన్‌లో ఓ మ్యాగజీన్‌ను ప్రారంభించడంతో, కుటుంబంతోపాటు ఆమె కూడా ఇక్కడికే వచ్చేశారు. మొదటి ప్రపంచ యుద్ధం జరుగుతున్న రోజుల్లో అట్లాంటిక్ సముద్రం మీదుగా స్పెయిన్‌కు జరిగిన అప్పటి ప్రయాణం తనకు గుర్తుందని చెప్పేవారు బ్రన్యాస్. ‘ఎక్స్’లోని సూపర్ కాటలాన్ గ్రాండ్మా అనే పేజీలో బ్రన్యాస్..‘నేను వృద్ధురాలిని. అత్యంత వృద్ధురాలిని. మూర్ఖురాలిని మాత్రం కాదు’అని పెట్టుకున్నారు. 113 ఏళ్ల వయస్సులో తక్కువ తీవ్రతతో సోకిన కోవిడ్ నుంచి ఆమె సురక్షితంగా బయటపడ్డారు. కాటలాన్ ప్రాంతంలోని ఒలోట్ పట్టణంలోని ఓ నర్సింగ్ హోంలో ఆమె కన్నుమూశారు. ‘ఎప్పుడో తెలియదు కానీ, ఈ సుదీర్ఘ ప్రయాణం త్వరలోనే ముగుస్తుంది. ఇంత దీర్ఘకాలం జీవించి శిథిలమైన స్థితిలో ఉన్న నన్ను మరణం ఆవహిస్తుంది. నవ్వుతూ మరణాన్ని ఆహ్వానిస్తాను. స్వేచ్ఛగా, సంతృప్తికరంగా జీవితం ముగించాలనుకుంటున్నాను’అని కొన్ని రోజుల క్రితం బ్రన్యాస్ తమతో అన్నారని కుటుంబసభ్యులు తెలిపారు. -
ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలి కన్నుమూత.. వయసు ఎంతంటే..?
పారిస్: ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలిగా గుర్తింపుపొందిన ఫ్రాన్స్ దేశస్తురాలు లూసిలీ ర్యాండమ్(118) తుది శ్వాస విడిచారు. కోవిడ్‌ను జయించిన అత్యంత వృద్ధుల్లో ఒకరిగానూ చరిత్ర సృష్టించిన ఈమెను స్థానికులు సిస్టర్ ఆండ్రీగా పిలుస్తారు. 1904 ఫిబ్రవరి 11న దక్షిణ ఫ్రాన్స్‌లోని ఎలీస్ పట్టణంలో జన్మించిన ఈమె వృత్తిరీత్యా నర్సు. మంగళవారం టౌలూన్ పట్టణంలో ఈమె మరణించారని ఆమె తరఫు ప్రతినిధి వెల్లడించారు. 2021 జనవరిలో ఈమెకు కరోనా సోకింది. అయితే, పెద్దగా అనారోగ్య లక్షణాలేవీ కనిపించకపోవడం విశేషం. కోవిడ్‌ను జయించిన బామ్మగా ప్రాచుర్యంపొందారు. ‘కష్టంగా భావించకుండా ఇష్టంగా పనిచేయడమే నా ఆరోగ్య రహస్యం. 108 ఏళ్ల వరకు నా పనులు నేనే చేసుకున్నా. రోజూ ఒక చాక్లెట్ తినడం, ఒక గ్లాస్ వైన్ తాగడం నా అలవాటు’ అని ఆండ్రీ గతంలో చెప్పారు. ర్యాండమ్ మృతి తర్వాత స్పెయిన్‌లో నివసిస్తున్న 115 ఏళ్ల అమెరికన్ మరియా బ్రాన్యాస్ మొరేరా ప్రపంచంలో అత్యంత వృద్ధ వ్యక్తిగా రికార్డులకెక్కారు. చదవండి: జనాభాలో చైనాను దాటేశాం -
వీడి వయసు 190 ఏళ్లు.. యుద్ధాలతో పాటు ఎన్నో చూశాడు
ఈ భూమ్మీద అత్యంత వయసు గల జీవి ఏదో తెలుసా?.. పోనీ అధిక కాలం బతికే జీవిగా పేరు దేనికి ఉందో తెలుసా?.. తాబేలు! అవును.. తాబేలు గూటికి చెందిన జోనాథన్ ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఈ మగ తాబేలు వయసు.. అక్షరాల 190 సంవత్సరాలు. తద్వారా ప్రస్తుతానికి ఈ భూమ్మీద అత్యధిక వయసున్న ప్రాణిగా జోనాథన్ పేరు రికార్డుల్లోకి ఎక్కింది!. ► ఇక.. సౌత్ అట్లాంటిక్‌లోని మారుమూల ద్వీపం సెయింట్ హెలెనాలో జోనాథన్‌కు పుట్టిన రోజు వేడుకలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ► ఈ ప్రాంతంలోనే ఫ్రెంచ్ చక్రవర్తి నెపోలియన్.. తన ఆఖరిరోజుల్ని ఇక్కడే గడిపి 1821లో కన్నుమూశారు. ► 1832లో ఇది గుడ్డు నుంచి బయటకు వచ్చి ఉంటుందని.. దానిపై ఉండే డొప్ప ఆధారంగా వయసుపై ఓ అంచనాకి వచ్చారు పరిశోధకులు. ► తూర్పు ఆఫ్రికా దేశం సీషెల్స్ నుంచి యాభై ఏళ్ల వయసులో జోనాథన్ను.. యూకే ఓవర్సీస్ సరిహద్దులకు తీసుకొచ్చారు. జోనాథన్(ఎడమ వైపు ఉన్న తాబేలు) ► 1882లో యాభై ఏళ్ల వయసున్న ఈ తాబేలును.. సర్ విలియమ్ గ్రే విల్సన్‌కు కానుకగా అందించారు. ఆ తర్వాత కొంతకాలానికి ఆయన ఆ ద్వీపానికి గవర్నర్ అయ్యారు. ► అప్పటి నుంచి సెయింట్ హెలెనా గవర్నర్ అధికార భవనంలోని మొక్కల సంరక్షణ కేంద్రంలో ఇది సేదతీరుతోంది. ► జోనాథన్ బాగోగులు చూసుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు ఉంటాయక్కడ. తోడు కోసం ఓ ఆడ తాబేలును కూడా తీసుకొస్తారు. ► జోనాథన్ పుట్టినరోజు వేడుకలు ప్రత్యేకంగా ఉండబోతున్నాయి. అంతేకాదు.. దాని ఫేవరెట్ ఫుడ్(పండ్లు) అందించడంతో పాటు ప్రత్యేక కేక్‌ను సిద్ధం చేశారు. జోనాథన్ పేరు మీద ఓ స్టాంప్‌ను సైతం విడుదల చేయబోతున్నారు. ► ప్రపంచంలోనే అత్యధిక వయసు ఉన్న భూప్రాణిగా జోనాథన్ పేరు ఈ ఏడాది మొదట్లోనే గిన్నిస్ వరల్డ్ రికార్డుల్లోకి ఎక్కింది. అయితే.. అత్యంత వయస్కురాలైన తాబేలుగా మాత్రం ఈ నెలలోనే ఘనత సాధించింది. ► జోనాథన్ కళ్ల ముందే ప్రపంచ యుద్ధాలు జరిగాయి. రాజులు-రాణులు పోయారు. బ్రిటిష్ రాజ్యమైతే చేతులూ మారింది. కానీ, జోనాథన్ మాత్రం వాడి స్వేచ్ఛా జీవితాన్ని స్వేచ్ఛగా ఆస్వాదిస్తూ ఉన్నాడు. ► ఇంకా వాడు ఎక్కువ కాలం బతకాలన్నది సెయింట్ హెలెనా అధికారుల కోరిక. ఒకవేళ.. వయసురిత్యా సమస్యలతో కన్నుమూసినా.. దాని పైడొప్పను భద్రంగా పదిలపరుస్తామని అధికారులు చెప్తున్నారు. :::వెబ్‌డెస్క్ ఇదీ చదవండి: రష్యాకు లక్ష, మాకు 13 వేలు! -
118 ఏళ్ల వ్యక్తి ఆరోగ్య రహస్యం ఏంటో తెలుసా?
సాక్షి, సెంట్రల్ డెస్క్: ఎక్కువ కాలం బతకాలంటే ఏం చేయాలి? అంటే.. రోజూ వ్యాయామం చేయాలి. మంచి పోషకాలున్న ఆహారం తీసుకోవాలి. సమయానికి నిద్ర పోవాలి.. ఇలా రకరకాలుగా చెబుతూనే ఉంటారు. కానీ ప్రపంచంలోనే అత్యంత పెద్ద వయసు వ్యక్తిగా (118 ఏళ్లు) ఇటీవలే గిన్నిస్ రికార్డుకెక్కిన ఫ్రెంచ్ నన్ సిస్టర్ ఆండ్రే ఆరోగ్య రహస్యం ఏంటో తెలుసా? ఆమె రోజు తీసుకునే చాక్లెట్, ఓ గ్లాస్ వైన్. ఆండ్రే నర్సింగ్ హోమ్‌లో పని చేస్తున్న డేవిడ్ టవెల్లా ఇదే చెబుతున్నారు. ‘ఆండ్రూ రోజూ తీసుకునే గ్లాస్ వైన్ వల్లే తాను జీవిత కాలం పెరగడానికి కారణమేమో. నేను మాత్రం వైన్ తాగమని ఎవరికీ సలహా ఇవ్వను’ అని డేవిడ్ అంటున్నారు. గతంలో ఎక్కువ వయసున్న వ్యక్తి రికార్డు జపాన్‌కు చెందిన కేన్ టనక పేరిట ఉండేది. తాను ఈ ఏడాది ఏప్రిల్ 19న మరణించారు. దీంతో ఈ రికార్డు ఆండ్రే సొంతమైంది. కరోనా బారిన పడి కోలుకున్న పెద్ద వయస్కురాలిగా కూడా ఆండ్రే రికార్డుకెక్కారు. -
127వ ఏట మృతి.. గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కోసం ప్రయత్నం
ఆఫ్రికా/అస్మారా: ప్రస్తుతం మనిషి సగటు జీవిత కాలం 65-70 ఏళ్లు. మనకంటే 20-30 ఏళ్ల ముందు వారి ఆయుర్దాయం 80-90 ఏళ్లు. ఇక ఎక్కడో ఓ చోట కొందరు శతాధిక వృద్ధులు తారసపడుతుంటారు. ఇప్పటి వరకు మనం 100 ఏళ్ల కు పైబడిన వారి గురించి విన్నాం.. చూశాం. కానీ ఇప్పుడు మీరు చదవబోయే ఈ వార్తలోని వ్యక్తి ప్రపంచంలో అత్యధిక కాలం జీవించిన మనిషిగా రికార్డు సృష్టించబోతున్నాడు. కాకపోతే మరణించిన తర్వాత. సదరు వ్యక్తి 127 సంవత్సరాల వయసులో మరణించాడని.. అతడని అత్యధిక కాలం జీవించిన వ్యక్తిగా గుర్తించాల్సిందిగా గిన్నిస్ రికార్డ్ బుక్ ప్రతినిధులను కోరారు మరణించిన వృద్ధుడి కుటుంబ సభ్యులు. ఆ వివరాలు.. ఆఫ్రికాలోని అజెఫాలో ఎరిత్రియాకు చెందిన నటాబే మాచేట్ సోమవారం మరణించాడు. ప్రస్తుతం నటాబే వయసు 127 సంవత్సరాలని అతడి కుటుంబ సభ్యులు వెల్లడించారు. అందుకే అతని కుటుంబం గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో నటాబేని అత్యంత కాలం జీవించిన వ్యక్తిగా అధికారికంగా గుర్తించాలని కోరింది. ఈ క్రమంలో నటాబే మనవడు జీర్ తన తాత పుట్టుకకు సంబంధించిన పత్రాలను గిన్నిస్ బుక్ వాళ్లకు అందించాడు. (చదవండి: లాంగెస్ట్ కిస్.. గురక వీరుడు ఇంట్రస్టింగ్ వరల్డ్ రికార్డులు) చర్చి రికార్డులు ప్రకారం 1894లో నటాబే జన్మించినట్లు జనన ధ్రువీకరణ పత్రంలో ఉందన్నాడు జీర్. అయితే ఆయన జన్మించిన పదేళ్ల తర్వాత బాప్టిజం పొందాడని తెలిపాడు. దీని ఆధారంగా తన తాత 127 ఏళ్లు బతికినట్లు తను ఇచ్చిన సమాచారాన్ని గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ధృవీకరిస్తున్నాయని జీర్ తెలిపాడు. సహనం, దాతృత్వం, సంతోషకరమైన జీవితమే.. నటాబే సుదీర్ఘకాలం జీవించడానికి కారమణమని మీడియాకు వెల్లడించారు అతడి కుటుంబ సభ్యులు. తన తాత “అసాధారణమైన వ్యక్తి” అని జీర్ తెలిపాడు. 1934 లో నటాబే వివాహం చేసుకున్నాడని తెలిపాడు. తాత-నానమ్మలిద్దరూ సుద్ఘీకాలం జీవించారన్నాడు. నటాబే భార్య 2019 లో 99 సంవత్సరాల వయసులో మరణించింది. నటాబే తన జీవితంలో ఎక్కువ భాగం పశువుల కాపరిగా గడిపాడని జీర్ తెలిపాడు. 2014 లో, నటాబే 120 వ పుట్టినరోజును గ్రామం మొత్తం జరుపుకుంది. (చదవండి: ఈ సమంత టాలెంట్ తెలిస్తే...‘నోరెళ్ల’ బెడతారు) ప్రస్తుత అత్యధిక కాలం జీవించిన రికార్డు జీన్ కాల్మెంట్ అనే ఫ్రెంచ్ మహిళ పేరు మీద ఉంది. ఆమె 1997లో 122 సంవత్సరాల వయసులో మరణించాడు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రకారం ఎక్కువ కాలం బతికిన వ్యక్తిగా జపాన్‌కు చెందిన జిరోమోన్ కిమురా ఉన్నాడు. అతను 2013 లో 116 సంవత్సరాల వయసులో మరణించాడు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ నుంచి సమాధానం కోసం నటాబే కుటుంబం ఎదురుచూస్తోంది. చదవండి: చావునుంచి తప్పించుకోవచ్చేమో, కామాక్షి నుంచి తప్పించుకోలేరు?! -
ప్రపంచంలోనే సీనియర్ ఆఫీస్ మేనేజర్
ఈ మే 15 కి యసూకో తమాకీ 91 లోకి ప్రవేశిస్తున్నారు. పుట్టిన రోజు అని ఆమె సెలవు పెడితే తప్ప, ఆరోజూ ఆమె ఆఫీస్‌కు వెళతారు. అయితే ఆ రోజు శనివారం వచ్చింది. తర్వాత ఆదివారం. పక్కపక్కన రెండు సెలవు రోజులు. ఒకవేళ ఆమె పుట్టిన రోజు ఆ రెండు రోజుల్లో కాకుండా తక్కిన ఐదు పని దినాల్లో ఏ రోజు వచ్చినా ఆమె సెలవు పెట్టి ఇంట్లోనే సెలబ్రేషన్ చేసుకుంటారని నమ్మకంగా అనుకోలేం. బహుశా ఆమె ఆఫీస్‌కు వెళ్లేందుకు మొగ్గుచూపడానికే అవకాశం ఎక్కువ! అరవై ఐదేళ్లుగా ఒకే కంపెనీలో పని చేస్తున్నారు యసూకో! అప్పట్నుంచీ ఆమె ఆఫీస్ మేనేజరే. అత్యవసరం అయితే తప్ప ఏ రోజూ సెలవు తీసుకోలేదు. వారానికి ఐదురోజులు, రోజుకు ఏడున్నర గంటలు షిఫ్టులో మిగతా సిబ్బందిలా పని చేస్తూనే వస్తున్నారు. ఈ తొంభై ఏళ్ల వయసులోనూ ఆమె అలసిపోలేదు. అలసట లేకుండా ఉండటానికి ఉద్యోగం ఆమెకు ఇష్టమైన వ్యాపకం కావచ్చు. ‘వరల్డ్ ఓల్డెస్ట్ ఆఫీస్ మేనేజర్’ అని ఏప్రిల్ 8న గిన్నెస్ ఆమెను కీర్తించింది. ఆమె చేతికి ‘రికార్డు’ పత్రాన్ని అందించింది. 1930లో జన్మించారు యసూకో. 1956లో ఒసాకాలోని ‘సన్‌కో ఇండస్ట్రీస్’ అనే ఒక ట్రేడింగ్ కంపెనీలో చేరారు. స్క్రూలను తయారు చేయడంలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సన్‌కో.. మిగతా లోహపు మెటీరియల్స్ కూడా ఉత్పత్తి చేస్తుంటుంది. ఆ సంస్థలో అటుఇటుగా ఇరవై ఐదేళ్ల వయసులో ఆఫీస్ మేనేజర్ గా చేరారు. నాటి నుంచి అరవై ఐదేళ్లుగా అదే హోదాలో కొనసాగుతున్నారు. ఆఫీస్ అకౌంట్స్ చూడ్డం ఆమె ప్రధాన విధి. సిబ్బంది జీతాలు, బోనస్‌లు, పన్ను లెక్కలు అందులో భాగం. ఇప్పుడైతే మైక్రోసాఫ్ట్ ఎక్సెల్‌తో లెక్కలన్నీ చక్కబెడుతున్నారు కానీ, మొదట్లో అన్నీ కాగితాల మీదే చకచకా! ఇప్పుడు ఫేస్బుక్, స్మార్ట్‌ఫోన్ కూడా ఉపయోగిస్తున్నారు. గిన్నిస్ గుర్తింపు పత్రంతో యసూకో తమాకీ, ‘సీనియర్’ ఆఫీస్ మేనేజర్ వయసు పెరుగుతున్న కొద్దీ ఒంట్లో ఓపిక తగ్గి పని మీద ఉత్సాహం నశించే అవకాశం ఉంది. అయితే యసూకో శక్తి ఆమె పనే! ‘‘పని చేస్తున్నంత సేపూ నాకు ఉత్సాహంగా ఉండటం మాత్రమే కాదు, కొత్త ఉత్సాహం ఏదో నాలో జమ అవుతుంటుంది’’ అని నవ్వుతూ అంటారు యసూకో. అందుకే ఆమె రిౖటెర్మైంట్ తీసుకోలేదు. వాళ్లూ ఇవ్వలేదు. సన్కోలోని మిగతా ఉద్దండ ఆఫీస్ మేనేజర్లంతా ఆమె ఇచ్చిన తర్ఫీదుతో ఉద్యోగంలో నిలబడినవారే! అకౌంట్స్‌కి కొత్తగా ఎవరైనా వచ్చి చేరారంటే.. మొదట ఆమె ఆశీర్వాదం తీసుకోవలసిందే. అప్పుడు ఆమె ఒకటే మాట చెబుతారు. ‘‘సంస్థ కోసం నమ్మకంగా పని చేయండి. సంస్థ మిమ్మల్ని ఎప్పటికీ వదులుకోదు’’ అని. ఆ మాట ఆమె చెబితే ఎవరైనా వినకుండా ఉంటారా! గిన్నిస్ రికార్డు సర్టిఫికెట్‌ను అందుకుంటున్నప్పుడు ఆమె తన ఆఫీస్ పట్ల కృతజ్ఞతను వ్యక్తం చూస్తూ.. ‘‘సంస్థ నా నుంచి ఏమైతే ఆశించిందో అదే చేస్తూ వచ్చాను. అదేమీ విశేషం కాదు కదా’’ అన్నారు. ‘‘ఇన్నేళ్లుగా మీరెలా చేయగలుగుతున్నారు’’ అని గిన్నెస్ ప్రతిధిని ఒకరు ఆమెను అడిగారు. ‘‘ఇతరులకు చేదోడుగా ఉండటం అనేది నా స్వభావం. ఆఫీస్లోనైతే చైర్మన్‌కి, ఇతర మేనేజర్లకు, సహోద్యోగులకు సహాయంగా ఉండటంలోని ఆనందమే నన్ను ఇన్నేళ్లుగా ఆఫీస్‌వైపు నడిపిస్తోందనే అనుకుంటున్నాను’’ అని సమాధానమిచ్చారు యసూకో. ‘‘నేనసలు రిటైర్మైంట్ ఉంటుందన్న ఆలోచననే ఏనాడూ తెచ్చుకోను. సంవత్సరం తర్వాత సంవత్సరం గడిచిపోతాయి. వాటితోపాటే నేనూ నడుస్తుంటాను. నన్ను నడిపిస్తున్నది నా ఆఫీస్’’ అని కూడా అన్నారు యసూకో. -
పొగతాగే 146 ఏళ్ల ఎంబా కన్నుమూత
ప్రపంచంలోనే అత్యధిక వయస్సు కలిగిన శతాధిక వృద్ధుడిగా భావిస్తున్న ఇండోనేసియాలోని జావా నగరానికి చెందిన సమర్పాన్ సోడిమెజో అలియాస్ ఎంబా ఘోటో సోమవారం మరణించారు. ఆయన వయస్సు 146 ఏళ్లు. ఆయన నలుగురు భార్యలు, పది మంది పిల్లలు ఎప్పుడో మరణించారు. ఆయన వయస్సును నిపుణులు అధికారికంగా ధ్రువీకరించకపోయినా గుర్తింపు కార్డుపై ఆయన పుట్టిన తేదీ డిసెంబర్ 30, 1870 అని రాసి ఉంది. స్థానికులు కూడా ఆయనకు అంత వయస్సు ఉంటుందనే చెబుతున్నారు. ఎంబా ఘోటో పుట్టిన తేదీ నిజమే అయితే ఆయన గురించి ఎన్నో విశేషాలు చెప్పవచ్చు. ఆయన రెండు ప్రపంచ యుద్ధాలు చూడడమే కాకుండా డచ్ ఈస్ట్ ఇండీస్‌పై జపాన్ దురాక్రమణను కూడా చూసే ఉంటారు. సోవియట్ యూనియన్‌లో కమ్యూనిస్టు విప్లవాన్ని తీసుకొచ్చిన వ్లాదిమీర్ ఇల్లిచ్ లెనిన్ కూడా అదే సంవత్సరంలో పుట్టారు. సూయజ్ కెనాల్ ప్రారంభమైన ఏడాదికే ఆయన పుట్టారన్నమాట. అంతేకాదు ఘోటో చావుకు కూడా ఓ ప్రత్యేకత ఉంది. ప్రపంచ కార్మిక దినోత్సవమైన మే డే రోజున ఆయన మరణించారు. ఇంత ఎక్కువ కాలం ఆయన బతకడానికి కారణం ఏమిటని గత ఏడాది ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఆయన్ని మీడియా ప్రశ్నించగా ఆయన ఇచ్చిన సమాధానం మరీ ఆశ్చర్యం కలిగిస్తుంది. చైన్ స్మోకింగ్ వల్ల ఎక్కువ కాలం బతికినట్లు ఆయన చెప్పారు. ఆయన పుట్టినరోజు వేడుకలకు ఆయన నలుగురు మనవళ్లు హాజరయ్యారు. వారి కథనం ప్రకారం ఘోటో ముప్పూటలా అంబలి తాగుతారు. ఇప్పటి వరకు అధికారిక రికార్డుల ప్రకారం ప్రపంచంలో ఎక్కువ వయస్సు వరకు బతికినది ఫ్రెంచ్ మహిళ జియన్నే కాల్మెట్. ఆమె 122వ ఏట మరణించారు. ఇప్పటి వరకు అధికారకంగా ఆమె వయస్సును దాటి ఎవరూ బతికి లేరు. ప్రపంచంలో ఏ మనిషి కూడా 125 ఏళ్లకు మించి బతికే ప్రసక్తే లేదని న్యూయార్క్‌లోని ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ మెడికల్ కాలేజీ పరిశోధకులు ఇప్పటికే తేల్చిచెప్పారు. అయితే ఘోటో తరహాలోనే నైజీరియాకు చెందిన ఓలో ఫిన్తూయీ 171 ఏళ్లు, ఇథియోపియాకు చెందిన ధాకబో ఎబ్బా 163 ఏళ్లు బతికినట్లు చెబుతారు. -
ఒంటరి బామ్మకు 117 ఏళ్లు
రోమ్: ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ వయసున్న వృద్ధురాలిగా రికార్డుల్లోకి ఎక్కిన ఇటలీ బామ్మ ఎమ్మా మొరానో మంగళవారం నాడు 117వ పుట్టిన రోజును జరుపుకున్నారు. ఫియట్ కార్ల తయారీ సంస్థ ఆవిర్భవించిన తొలినాళ్లలో పుట్టిన ఈ బామ్మ మూడు శతాబ్దాలకు ప్రత్యక్ష సాక్షిగా నేడు కూడా ఆరోగ్యంగానే ఉండడం ఓ అద్భుతం. ఈ అద్భుతం వెనకనున్న ఆరోగ్య రహస్యం ఏమిటంటే ఆమె మాత్రం తన భర్తను తన్ని తగలేసి, మళ్లీ పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా జీవించడమేనని ముసిముసిగా చెబుతారు. ఆమె ఇంతకాలం జీవించి ఉండడానికి కారణం ఆమె తీసుకుంటున్న డైటేనని ఆమెకు ఎంతో కాలంగా వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ కార్లో బావో చెప్పారు. ఆమెను తాను కలుసుకునే నాటికి ఆమె రోజు ఉదయం రెండు పచ్చి గుడ్లు తాగేదని, మధ్యాహ్నం ఒక గుడ్డు ఆమ్లెట్ వేసుకొని తినేదని, రాత్రికి చికెన్ తినేదని ఆయన తెలిపారు. యుక్త వయస్సులో ఆమె బలహీనంగా ఉన్నప్పుడు గుడ్లు బాగా తినాలని ఓ డాక్టర్ ఇచ్చిన సలహా మేరకు ఆమె గుడ్లు ఎక్కువ తినడం అలవాటు చేసుకున్నారట అని ఆయన వివరించారు. ఒంటరిగా జీవించడం ఎక్కువ కాలం బతకడానికి ఒక్క కారణం మాత్రమేనని, జన్యువులు, డైట్ కూడా తన ఆరోగ్యానికి దోహదం చేశాయని ఎమ్మా శతాధిక వృద్ధురాలిగా పుట్టిన రోజులు జరుపుకున్న సందర్భంగా వివిధ పత్రికలకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో తెలిపారు. తన తల్లి 91 ఏళ్ల వరకు, తన ఏడుగురు చెల్లెళ్లు వందేళ్లకు పైగా జీవించారని ఎమ్మా పేర్నొన్నారు. 90 ఏళ్ల వరకు పొద్దున రెండు గుడ్లు, మధ్యాహ్నం ఒక్క ఆమ్లెట్, రాత్రికి కూరగాయలు, అప్పుడప్పుడు పళ్లు తింటూ వచ్చానని ఆమె తెలిపారు. ఆ తర్వాత నుంచి రోజు ఉదయం రెండు గుడ్లు, రాత్రికి బిస్కట్లు తింటున్నానని ఆమె చెప్పారు. ఆమె జీవితం గురించి వివిధ పత్రికల్లో వచ్చిన కథనాల ప్రకారం ఎమ్మా మొరానో ఇటలీ పైడ్మాంట్ ప్రాంతంలో 1899, నవంబర్ 29వ తేదీన జన్మించారు ఆమె యుక్త వయసులో ఓ యువకుడిని ప్రేమించారు. అయితే మొదటి ప్రపంచ యుద్ధంలో ఆ యువకుడు మరణించడంతో ఆమె ఇక ఎవరిని ప్రేమించలేకపోయారు. పెళ్లి కూడా చేసుకోవాలనుకోలేదు. కుటుంబం బలవంతం మీద 27వ ఏట పెళ్లి చేసుకున్నారు. కానీ సంసారం అన్యోన్యంగా సాగలేదు. ఆరునెలల వయస్సులో తన మగశిశువు మరణించడంతో 1938లో భర్తకు విడాకులు ఇచ్చారు. అయితే ఆయన 1978లో చనిపోయే వరకు విడిపోయినా ఎమ్మాతోనే కలసి జీవించారు. 1978 నుంచి ఎమ్మా పూర్తి ఒంటరిగానే జీవిస్తూ వచ్చారు. తనపై ఎవరి పెత్తనాన్ని తాను అంగీకరించనని, అందుకే ఒంటరిగా జీవించినా బాధ పడలేదని ఎమ్మా చెప్పారు. ఇప్పటికీ సొంత ఫ్లాట్‌లోనే నివసిస్తున్న ఆమెకు ఇరుగుపొరుగు వారు ఎప్పుడూ చేదోడు వాదోడుగా ఉంటారు. మంగళవారం 117 పుట్టిన రోజు సందర్భంగా వారంతా వచ్చి వేడుకను ఉన్నంతలో ఘనంగా జరిపించారు. ఆమె డాక్టర్ కార్లో కూడా అప్పుడప్పుడు వచ్చి యోగక్షేమాలు కనుక్కొని పోతుంటారు. బహూశా ఎమ్మా బామ్మకు మరణం లేకపోవచ్చని డాక్టర్ కార్లో వ్యాఖ్యానించారు.