‘హోల్డింగ్ అప్ ఏ ట్రైన్’.. అని హెన్రీ కథ ఒకటి ఉంది. అందులో కథానాయకుడు గన్ పాయింట్ లో ట్రైన్ రాబరీ చేస్తుంటే.. బోగీల్లో ఉన్న పురుష ప్రయాణికులు గజగజ వణికి పోతుంటారు. మహిళా ప్రయాణికులు మాత్రం భయమన్నదే లేకుండా.. ‘రైలు దోపిడీ ఇలాగుంటుందా..’ అన్నట్లు కళ్లు టపటపలాడిస్తూ కుతూహలంగా చూస్తుంటారు! మంగళవారం ఉదయం సూయజ్ కెనాల్ లో ఓ భారీ షిప్పు.. కడుపు లో బిడ్డ అడ్డం తిరిగినట్లుగా.. అడ్డంగా నిలిచి పోగానే అటు ఇటు ట్రాఫిక్ జామ్ అయింది. వెనుక షిప్ లలో ఉన్న మగాళ్ల బీపీ పెరిగిపోతోంది.
వాళ్లలో ఉన్న జూలియాన్ అనే ఆవిడ మాత్రం ‘ఇట్స్ ఫన్నీ’ అని చిరునవ్వులు చిందిస్తూ తను ఉన్న షిప్ లోంచి, ఆగిపోయిన ఆ భారీ షిప్ ఫొటో తీసి తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. అయితే మన స్టోరీ జూలియా పై కాదు. పురుషుల బీపీ మీదా కాదు. సూయజ్ కెనాల్‌లో ట్రాఫిక్ జామ్ క్లియర్ అయిందా? అసలు అలా ఎలా ఆ షిప్పు ఇరుక్కుపోయింది? సూయజ్ కెనాల్‌కు ఇలాంటి సమస్య ఇదే మొదటిసారా? సూయజ్ లో రోజుకు ఎన్ని షిప్ లు ప్రయాణిస్తాయి? ఆ కెనాల్‌ను ఎందుకు నిర్మించారు? ఎవరు నిర్మించారు? సూయజ్ పై హటాత్తుగా ఇన్ని ప్రశ్నలు రేకెత్తించి, ఇంత ఆసక్తిని కలుగజేసిన జూలియాన్‌కు ధన్యవాదాలు తెలువుకుంటూ ‘సూయజ్ కాలవ’లో కాసేపు ప్రయాణిద్దాం.
కొన్ని జలమార్గాల్లోనే భారీ ఓడలు వెళ్లగలవు. అందుకే పనామా కాలువ నుంచి వెళ్లలేని అల్ట్రా లార్జ్ కంటెయినర్ షిప్.. ‘ఎవర్ గివెన్’ చైనా నుంచి నెదర్లాండ్స్ వెళ్లేందుకు సూయెజ్ కాలువ ను ఎన్నుకుంది. అయితే ఊహించని విధంగా పెను గాలులు వీచడంతో మంగళవారం ఉదయం ఎవర్ గివెన్ నౌక ఒక్కసారిగా కెనాల్‌పై అడ్డంగా తిరిగి, ఉన్నచోటే ఉండిపోయింది. బుధవారం సాయంత్రం వరకు కూడా నౌకను తిరిగి యథాస్థితికి తెచ్చి కాలువపై ట్రాఫిక్‌ను పునరుద్ధరించేందుకు ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి.
మార్గానికి రెండువైపులా ఎక్కడి ఓడలు అక్కడే ఆగిపోయాయి! ‘ఎవర్ గివెన్’ తైవాన్‌లో తయారై, పనామాలో రిజిస్టర్ అయిన నౌక. అందులో వందలాదిగా కంటెయినర్‌లు ఉండిపోయాయి. సూయజ్ కాలువపై రవాణా మొత్తం స్తంభించిపోయింది. ఇక ప్రపంచ వాణిజ్యంలో ప్రతి ఏటా సుమారు 12 శాతం ఈ కాలువ ద్వారానే వ్యాపారం జరుగుతుంది. అంతేకాకుండా 8 శాతం సహజ వాయువు ఈ కాలువ ద్వారా వివిధ దేశాలకు రవాణా జరగుతోంది. ప్రతిరోజూ పది లక్షల బ్యారెల్స్ ఆయిల్ సరఫరా అవుతోంది. ప్రస్తుతం షిప్ చిక్కుకున్న కారణంగా గంటకు సుమారు 3వేల కోట్ల నష్టం జరిగే అవకాశం ఉన్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు.
400 మీటర్ల పొడవు, 59 మీటర్ల వెడల్పు ఉన్న ఈ అతి భారీ నౌక సూయజ్ నగర సమీపంలో సూయజ్ కాలువ ముఖద్వారానికి దక్షిణం వైపు నుంచి ఉత్తరానికి 6 కి.మీ. దూరంలో చిక్కుకుపోయింది. ఈ అనూహ్య ఘటనకు సంబంధించి ప్రపంచానికి అందిన తొలి ఫొటో.. జూలియన్ కోనా అనే మహిళ తీసి షేర్ చేసిన ఫొటో. ఎవర్ గివెన్ నౌక వెనక ఉన్న మేరస్క్ డెన్వర్ అనే ఓడలో ఆమె ప్రయాణిస్తున్నారు. తమ ముందున్న నౌక అలా విడ్డూరంగా కాలువకు అడ్డం తిరిగి ఆగిపోవడం ఆమెకు ఫన్నీగా అనిపించి ఫొటో తీసి ఇన్‌స్టాలో పెట్టుకున్నారట. గతంలో ఇలాంటివి జరగలేదని కాదు. జరిగినా ఐదారు గంటల్లో రద్దీని తొలగించ గలిగారు. ఈ సారి 36 గంటలు దాటుతున్నా ఎవర్ గివెన్‌ను కదిలించేందుకు ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. టగ్ బోట్లు, డిగ్గర్ నిర్విరామంగా పని చేస్తున్నాయి.
ఆ నౌకను దారిలో పెట్టడానికి బహుశా కొన్ని రోజులు పట్టవచ్చని ఈజిప్టులోని కెనాల్ నిర్వాహకులు ఇప్పటికే ఒక ఆందోళన సంకేతాన్ని విడుదల చేశారు కూడా! రెండు లక్షల 20 వేల టన్నుల బరువైన ఎవర్ గివెన్‌ను కదలిస్తే తప్ప ప్రస్తుతం ఆ మార్గంలో ఆగిపోయి ఉన్న సౌదీ, రష్యన్, ఒమన్, యు.ఎస్. ఇంధన ట్యాంకర్ ఓడలు ముందుకు కదలడానికి వీల్లేని పరిస్థితి. రోజూ కనీసం 50 నౌకలు ప్రయాణించే ఈ మార్గంలో ప్రస్తుతం చిన్న పెద్ద కలిపి వందకు పైగా నౌకలు నిలిచిపోయాయి. జూలియన్ కోలన్‌కు ఈ ఘటన ఫన్నీగా అనిపించినట్లే.. ట్విటిజెన్‌లు కొందరు ఫన్నీగా కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు.
‘‘మున్ముందు టగ్ బోట్లు, డిగ్గర్‌లలో అనుభవం కలిగిన వారికి ఉద్యోగావకాశాలు ఎక్కువ కావచ్చు. అందుకని ఫైనాన్స్ కోర్సులు బోర్ కొట్టేసిన విద్యార్థులు ఈ కోర్సులు చేయడం మంచిది’’ అని జే జాకబ్స్ అనే అతడు ట్వీట్ చేశారు. ‘షిప్ కేప్టన్‌లూ.. దయచేసి మీరు త్రీ పాయింట్ టర్న్‌లను (ఫార్వర్డ్, బ్యాక్‌వర్డ్, మళ్లీ ఫార్వర్డ్) మరింతగా ప్రాక్టీస్ చేయండి’ అని జిమ్ ఆర్మిటేజ్ అనే ఆయన ట్వీట్ చేశారు. సమస్యే సానుకూలతల్ని చూపిస్తుంది. అదే సానుకూలత రాగల కొద్ది గంటల్లో సూయజ్‌లోని ఈ తాత్కాలిక అడ్డును తొలగించి, ఎప్పటిలా సందడిగా మార్చవచ్చు.
సూయజ్ కాలువ (కృత్రిమ జలమార్గం)
- ఎక్కడ ఉంది? : ఈజిప్టులో
- కాలువ పొడవు : 193 కి.మీ.
- కాలువ లోతు : 78 అడుగులు
- కాలువ వెడల్పు : నీళ్ల అడుగున 21 మీటర్లు.; ఉపరితలంపై 60 నుంచి 90 అడుగులు)
- ఎక్కడి నుంచి ఎక్కడికి? : మధ్యదరాసముద్రం నుంచి ఎర్ర సముద్రం వరకు.
- కట్టింది ఎక్కడ? : సూయెజ్ భూసంధిపై (జలాల మధ్య భూమార్గం)
- బయల్దేరే రేవు: పోర్ట్ సయెద్ (మధ్యధరా తీరం వెంబడి ఈశాన్య ఈజిప్టు)
- చేరుకునే రేవు: పోర్ట్ ట్యూఫిక్ (ఎర్ర సముద్రపు పాయను ఆనుకుని ఈశాన్య ఈజిప్టు)
- నిర్మాణం మొదలైంది : 1859
- నిర్మాణం పూర్తయింది : 1869
- కెనాల్ ఉపయోగం : ఆసియా ఐరోపాల మధ్య షిప్పింగ్‌కి దగ్గరి దారి.
- కెనాల్ లేకుంటే? : షిప్పింగ్‌కి ఆఫ్రికా మీదుగా 7 వేల కి.మీ. దూరం చుట్టూ తిరగవలసి వచ్చేది.
- నౌక ప్రయాణ సమయం : వేగాన్ని బట్టి 11 నుంచి 16 గంటలు
- నౌక ప్రయాణ వేగం : గంటలకు 15 కి.మీ. (8 నాటికల్ కి.మీ.).
చదవండి:
Comments
Please login to add a commentAdd a comment