![Meet Zion Clark the fastest man on two hands - Sakshi](/styles/webp/s3/article_images/2023/01/23/Fast_Hands_runner.jpg.webp?itok=WFPdoPq9)
వైకల్యం అనేది మనసుకే కానీ, శరీరానికి కాదని నిరూపిస్తున్నవాళ్లు ఎందరో. కొందరి సంకల్పానికి ఏకంగా ప్రపంచ రికార్డులే బద్ధలు అవుతున్నాయి. ఆ జాబితాకు చెందిన వ్యక్తే జియాన్ క్లార్క్. కాళ్లు లేకుండా పుట్టాడని తల్లిదండ్రులు నడిరోడ్డు పాలు జేస్తే.. అనాథశ్రమంలో పెరిగి, ఆపై ఓ అమ్మ అండతో ఛాంపియన్‌గా ఎదిగిన పాతికేళ్ల వ్యక్తి కథ ఇది.
జియాన్‌కు కాళ్లు లేవు. అందుకే చేతులనే కాళ్లుగా మార్చేసుకుని ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. అత్యంత వేగంగా చేతులతో పరిగెత్తిన వ్యక్తిగా సరికొత్త రికార్డు నెలకొల్పాడు. 20 మీటర్ల దూరాన్ని.. కేవలం 4.78 సెకండ్లలో అదీ చేతులతో పరిగెత్తి చూపించాడు అతను. విశేషం ఏంటంటే.. 2021లోనే అతను ఆ ఘనత సాధించాడట. ఈ విషయాన్ని గిన్నిస్ వరల్డ్ రికార్డు వాళ్లు ట్విటర్ ద్వారా వీడియో రూపంలో తెలియజేశారు.
Meet Zion Clark, the fastest man on two hands 💪 pic.twitter.com/AVPNlT0cIT
— Guinness World Records (@GWR) January 22, 2023
క్లార్క్ స్వస్థలం ఒహియో స్టేట్‌లోని కొలంబస్ ప్రాంతం . వైకల్యంతోనే పుట్టాడతను. దానివల్ల నడుము కింది భాగం ఉండదు. కయుడాల్ రిగ్రెసివ్ సిండ్రోమ్ అనే పరిస్థితి అందుకు కారణం. పుట్టిన వెంటనే అతన్ని తల్లిదండ్రులు వదిలేశారు. దీంతో.. ఒహియోలోనే ఓ ఆశ్రమంలో పెరిగాడు. ఆపై ప్రముఖ అమెరికన్ స్టాక్‌మార్కెట్ నిపుణురాలు కింబర్లీ హాకిన్స్ అతన్ని కథ తెలిసి దత్తత తీసుకున్నారు.
హాకిన్స్ సంరక్షణలో క్లార్క్.. చదువుకున్నాడు. వీల్‌చైర్ రేసర్‌గా రాటుదేలాడు. అంతేకాదు మిక్స్‌డ్ మార్షల్ ఆర్టిస్ట్‌గా, రెజర్ల్‌గానూ అలరించాడతను. తన ఇద్దరు కన్నపిల్లలకు సమానంగా జియాన్‌ను పెంచిందామె. అతని జీవితం జియాన్ పేరుతో డాక్యుమెంటరీగా తీయగా.. అది సూడాన్స్ ఫిల్మ్‌ఫెస్టివల్‌కు ఎంపిక కావడంతో పాటు నెట్‌ఫ్లిక్స్‌లోనూ స్ట్రీమ్ అయ్యింది. ఈ డాక్యుమెంటరీకి 40 స్పోర్ట్స్ ఎమ్మీ అవార్డుల్లో రెండు ఎమ్మీలను దక్కించుకుంది కూడా.
ఇక ఆపై చేతులతో వేగంగా పరిగెత్తి గిన్నిస్ బుక్‌లోకి ఎక్కాడు. అయితే.. క్లార్క్ 2021లోనే ఆగిపోలేదు. కిందటి ఏడాది మరో రెండు గిన్నిస్ రికార్డులు నెలకొల్పాడు.త్వరలో మరో రెండు రికార్డులు నెలకొల్పనేందుకు రెడీ అవుతున్నాడు. తనకు జన్మనిచ్చిన వాళ్ల సంగతి ఏమోగానీ.. ఈ తల్లి రుణం తీర్చుకోలేనిదని చెప్తున్నాడు జియాన్.
Comments
Please login to add a commentAdd a comment