ఎనిమిది నెలల పసికందు అనే కనికరం లేకుండా.. పాత గొడవలు పట్టుకుని ఎన్నారై కుటుంబాన్ని పొట్టనబెట్టన బెట్టుకున్న మానవ మృగంపై నేరారోపణలు నమోదు అయ్యాయి. నిందితుడు మాన్యుయెల్ సల్గాడో(48)పై నాలుగు అభియోగాలు, అదనంగా మరో రెండు నమోదు అయినట్లు అధికారులు వెల్లడించారు. ఇక సోమవారం వీడియో విచారణ సందర్భంగా.. కేసు తీవ్రత దృష్ట్యా నిందితుడికి తన తరపున వాదనలు వినిపించేందుకు న్యాయవాది నియామకానికి కేవలం రెండు రోజుల గడువు మాత్రమే ఇచ్చింది మెర్స్‌డ్ కౌంటీ డిస్ట్రిక్ అటార్నీ కార్యాలయం.
పంజాబ్‌కు చెందిన ఎన్నారై సిక్కు కుటుంబంలో జస్దీప్ సింగ్(36), అతని భార్య జస్లీన్ కౌర్, ఎనిమిది నెలల కూతురు ఆరూహీ ధేరి, దగ్గరి బంధువు అమన్ దీప్ సింగ్(39)లను తుపాకీ చూపించి మరీ కిడ్నాప్ చేసి.. ఆపై దారుణంగా హతమార్చాడు సల్గాడో. కిడ్నాప్ అయిన వాళ్ల కోసం పోలీసులు గాలిస్తున్న క్రమంలో.. ఈ వ్యవహారం విషాదంగా ముగిసింది. నలుగురు మృతదేహాలను మెర్స్‌డ్ కౌంటీలోని ఓ పండ్ల తోటలో పడేశారు. నిందితుడిని పోలీసులు అదుపు తీసుకునే సమయంలో ఆత్మహత్యకు ప్రయత్నించగా.. వైద్యం అందడంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు.
ఇక కిడ్నాప్‌నకు సంబంధించిన వీడియో సైతం పోలీసుల ద్వారా బయటకు రిలీజ్ అయ్యింది. ఈ నేపథ్యంలో నిందితుడిని వదల్లదంటూ బాధిత కుటుంబం, మెర్స్‌డ్ అధికారుల్ని వేడుకుంటోంది. జీవిత ఖైదుగానీ, మరణ శిక్షగానీ ఆస్కారం ఉండొచ్చని న్యాయ నిపుణులు చెప్తున్నారు. ఇక నాలుగు హత్యలకు సంబంధించి సల్గాడోపై వేర్వేరు కేసులు నమోదు చేసినట్లు తెలుస్తోంది. అతని సోదరుడు ఆల్బర్ట్ సల్గాడోపై సైతం కుట్రకు సహకరించిన నేరం, ఆధారాలు మాయం చేసే యత్నాల కింద కేసు నమోదు అయ్యింది.
సల్గాడో ఒకప్పుడు సింగ్ కుటుంబం నిర్వహించిన ట్రక్కు వ్యాపారంలో పనిచేశాడు. అప్పటి నుంచే వాళ్లతో అతనికి గొడవలు ఉన్నాయి. ఈ నేపథ్యమే ఈ దారుణానికి కారణమైందని అధికారులు, సింగ్ కుటుంబ బంధువులు చెప్తున్నారు.
కిడ్నాప్, హత్య కేసులతో పాటు అక్రమంగా ఆయుధాలు కలిగి ఉండటం, ట్రక్కుకు నిప్పంటించడం లాంటి అభియోగాలు ఎదుర్కొనున్నాడు. ఈ నేరారోపణలు రుజువైతే గనుక.. పెరోల్ కూడా దొరక్కుండా జీవితాంతం సల్గాడో జైలులోనే మగ్గాల్సి ఉంటుందని మెర్స్‌డ్ కౌంటీ డిస్ట్రిక్ అటార్నీ కార్యాలయం వెల్లడించింది. ఇక మరణ శిక్ష విధింపు అనేది న్యాయమూర్తుల విచక్షణపై ఆధారపడి ఉంటుందని తెలిపింది. ఎన్నారై కుటుంబంపై దారుణానికి తెగ బడే నెలల ముందు నుంచి.. వాళ్లను వెంబడించాడని, వాళ్ల కదలికలను నిశితంగా గమనించాడని పోలీసులు వెల్లడించారు.
సల్గాడో గతం మొత్తం నేర చరిత్రేనని పోలీసులు చెప్తున్నారు. దొంగతనం, ఆయుధాల చోరీ, అక్రమ ఆయుధాల్ని కలిగి ఉన్న ఆరోపణలు రుజువు కావడంతో పదేళ్లకు పైగా జైలు జీవితం గడిపాడు. ఓ ఇంట్లో చొరబడిన కేసులో 2005లో జైలుకు వెళ్లాడు. 2007లో అతనికి పదకొండేళ్ల శిక్ష పడింది. ఆ తర్వాత దానిని ఎనిమిదేళ్లకు కుదించారు. దీంతో 2015 నుంచి 2018 వరకు పెరోల్ మీద అతను ముందుగానే అతను బయటకు వచ్చాడు. ఈ నేపథ్యంలో తాజా నేరాల తీవ్రత ఆధారంగా అతను మళ్లీ బయటకు వచ్చే అవకాశాలు లేవని న్యాయ నిపుణులు చెప్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment