NRIs death
-
ఆ మానవ మృగాన్ని బయటకు వదలొద్దు!
ఎనిమిది నెలల పసికందు అనే కనికరం లేకుండా.. పాత గొడవలు పట్టుకుని ఎన్నారై కుటుంబాన్ని పొట్టనబెట్టన బెట్టుకున్న మానవ మృగంపై నేరారోపణలు నమోదు అయ్యాయి. నిందితుడు మాన్యుయెల్ సల్గాడో(48)పై నాలుగు అభియోగాలు, అదనంగా మరో రెండు నమోదు అయినట్లు అధికారులు వెల్లడించారు. ఇక సోమవారం వీడియో విచారణ సందర్భంగా.. కేసు తీవ్రత దృష్ట్యా నిందితుడికి తన తరపున వాదనలు వినిపించేందుకు న్యాయవాది నియామకానికి కేవలం రెండు రోజుల గడువు మాత్రమే ఇచ్చింది మెర్స్‌డ్ కౌంటీ డిస్ట్రిక్ అటార్నీ కార్యాలయం. పంజాబ్‌కు చెందిన ఎన్నారై సిక్కు కుటుంబంలో జస్దీప్ సింగ్(36), అతని భార్య జస్లీన్ కౌర్, ఎనిమిది నెలల కూతురు ఆరూహీ ధేరి, దగ్గరి బంధువు అమన్ దీప్ సింగ్(39)లను తుపాకీ చూపించి మరీ కిడ్నాప్ చేసి.. ఆపై దారుణంగా హతమార్చాడు సల్గాడో. కిడ్నాప్ అయిన వాళ్ల కోసం పోలీసులు గాలిస్తున్న క్రమంలో.. ఈ వ్యవహారం విషాదంగా ముగిసింది. నలుగురు మృతదేహాలను మెర్స్‌డ్ కౌంటీలోని ఓ పండ్ల తోటలో పడేశారు. నిందితుడిని పోలీసులు అదుపు తీసుకునే సమయంలో ఆత్మహత్యకు ప్రయత్నించగా.. వైద్యం అందడంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. ఇక కిడ్నాప్‌నకు సంబంధించిన వీడియో సైతం పోలీసుల ద్వారా బయటకు రిలీజ్ అయ్యింది. ఈ నేపథ్యంలో నిందితుడిని వదల్లదంటూ బాధిత కుటుంబం, మెర్స్‌డ్ అధికారుల్ని వేడుకుంటోంది. జీవిత ఖైదుగానీ, మరణ శిక్షగానీ ఆస్కారం ఉండొచ్చని న్యాయ నిపుణులు చెప్తున్నారు. ఇక నాలుగు హత్యలకు సంబంధించి సల్గాడోపై వేర్వేరు కేసులు నమోదు చేసినట్లు తెలుస్తోంది. అతని సోదరుడు ఆల్బర్ట్ సల్గాడోపై సైతం కుట్రకు సహకరించిన నేరం, ఆధారాలు మాయం చేసే యత్నాల కింద కేసు నమోదు అయ్యింది. సల్గాడో ఒకప్పుడు సింగ్ కుటుంబం నిర్వహించిన ట్రక్కు వ్యాపారంలో పనిచేశాడు. అప్పటి నుంచే వాళ్లతో అతనికి గొడవలు ఉన్నాయి. ఈ నేపథ్యమే ఈ దారుణానికి కారణమైందని అధికారులు, సింగ్ కుటుంబ బంధువులు చెప్తున్నారు. కిడ్నాప్, హత్య కేసులతో పాటు అక్రమంగా ఆయుధాలు కలిగి ఉండటం, ట్రక్కుకు నిప్పంటించడం లాంటి అభియోగాలు ఎదుర్కొనున్నాడు. ఈ నేరారోపణలు రుజువైతే గనుక.. పెరోల్ కూడా దొరక్కుండా జీవితాంతం సల్గాడో జైలులోనే మగ్గాల్సి ఉంటుందని మెర్స్‌డ్ కౌంటీ డిస్ట్రిక్ అటార్నీ కార్యాలయం వెల్లడించింది. ఇక మరణ శిక్ష విధింపు అనేది న్యాయమూర్తుల విచక్షణపై ఆధారపడి ఉంటుందని తెలిపింది. ఎన్నారై కుటుంబంపై దారుణానికి తెగ బడే నెలల ముందు నుంచి.. వాళ్లను వెంబడించాడని, వాళ్ల కదలికలను నిశితంగా గమనించాడని పోలీసులు వెల్లడించారు. సల్గాడో గతం మొత్తం నేర చరిత్రేనని పోలీసులు చెప్తున్నారు. దొంగతనం, ఆయుధాల చోరీ, అక్రమ ఆయుధాల్ని కలిగి ఉన్న ఆరోపణలు రుజువు కావడంతో పదేళ్లకు పైగా జైలు జీవితం గడిపాడు. ఓ ఇంట్లో చొరబడిన కేసులో 2005లో జైలుకు వెళ్లాడు. 2007లో అతనికి పదకొండేళ్ల శిక్ష పడింది. ఆ తర్వాత దానిని ఎనిమిదేళ్లకు కుదించారు. దీంతో 2015 నుంచి 2018 వరకు పెరోల్ మీద అతను ముందుగానే అతను బయటకు వచ్చాడు. ఈ నేపథ్యంలో తాజా నేరాల తీవ్రత ఆధారంగా అతను మళ్లీ బయటకు వచ్చే అవకాశాలు లేవని న్యాయ నిపుణులు చెప్తున్నారు. -
భార్యా, పిల్లాడిని హతమార్చి..
లండన్: ఆదివారం అర్థరాత్రి వెస్ట్ లండన్ పోలీసులకు రెండు, మూడు ఫోన్లు వచ్చాయి. బ్రెంట్‌ఫోర్డ్‌లోని ఓ అపార్ట్మెంట్లో నాలుగవ అంతస్తు ఫ్లాట్‌లో నివసిస్తోన్న కుహరాజ్ సీతమ్‌పరమనాథన్ (42) ఇంట్లో ఎవరూ ఫోన్లు ఎత్తడం లేదని, వారికేమయిందో తెలసుకోవాలన్నదే ఆ ఫోన్ల సారాంశం. పోలీసులు ఆదివారం రాత్రే ఆ ఫ్లాట్‌కు వెళ్లగా లోపలి నుంచి ఎలాంటి శబ్దాలు వినిపించలేదు. తలుపులు కొట్టినా ఎవరూ పలుకలేదు. తలుపులు లోపలి నుంచి లాక్ చేశారా, బయటి నుంచి లాక్ చేసి కుటుంబ సభ్యులు ఎక్కడికైనా వెళ్లారా? తెలియక పోలీసులు వెనుతిరిగి వచ్చారు. పోలీసులు మళ్లీ ఆ ఫ్లాట్‌కు వెళ్లి చూడగా లోపలి నుంచి ఎలాంటి అలికిడి వినిపించలేదు. పోలీసులు ఇక లాభం లేదనుకొని తలుపులు బద్దలు కొడుతుండగా ఏదో దబ్బున పడిపోయిన శబ్దం వినిపించింది. డైనింగ్ హాల్లో తల నుంచి రక్తం కారుతున్న కుహ రాజ్ మతదేహం కనిపించింది. అప్పుడప్పుడే ప్రాణం పోయినట్లు శరీరం నుంచి కారుతున్న వెచ్చని రక్తం తెలియజేస్తోంది. ఇల్లంతా పోలీసులు వెతికి చూడగా, భార్య 36 ఏళ్ల పూర్ణ కామేశ్వరి శివరాజ్, వారి కుమారుడు మూడేళ్ల కైలేష్ కుహరాజ్, పెంపుడు కుక్క వేర్వేరు చోట రక్తం మడుగుల్లో పడి ఉన్నారు. అందరి మెడలు కత్తితో కోసి చంపినట్లు ఉన్నాయి. భార్యా పిల్లడు మరణించి వారం, పది రోజులు అయింటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. సెప్టెంబర్ 21వ తేదీ నుంచి ఆ ఇంటికి, ఎవరు వచ్చి పోయినట్లుగా, ఇంట్లో మనిషులున్నట్లు అలికిడి వినిపించలేదని ఇరుగు పొరుగువారు పోలీసు విచారణలో తెలిపారు. చూడ ముచ్చటైన జంటని, అన్యోన్యంగానే ఉండేవారని, అపార్ట్మెంట్లో ఎవరు కనిపించినా కుహరాజ్ హలో అని నవ్వుతూ పలకరించే వారని, కుక్క పిల్లను వాహ్యాలికి బయటకు తీసుకెళ్లినప్పుడు కూడా భార్యాభర్తలు నవ్వుతూ అందరిని పలకరించే వారని వారు చెప్పారు. అప్పుడప్పుడు భార్యాభర్తలు అరచుకోవడం వినిపించేదని, కొన్ని సార్లు ఇద్దరి మధ్య సుదీర్ఘంగా వాగ్వాదం జరిగేదని కూడా చెప్పారు. ఆ మాత్రం గొడవలు ప్రతి ఇంట్లో, ప్రతి జంట మధ్య ఉండేవేనని వారన్నారు. ఇలా చంపుకోవాల్సినంత కర్మ వారికెందుకొచ్చిందో పాపం! అంటూ ఇరుగుపొరుగు వారు సానుభూతి చూపించారు. పోలీసులు మాత్రం కుహ రాజ్‌పై హత్యా, ఆత్మహత్య కేసులను నమోదు చేసుకొని వెళ్లారు. మృతదేహాలకు గురువారం నాడు పోస్ట్ మార్టమ్ నిర్వహిస్తారని, ఈ హత్యలకు సంబంధించి ఎలాంటి సమాచారం తెలిసినా తమకు అందజేసి తమ దర్యాప్తునకు సహకరించాల్సిందిగా డిటెక్టివ్ చీఫ్ ఇన్స్పెక్టర్ సైమన్ హార్డెన్ అపార్ట్మెంట్ వాసులకు, మీడియాకు విజ్ఞప్తి చేశారు. మలేసియాకు చెందిన ఆ తమిళ జంట 2015లో కౌలాలంపూర్‌లో తమ పెళ్లిని రిజిస్టర్ చేయించుకున్నారు. (చదవండి: భార్యను కాపురానికి తీసుకెళ్లకుండా వేధింపులు) -
అమెరికాలో రోడ్డు ప్రమాదం.. ఎన్నారై మృతి
వాషింగ్టన్(యూఎస్ఏ): అమెరికాలోని కొలంబస్ నగరంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో భారతీయుడు చనిపోగా ఆయన భార్య తీవ్రంగా గాయపడ్డారు. అన్షుల్ శర్మ(30), ఆయన భార్య సమిరా భరద్వాజ్(29) ఆదివారం ఉదయం నడిచి వెళ్తుండగా వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు వారిపైగా దూసుకెళ్లింది. ఈ ఘటనలో అన్షుల్ శర్మ తలకు తీవ్ర గాయాలు కావటంతో అక్కడికక్కడే చనిపోయాడు. తీవ్రంగా గాయపడిన ఆయన భార్య సమిరా భరద్వాజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. మద్యం మత్తులో ఉన్న మైఖేల్ డిమాయో(36) అనే వ్యక్తి ఈ ఘటనకు కారకుడని గుర్తించిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. అతనిపై పలు సెక్షన్ల కింద కేసులు పెట్టారు. కొలంబస్ నగరంలోని కుమ్మిన్స్ అనే డీజిల్ ఇంజిన్ల తయారీ కర్మాగారంలో ఇంజినీర్‌గా అన్షుల్ శర్మ పనిచేస్తున్నారు. ప్రస్తుతం సమిరా భరద్వాజ్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అన్షుల్ మృతదేహాన్ని ఇండియాకు తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. అతని కుటుంబానికి తామంతా అండగా ఉంటామని ఎన్నారై బృందం తెలిపింది.