బ్యాంకాక్: మయన్మార్ సైనిక పాలకులు నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ పార్టీకి చెందిన మాజీ ప్రజాప్రతినిధితోపాటు మరో ముగ్గురికి ఉరిశిక్షలు అమలు చేశారు. ఆంగ్ సాన్ సుకీ ప్రభుత్వంలో కీలక నేతగా ఉన్న ఫియో జెయా థావ్(41), హక్కుల కార్యకర్తలైన క్యావ్ మిన్ యు(53), హలా మియో ఆంగ్, ఆంగ్ థురా జావ్ ఉరికంబం ఎక్కారు. వీరికి క్షమాభిక్ష పెట్టాలంటూ ప్రపంచదేశాల నుంచి ఒత్తిడులు వచ్చినా శిక్షలను అమలు చేసినట్లు అధికార మిర్రర్ డైలీ వార్తా పత్రిక తెలిపింది.
ఉగ్రవాద చర్యలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వీరికి చట్ట ప్రకారమే ఉరి శిక్షను అమలు చేసినట్లు వెల్లడించింది. శిక్షలను ఎప్పుడు అమలు చేసిందీ వెల్లడించలేదు. తన భర్తకు ఉరిశిక్ష అమలు చేసిన విషయం తెలియదని ఫియో జెయా థావ్ భార్య తెలిపారు.
ఈ విషయమై అధికారులను సంప్రదించేందుకు ప్రయత్నిస్తున్నానన్నారు. ఈ పరిణామంపై సైనిక ప్రభుత్వం ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. కాగా, చివరి సారిగా 1976లో సలాయ్ టిన్ మౌంగ్ వూ అనే విద్యార్థి నేతకు అప్పటి సైనిక ప్రభుత్వం ఉరిశిక్ష అమలు చేసింది. సైనికపాలకులు ప్రజలను భయపెట్టేందుకే ఇలాంటి శిక్షలను అమలు చేస్తున్నారని హక్కుల నేతలు అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment