
అమెరికా విషయంలో ఏదైతే అది అయ్యిందనే నిర్ణయానికొచ్చింది భారత్. ఇప్పటిరకూ అమెరికాతో సంబంధాలపై ఆచితూచి అడుగులేసిన భారత్.. ఇప్పుడు ఒక అడుగు ముందుకేసి రష్యాతో వాణిజ్య ఒప్పందానికే ఓకే చెప్పింది. గత కొంతకాలంగా ట్రంప్ విధించే సుంకాలపై సహనంగా ఉన్న భారత్.. అమెరికా ఆయుధాల కొనుగోలుకు తాత్కాలికంగా ఫుల్‌స్టాప్ పెట్టింది. ‘రోజూ భయపడుతూ కూర్చుంటే ట్రంప్ ఏదొక నిర్ణయంతో ఇరకాటంలో పెడుతూనే ఉంటారని నిర్ణయానికి ముగింపు పలకాలనే ఉద్దేశంతో భారత్.. ఎట్టకేలకు స్పందించింది. ఎంత సుంకాన్ని అయినా భరిస్తామని, అయితే రష్యాతో వాణిజ్య ఒప్పందం విషయంలో రాజీ పడేది లేదనే సంకేతాలు పంపింది.
ఇప్పటివరకూ అమెరికాను మిత్రదేశంగా భావించిన భారత్.. ఉపయోగం లేని మిత్రత్వం అవసరం లేదనే విషయాన్ని యూఎస్‌కు అర్థమయ్యేలా చెప్పేసింది. తర్వాత పరిస్థితులు ఎలా ఉన్నా. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బెదిరింపులకు తాము లొంగమనే విషయాన్ని తేటతెల్లం చేసింది.
నెతాన్యాహూ భారత్ పర్యటన..?
అమెరికా-భారత్‌ల మిత్రత్వం దాదాపు చెడిందనే సంకేతాల నడుమ ఇజ్రాయిల్ రంగంలోకి దిగింది. ఇజ్రాయిల్ ప్రధాని నెతాన్యాహూ భారత్ పర్యటనకు రాబోతున్నట్లు తెలుస్తోంది. భారత పర్యటనలో నెతాన్యాహూ మోదీని కలిసి ఓ సలహా ఇవ్వనున్నారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
మరి ఆ సలహా ఏమిటనేది పక్కన పెడితే.. డొనాల్డ్ ట్రంప్‌కు అత్యంత సన్నిహితుడైన నెతాన్యాహూ భారత్‌కు ఎందుకు రానున్నారనే చర్చ నడుస్తోంది. ఇది అమెరికా ఆడుతున్న డ్రామాగా ఉంందని మరొక వాదన వినిపిస్తోంది. అమెరికాతో వాణిజ్య సంబంధాలను తాత్కాలికంగా పక్కన పెట్టిన భారత్‌ను ఒప్పించేందుకు నెతాన్యాహూను ట్రంప్ రాయబారిగా పంపడానికి సిద్ధమయ్యారనే వాదన తెరపైకి వచ్చింది.
ప్రత్యేకంగా రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు ఫోన్ చేసి మోదీ మాట్లాడటం, అమెరికా ఆయుధాలను, వైమానిక క్షిపణులకు కొనుగోలుపై భారత్ విముఖత వ్యక్తం చేసిన తరుణంలో నెతాన్యాహూ ఆ దిశగానే మోదీతో మాట్లాడేందుకు వస్తున్నట్లు తెలుస్తోంది. అమెరికా అనేది భారత్‌కు అతిపెద్ద మార్కెట్ అనే అంశం అందరికి తెలిసిందే. ఆటువంటి తరుణంలో కూడా భారత్.. అమెరికాతో రాజీ పడేందుకు సిద్ధంగా లేకపోవడంతో నెతాన్యాహూను ట్రంప్ రంగంలోకి దింపే ఆలోచన కూడా చేసి ఉండొచ్చు.
ట్రంప్ అందితే జుట్టు, అందకపోతే కాళ్లు పట్టుకుంటారనే విమర్శ కూడా ఆయనపై ఉంది. అగ్రరాజ్యం అమెరికా అనేది మినహాయిస్తే ఇక్కడ ట్రంప్ గొప్పతనం ఏమీ లేదు. తాము చెప్పినట్లు ‘ఆడాలని’ ట్రంప్ అనుకుంటూ ఉంటారని, అది అన్ని దేశాలతో కుదరదనే విషయం భారత్ చెప్పకనే చెప్పేసింది.. ఇప్పుడు భారత్, రష్యా, చైనాల మైత్రితో అమెరికాకు గుండెల్లో రాయి పడినట్లే ఉంది.
మూడు అగ్రదేశాలు ఏకం అవుతున్న తరుణంలో డొనాల్డ్ ట్రంప్‌ను కాస్త ఇరకాటంలో పడేసినట్లే ఉంది. ఎప్పుడూ భారత్‌కు వ్యతిరేకంగా ఉండే చైనా కూడా, ఇప్పుడు ట్రంప్ బెదిరింపులను తట్టుకోలేకపోతోంది. మన మంచిని కోరలేని శత్రువుకు అంగుళం చోటిస్తే మొత్తం ఆక్రమిస్తారంటూ ట్రంప్ వైఖరిని తీవ్రంగా తప్పుపట్టింది.
ఈ అన్ని అంశాలను బేరీజు వేసుకున్న ట్రంప్.. నెతాన్యాహూను అనధికార రాయబారిగా పంపుతున్నారా? అనేది ఇప్పుడు చర్చకు దారి తీసింది. ఒకవేళ నెతాన్యాహూ భారత్ పర్యటనకు వస్తే మాత్రం, కచ్చితంగా అమెరికాతో భారత్ సంబంధాలపై మాట్లాడి రాజీ కుదిర్చే అవకాశాల్ని కూడా కొట్టిపారేయలేం. ఇంకా భారత్-అమరికాల బంధం చాలా బలంగా ఉందని స్వయంగా నెతాన్యాహూ చెప్పిన తరుణంలో.. ఆ దిశగానే పావులు కదిపే అవకాశం ఉంది.