అనారోగ్యరీత్యా మూడు వారాలు బెయిలు ఇచ్చిన ఇరాన్ అధికారులు
పారిస్: నోబెల్ శాంతి బహుమతి గ్రహీత నర్గీస్ మొహమ్మదీ బుధవారం ఇరాన్‌లోని టెహ్రాన్‌లోని ఎవిన్ కారాగారం నుంచి విడుదలయ్యారు. అనారోగ్య కారణాలరీత్యా ఆమెకు మూడు వారాలపాటు శిక్షను నిలుపుదల చేసి జైలు అధికారులు విడుదలచేశారు. తిరిగి జైలులో లొంగిపోయాక ఈ మూడువారాలు అదనంగా శిక్షాకాలంగా అనుభవించాల్సి ఉంటుంది. గత రెండేళ్లలో తొలిసారిగా తన తల్లితో ఫోన్‌లో మాట్లాడానని పారిస్‌లో ఉంటున్న నర్గీస్ కుమారుడు అలీ రహ్మానీ తెలిపారు.
ఆమె జైలు నుంచి విడుదలయ్యాక 2022–2023 నిరసన ఉద్యమ నినాదం అయిన ‘మహిళల జీవితానికి స్వేచ్ఛ లభించాలి’అని నినదించారు. ‘‘ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నా మానసికంగా బాగున్నారు. పోరాట పటిమ ఆమెలో అలాగే ఉంది. హిజాబ్ లేకుండా జైలు నుంచి బయటకు రాగలిగా’’అని తన తల్లి చెప్పిందని కుమారుడు రహా్మనీ వెల్లడించారు. మహిళల హక్కులకోసం ఇరాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆమె అలుపెరగని పోరాటం కొనసాగిస్తారని పేర్కొన్నారు.
ఇరాన్‌లో హిజాబ్ ధారణపై అత్యంత కఠిన చట్టాలు, ఇతర నేరాలకు మరణశిక్ష అమలును వ్యతిరేకంగా పోరాడిన నర్గీస్‌ను అరెస్ట్ చేసిన ఇరాన్ పోలీసులు పల సెక్షన్ల కింద దోషిగా తేల్చారు. దీంతో ఆమె 2021 నవంబర్ నుంచి ఎవిన్ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. దశాబ్ద కాలంగా జైలు జీవితం గడుపుతున్న ఆమె కొన్నేళ్లుగా కనీసం భర్త, కవల పిల్లలను చూడలేదు.
ఆమె కారాగార శిక్ష అమలును 21 రోజులు నిలుపుదల చేశారని, ఆ 21 రోజులను ఆమె తిరిగి జైలుకెళ్లాక అదనంగా శిక్షాకాలాన్ని అనుభవించాల్సి ఉంటుందని ఆమె మద్దతుదారులు ఆగ్రహం వ్యక్తంచేశారు. బెయిలును కనీసం మూడు నెలలకు పొడిగించాలని ఆమె మద్దతుదారులు డిమాండ్ చేశారు. ఆమె అనారోగ్యం కారణంగా వైద్యుల సలహా మేరకు ప్రాసిక్యూటర్ విడుదలకు అనుమతించారని న్యాయవాది ముస్తఫా నీలీ తెలిపారు.
ఆమెకు ఉన్న కణితి ప్రాణాంతకం కాదని, అయితే ప్రతి మూడు నెలలకోసారి ఆమెకు వైద్యపరీక్షలు అవసరమని లాయర్ వెల్లడించారు. జైలులోనూ నర్గీస్ పోరాట మార్గాన్ని వీడలేదు. ఎవిన్ జైలు ఆవరణలో నిరసనలు చేపట్టారు. నిరాహార దీక్షలు చేశారు. ఇరాన్‌లో మహిళలపై జరుగుతున్న దారుణమైన అణచివేతను ఆమె సెప్టెంబర్‌లో జైలు నుంచి రాసిన లేఖలోనూ ఖండించారు. 2022–2023లో అయతుల్లా అలీ ఖమేనీ ఆధ్వర్యంలో ఇస్లామిక్ అధికారులను గద్దె దింపాలని కోరుతూ జరిగిన నిరసనలకు నర్గీస్ పూర్తి మద్దతు తెలిపారు. దేశానికి వ్యతిరేకంగా ప్రచారం చేసినందుకు జూన్‌లో ఆమెకు మరో ఏడాది జైలు శిక్ష పడింది.
Comments
Please login to add a commentAdd a comment