
కొలంబో: ఆర్థికంగా తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొద్ది రోజుల క్రితం వరకు ప్రజాగ్రహంతో దేశం మొత్తం ఆందోళనలతో అట్టుడుకింది. ఇటీవలే కొత్త అధ‍్యక్షుడు, ప్రధాని బాధ్యతలు చేపట్టగా నిరసనలు కాస్త సద్దుమణిగినట్లు తెలుస‍్తోంది. అయితే.. జులై 9న గొటబయ రాజపక్స రాజీనామా చేయాలంటూ అధ్యక్ష భవనాన్ని చుట్టు ముట్టారు నిరసనకారులు. ప్రధాని నివాసానికి నిప‍్పు పెట్టారు. అధ్యక్షుడి భవనంలోకి ప్రవేశించి రచ్చ రచ్చ చేశారు. ఇదే అదునుగా కొందరు చేతివాటం చూపించినట్లు తెలుస్తోంది. అధ‍్యక్ష, ప్రధాని భవనాల్లోని అత్యంత విలువైన, పురాతనమైన 1,000కిపైగా వివిధ కళాకృతులు కనిపించకుండా పోయాయి.
ప్రత్యేక బృందాల ఏర్పాటు..
రెండు భవనాల్లో ఎన్ని కళాఖండాలు మిస్సయ్యాయనేది ప్రాథమిక విచారణ తర్వాత తేలుతుందని అధికారులు తెలిపారు. అయితే.. శ్రీలంక పురావస్తు శాఖ వద్ద ఎలాంటి రికార్డులు లేకపోవటం వల్ల కచ్చితమైన సంఖ్యను కనిపెట్టలేరని వెబ్ పోర్టల్ కొలంబో పేజ్ పేర్కొంది. వెయ్యికిపైగా విలువైన కళాఖండాలు చోరీకి గురైన సంఘటనపై దర్యాప్తు చేపట్టేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది ప్రభుత్వం.
భవనాల ముట్టడి..
ఆర్థిక సంక్షోభానికి పాలకుల నిర్ణయాలే కారణమని, అధ‍్యక్షుడు, ప్రధాని రాజీనామా చేయాలనే పిలుపు మేరకు లక్షల మంది ఒక్కసారికి రోడ్లపైకి వచ్చారు. జులై 9న అధ్యక్ష భవనాన్ని చుట్టు ముట్టారు. దీంతో అప్పటి అధ్యక్షుడు గొటబయ రాజపక్స దేశం విడిచి పారిపోయారు. ఈ క్రమంలో భవనంలోకి ప్రవేశించిన నిరసనకారులు అక్కడ గుట్టలకొద్ది నోట్ల కట్టలను గుర్తించి పోలీసులకు అప్పగించారు. కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో చక్కర‍్లు కొట్టాయి.
ఇదీ చదవండి: Financial Crises: పేకమేడలు... ఆర్థిక సంక్షోభం అంచున దేశాలు
Comments
Please login to add a commentAdd a comment