నైజీరియాలో పేలిన పెట్రోల్‌ ట్యాంకర్‌.. 90 మందికి పైగా మృతి | Over 90 Killed 50 Injured After Fuel Tanker Explodes In Nigeria | Sakshi
Sakshi News home page

నైజీరియాలో పేలిన పెట్రోల్‌ ట్యాంకర్‌.. 90 మందికి పైగా మృతి

Published Wed, Oct 16 2024 4:40 PM | Last Updated on Wed, Oct 16 2024 5:09 PM

Over 90 Killed 50 Injured After Fuel Tanker Explodes In Nigeria

నైజీరియా దేశంలో పెను విపత్తు చోటుచేసుకుంది. పెట్రోల్‌ ట్యాంకర్‌ పేలి 90 మందికి పైగా మృతిచెందారు. మరో 50 మంది గాయపడ్డారు. ఉత్తర జిగావా రాష్ట్రంలోని మజియా పట్టణంలో మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ ఘటన చోటుచేసుకుంది.

కాగా కనో నుంచి బయల్దేరిన ఓ పెట్రోల్‌ ట్యాంకర్‌ అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో ప్రమాదానికి గురైంది.  హైవేపై ట్యాంకర్‌ వెళ్తున్న సమయంలో డ్రైవర్‌ నియంత్రణ కోల్పోవడంతో బోల్తాపడింది.దీంతో పెట్రోల్‌ అంతా రోడ్డుపై పడిపోయింది. ఈ విషయం తెలుసుకున్న పలువురు స్థానికులు ఇంధనం కోసం ట్యాంకర్‌ చుట్టూ గుమిగూడారు. వారు పెట్రోల్‌ తీసుకుంటుండగా ప్రమాదవశాత్తూ మంటలు చెలరేగి ట్యాంకర్‌ ఒక్కసారిగా పేలిపోయింది.

ఈ ఘటనలో 94 మంది మృతిచెందినట్లు స్థానిక పోలీసులు వెల్లడించారు. మరో 50 మంది వరకు గాయపడిన్టలు బుధవారం పోలీసు ప్రతినిధి లావాన్ షిసు ఆడమ్ వెల్లడించారు.. క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ట్యాంకర్‌కు దూరంగా ఉండమని ప్రజలను హెచ్చరించినప్పటికీ ఎవరూ వినిపించుకోలేదని, ఒక్కసారిగా ఎగబడటంతో మృతుల సంఖ్య భారీగా ఉందని అధికారులు చెబుతున్నారు.

వాస్తవానికి నైజీరియాలో సరుకు రవాణాకు రైల్వే వ్యవస్థ లేవు. రహదారులపై ప్రమాదాలు సర్వసాధారణంగా మారాయి. నైజీరియాలోని ఫెడరల్ రోడ్ సేఫ్టీ కార్ప్స్ ప్రకారం.. 2020లో మాత్రమే 1,531 గ్యాసోలిన్ ట్యాంకర్ ప్రమాదాలు జరిగాయి. ఫలితంగా 535 మంది ప్రాణాలు కోల్పోగా.. 1,142 మంది గాయపడ్డారు. గత ఆదివారం నైజీరియాలో ఆయిల్‌ ట్యాంకర్‌ పేలడంతో 48 మంది మృతి చెందారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement