ఇస్లామాబాద్: బాలీవుడ్ నటులు రాజ్ కపూర్, దిలీప్ కుమార్‌ల పూర్వీకుల ఇళ్లను కొనుగోలు చేయాలని పాకిస్తాన్‌లోని ఖైబర్ పఖ్తున్ఖ్వా తాత్కాలిక ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం ఇవి శిథిలావస్థలో ఉన్నాయి. చారిత్రక ప్రాధాన్యం గల వీటిని కూల్చివేయకుండా.. నేషనల్ హెరిటేజ్‌గా గుర్తించేందుకు అధికారులు యత్నిస్తున్నారు. ఖైబర్ పఖ్తున్ఖ్వా పురావస్తు శాఖ ఈ రెండు భవనాలను కొనుగోలు చేయడానికి తగిన నిధులు కేటాయించాలని నిర్ణయించింది. ఈ భవనాలు పెషావర్ నగరం నడిబొడ్డున ఉన్నాయి. వీటి ధరను నిర్ణయించడానికి పెషావర్ డిప్యూటీ కమిషనర్‌కు ఒక లేఖ పంపారు. రాజ్ కపూర్ పూర్వీకుల నివాసాన్ని కపూర్ హవేలీ అని పిలుస్తారు. ఇది కిస్సా ఖ్వానీ బజార్‌లో ఉంది. దీనిని 1918-22 మధ్య కాలంలో దిగ్గజ నటుడి తాత దేవాన్ బాషేశ్వర్‌నాథ్ కపూర్ నిర్మించారు. రాజ్ కపూర్, అలానే అతని మామ త్రిలోక్ కపూర్ ఈ భవనంలో జన్మించారు. దీనిని ప్రాంతీయ ప్రభుత్వం జాతీయ వారసత్వంగా ప్రకటించింది.(చదవండి: గిల్గిత్ బాల్టిస్తాన్‌పై పాక్ పన్నాగం)
ప్రముఖ నటుడు దిలీప్ కుమార్ 100 సంవత్సరాల పురాతన పూర్వీకుల ఇల్లు కూడా అదే ప్రాంతంలో ఉంది. ఈ ఇల్లు కూడా శిథిలావస్థలో ఉంది. 2014 లో అప్పటి నవాజ్ షరీఫ్ ప్రభుత్వం దీనిని జాతీయ వారసత్వంగా ప్రకటించింది. రెండు భవనాల యజమానులు గతంలో వీటిని పడగొట్టి కమర్షియల్ ప్లాజాలను నిర్మించేందుకు అనేక ప్రయత్నాలు చేశారు. అయితే చారిత్రక ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకుని వాటిని సంరక్షించాలని పురావస్తు శాఖ భావించింది. దాంతో అలాంటి ప్రయత్నాలు ఆగిపోయాయి. అయితే, కపూర్ హవేలీ యజమాని అలీ ఖాదర్ మాట్లాడుతూ.. ఈ భవనాన్ని కూల్చివేయడానికి తాను ఇష్టపడనని, దేశ గౌరవానికి చిహ్నంగా ఉన్న ఈ చారిత్రాత్మక నిర్మాణాన్ని పరిరక్షించాలని పురావస్తు శాఖ అధికారులతో అనేక సార్లు విన్నవించానని తెలిపారు. దీన్ని ప్రభుత్వానికి అమ్మేందుకు యజమాని ఖైబర్ పఖ్తున్ఖ్వా ప్రభుత్వం నుంచి 200 కోట్ల రూపాయలు డిమాండ్ చేసినట్లు సమాచారం.(చదవండి: బాలీవుడ్ నటుడి ఇంట మరో విషాదం)
ఈ ఏడాది ముంబైలో మరణించిన రిషి కపూర్ చేసిన అభ్యర్థనను దృష్టిలో ఉంచుకుని కపూర్ హవేలీని మ్యూజియంగా మార్చాలని 2018 లో పాకిస్తాన్ ప్రభుత్వం నిర్ణయించింది. రెండు సంవత్సరాల కాలం గడిచినప్పటికీ ఈ ప్రకటన ఇంకా కార్యరూపం దాల్చలేదు. ఇవేకాక పెషావర్లో సుమారు 1,800 చారిత్రాత్మక నిర్మాణాలు ఉన్నాయి. ఇవన్ని 300 సంవత్సరాలకు పూర్వం నాటివి.
Comments
Please login to add a commentAdd a comment