పొరుగుదేశం పాకిస్తాన్ తాజాగా భారత్‌తో స్నేహం కోసం పరితపిస్తోంది. నిరంతర శతృత్వాన్ని నమ్మబోమంటూ మిత్రత్వానికి స్వాగతం పలుకుతోంది. స్వయంగా పాక్ ఉపప్రధాని తాము భారత్‌తో హృదయపూర్వక స్నేహాన్ని కోరుకుంటున్నామని అనడం ఇందుకు తార్కాణంగా నిలిచింది.
పాక్ ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ తాజాగా భారత్‌కు స్నేహ సందేశాన్ని పంపారు. తమ దేశం నిరంతర శత్రుత్వాన్ని నమ్మబోదని ఆయన అన్నారు. భారత్‌లో ఏర్పడిన నూతన ప్రభుత్వం ఇస్లామాబాద్‌తో సత్సంబంధాలకు ప్రాధాన్యతనివ్వాలని దార్ కోరారు. ఇస్లామాబాద్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్ట్రాటజిక్ స్టడీస్ (ఐఎస్‌ఎస్‌ఐ)లో జరిగిన సెమినార్‌లో పీఎంఎల్-ఎన్ నేత, ఉపప్రధాని ఇషాక్ దార్ ప్రసంగించారు.
పాకిస్తాన్ ఎప్పుడూ పొరుగు దేశాలతో స్నేహపూర్వక సంబంధాలకు అనుకూలంగా ఉంటుందని అన్నారు. అయితే భారత్‌తో పాక్ సంబంధాలు చరిత్రలో అస్తవ్యస్తంగా ఉన్నాయన్నారు. పరస్పర గౌరవం, సార్వభౌమాధికారం, జమ్ముకశ్మీర్ వివాదానికి న్యాయమైన, శాంతియుత పరిష్కారం ఆధారంగా భారత్‌తో సత్సంబంధాలను కోరుకుంటున్నామని దార్ పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య పెండింగ్‌లో ఉన్న వివాదాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని పాక్ కోరుకుంటున్నదన్నారు. భారత్‌తో పాటు పొరుగున ఉన్న అన్ని దేశాలతో శాంతియుత, సహకార సంబంధాలను కొనసాగించడానికి పాకిస్తాన్ కృషి చేస్తుందని దార్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment