మహరాజా రంజిత్ సింగ్ విగ్రహం(ఫొటో కర్టెసీ: ట్విటర్)
ఇస్లామాబాద్: లాహోర్‌లో ప్రతిష్టించిన మహరాజా రంజిత్ సింగ్ విగ్రహం మరోసారి ధ్వంసమైంది. ఈ ఘటనలో జీషన్ అనే టీనేజర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు.. రంజిత్ సింగ్ 180వ వర్ధంతిని పురస్కరించుకుని ఆయన స్మారకార్థం 2019 జూన్‌లో పాకిస్తాన్‌లోని లాహోర్ కోటలో విగ్రహాన్ని ప్రతిష్టించారు. తొమ్మిది అడుగుల ఎత్తుతో చెక్క రాడ్లు, కోల్డ్ బ్రాంజ్‌తో దీనిని తయారు చేశారు. సిక్కు చరిత్రకారుడు, ఫిల్మ్‌మేకర్ బాబీ సింగ్ బన్సల్ లండన్‌లోని తన ఎస్‌కే ఫౌండేషన్ ద్వారా ఇందుకు నిధులు సమకూర్చారు. వాల్డ్ సిటీ ఆఫ్ అథారిటీ ఆధ్వర్యంలో దీనిని నెలకొల్పారు.(చదవండి: తాలిబన్ నేతకు పాక్‌లో బీమా )
ఈ క్రమంలో గతేడాది ఆగస్టులో తహ్రీక్-ఇ- లబాయిక్ పాకిస్తాన్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులు విగ్రహాన్ని ధ్వంసం చేశారు. రంజిత్ సింగ్ పాలన, భారత్‌లో మోదీ ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ నినాదాలు చేస్తూ ఈ అఘాయిత్యానికి ఒడిగట్టారు. ఈ నేపథ్యంలో అధికారులు విగ్రహానికి మరమతులు చేయించారు. కాగా తహ్రీక్-ఇ- లబాయిక్ పాకిస్తాన్ చీఫ్ ఖదీం రిజ్వీ ప్రసంగాలతో ప్రేరేపితుడైన జీషన్ డిసెంబరు 12న మరోసారి విగ్రహాన్ని ధ్వంసం చేసేందుకు యత్నించాడు. విగ్రహం చేతులు విరగొట్టాడు. ఈ విషయాన్ని గమనించిన సెక్యూరిటీ గార్డులు వెంటనే అతడిని అడ్డుకుని, పోలీసులకు అప్పగించారు.
ఇక విచారణంలో భాగంగా.. తన పాలనాకాలంలో ముస్లింలకు వ్యతిరేకంగా రజింత్ సింగ్ అనేక అత్యాచారాలకు పాల్పడినందు వల్లే దాడి చేశానని జీషన్ చెప్పాడు. కాగా అతడి పాకిస్తాన్ పీనల్ కోడ్ సెక్షన్ 295 , 295-ఏ, 427 కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఇక ఈ విషయంపై స్పందించిన బాబీ సింగ్ బన్సల్.. కులమతాలకు అతీతంగా రంజిత్ సింగ్ అందరికీ సమాన ఉద్యోగవకాశాలు కల్పించారని, తన హయాంలో ఎన్నో మసీదులను పునర్నిర్మించారని పేర్కొన్నారు. ముస్లిం మహిళ గుల్ బేగంను ఆయన వివాహమాడినట్లు తెలిపారు. విద్వేషంతో ఇలాంటి ఘటనలకు పాల్పడవద్దని విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment