ప్రారంభమైన అరగంటకే లూటీ! | Pakistani Mall Video Viral | Sakshi
Sakshi News home page

Pakistan: కొత్త షాపింగ్‌ మాల్‌.. తెరిచిన అరగంటకే సర్వం లూటీ

Published Mon, Sep 2 2024 7:32 AM | Last Updated on Mon, Sep 2 2024 9:51 AM

Pakistani Mall Video Viral

కరాచీ: పాకిస్తాన్‌లోని కరాచీలో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. ఇక్కడ కొత్తగా ప్రారంభించిన షాపింగ్‌ మాల్‌ ‘డ్రీమ్ బజార్’ప్రారంభోత్సవం రోజునే లూటీకి గురయ్యింది. ఈ మాల్ ప్రారంభోత్సవం సందర్భంగా యాజమాన్యం ఒక బంపర్ డిస్కౌంట్ ప్రకటించింది. దీనిని చూసిన జనం మాల్‌ లోనికి ప్రవేశించి, తమకు తోచిన వస్తువులను ఎత్తుకెళ్లిపోయారు. దీంతో అరగంటలో మాల్‌ మొత్తం ఖాళీ అయిపోయింది.

రూ. 50 కంటే తక్కువ ధరలకే వివిధ వస్తువులను విక్రయిస్తామంటూ ఈ మాల్‌ను ప్రారంభించారు. మొదటి రోజునే మాల్‌ విధ్వంసానికి గురయ్యింది. పాకిస్తాన్‌లో తొలి మెగా పొదుపు దుకాణంగా ఈ మాల్‌కు సోషల్ మీడియాలో భారీగా ప్రచారం జరిగింది.  ప్రారంభోత్సవం రోజున దుస్తులు, వివిధ ఉపకరణాలు గృహోపకరణాలను భారీ తగ్గింపు ధరలకు అందిస్తామని మాల్‌ యాజమాన్యం ప్రకటించింది. దీంతో మాల్ తెరుచుకోగాగానే వేలాది మంది మాల్‌లోకి ప్రవేశించి, చేతికి అందిన వస్తువులను పట్టుకుపోయారు.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను పరిశీలించి చూస్తే కరాచీలోని గులిస్తాన్-ఎ-జోహార్ ప్రాంతంలో ఈ మాల్‌ను ప్రారంభించారని తెలుస్తోంది. దాదాపు లక్ష మంది మాల్‌పై దాడి చేసి, ఒక్క వస్తువు కూడా వదిలిపెట్టకుండా తీసుకెళ్లిపోయారని తెలుస్తోంది.

ఏఆర్‌వై న్యూస్ తెలిపిన వివరాల ప్రకారం మాల్‌లో పరిస్థితిని నియంత్రించడానికి అక్కడి సిబ్బంది తలుపులు మూసే ప్రయత్నం చేయగా, బయటనున్నవారు కర్రలతో గ్లాస్ ఎంట్రీ గేట్‌ను పగలగొట్టి లోనికి చొరబడ్డారు. దీని తరువాత మాల్‌తో పరిస్థితి చాలా భయానకంగా మారింది. మరోవైపు నగరంలో ట్రాఫిక్ నిలిచిపోయింది. మాల్ వెలుపల వేలాది జనం గుమిగూడారు. ఈ ఘటనను చాలామంది తమ ఫోన్లతో వీడియోలు తీశారు. మాల్‌ ప్రారంభించిన అరగంటలోనే ఖాళీ అయిపోయిందని, జనం వస్తువులన్నింటినీ పట్టుకుపోయారని ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు. మధ్యాహ్నం 3 గంటలకు కొత్త మాల్‌ తెరవగా 3:30 కల్లా వస్తువులన్నీ  లూటీ అయ్యాయని సమాచారం. 
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement