రాత్రి అయిందంటే.. అడవిని చిమ్మ చీకటి కమ్ముకుంటుంది. మొక్కలు, చెట్లు, జంతువులన్నీ చీకట్లో ఉండిపోతాయి. కానీ అక్కడక్కడా మిణుగురు పురుగులు (ఫైర్‌ఫ్లై) వెలుగులు చల్లుతూ తిరుగుతుంటాయి. కొన్ని రకాల పుట్టగొడుగులు (బయో ల్యూమినిసెంట్ మష్రూమ్స్) చిన్నగా కాంతిని వెదజల్లుతుంటాయి. ఇది చూసిన శాస్త్రవేత్తలు వినూత్నంగా ఆలోచించి.. చీకట్లో కాంతిని వెదజల్లే మొక్కలను సృష్టించారు.
పుట్టగొడుగుల్లో కాంతిని వెదజల్లే సామర్థ్యానికి కారణమైన జన్యువులను సేకరించి.. ‘పెటునియా’పూల మొక్కల్లో ప్రవేశపెట్టారు. వీటికి ‘ఫైర్‌ఫ్లై పెటునియా’అని పేరుపెట్టారు. తెలుపు రంగులో ఉండే ఈ మొక్కల పూలు.. రాత్రిపూట ఆకుపచ్చని కాంతులు వెదజల్లుతూ ఆకట్టుకుంటున్నాయి. ఇప్పుడీ పూల మొక్కలను అమ్మకానికి కూడా పెట్టారు. ఒక్కో మొక్క ధర సుమారు రూ.2,500 మాత్రమే (30 డాలర్లు).
ఈ ‘ఫైర్‌ఫ్లై పెటునియా’మొక్కలను అభివృద్ధి చేసినది అమెరికాలోని ఇడహో రాష్ట్రానికి చెందిన లైట్ బయో సంస్థ. 50వేల మొక్కలను అమ్మకానికి సిద్ధం చేసింది. ప్రస్తుతానికి ఇవి అమెరికాలో మాత్రమే విక్రయిస్తున్నట్టు ప్రకటించింది. ఇవి జన్యుమార్పిడి మొక్కలు కావడంతో.. అనుమతులను బట్టి ఇతర దేశాల్లోనూ అమ్మేందుకు ప్రయత్నిస్తామని పేర్కొంది. –సాక్షి సెంట్రల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment