వాషింగ్టన్: ఈనెల 24న మోదీ, జోబైడెన్ మధ్య ద్వైపాక్షిక చర్చలు జరుగుతాయని వైట్‌హౌస్ వర్గాలు తెలిపాయి. బైడెన్ అధ్యక్షుడయ్యాక మోదీతో జరిగే తొలి భేటీ ఇదే కావడం విశేషం. దీంతో వీరి సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈమేరకు యూఎస్ ప్రెసిడెంట్ కార్యక్రమాల షెడ్యూల్‌లో మోదీతో సమావేశాన్ని ఖరారు చేశారు. 2019లో చివరిసారి మోదీ అమెరికాలో పర్యటించారు. కరోనా అనంతరం మోదీ జరపబోయే రెండో విదేశీ పర్యటన ఇదే! మార్చిలో ఆయన బంగ్లాదేశ్‌ను సందర్శించారు. మోదీతో సమావేశానంతరం జపాన్ ప్రధాని సుగాతో బైడెన్ భేటీ అవుతారని అధికారులు చెప్పారు.
అక్టోబర్ 24న తొలిసారి క్వాడ్ దేశాల అధినేతల సమావేశం వైట్‌హౌస్‌లో జరగనుంది. ఇందులో బైడెన్, మోదీ, సుగా, స్కాట్‌మారిసన్ పాల్గొంటారు. ఈఏడాది జరిపిన క్వాడ్ వీడియో సమావేశం అనంతరం జరిగిన పురోగతిని రాబోయే సమావేశంలో సమీక్షిస్తారు. క్వాడ్ దేశాల వ్యాక్సిన్ కార్యక్రమంపై కూడా చర్చలుంటాయని విదేశాంగ శాఖ తెలిపింది. అన్నింటికన్నా ముఖ్యంగా తాజా భౌగోళిక రాజకీయ పరిస్థితులు, నూతన టెక్నాలజీ వినియోగం, వాతావరణ మార్పు తదితర కీలక అంశాలను కూడా సమావేశంలో ప్రస్తావిస్తారని తెలిపింది. ఇండో పసిఫిక్ ప్రాంతంలో శాంతిని నెలకొల్పడంపై నేతలు ప్రధానంగా దృష్టి పెట్టనున్నారు. గురువారం తొలిసారి బైడెన్ ఐరాసలో ప్రసంగించనున్నారు. అక్కడ స్కాట్ మారిసన్‌తో సమావేశం జరిపి తిరిగి వచ్చాక బ్రిటన్ ప్రధానితో చర్చలు జరుపుతారని వైట్‌హౌస్ వర్గాలు తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment