
మూడో దఫాలో మూడురెట్లు వేగంతో పనిచేస్తా..
మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరింపజేస్తా
రష్యాలో ప్రవాస భారతీయులతో మోదీ
మాస్కో: భారత్ అద్భుత పురోగతి సాధిస్తోందని, దేశాభివృద్ధి చూసి ప్రపంచమే నివ్వెరపోతోందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. మాస్కో పర్యటనలో ఉన్న మోదీ మంగళవారం అక్కడి ప్రవాసభారతీయులనుద్దేశించి ప్రసంగించారు. ‘మోదీ మోదీ’, ‘మోదీ ఉంటే ఏదైనా సాధ్యమే’ నినాదాల నడుమ నరేంద్ర మోదీ మాట్లాడారు. ‘‘ 140 కోట్ల మంది భారతీయుల శక్తిసామర్థ్యాలను వినియోగించుకుంటూ భారత్ దీటుగా ఎదుగుతోంది. భారతీయులంతా వికసిత్ భారత్ కలను నిజంచేసుకునేందుకు కృతనిశ్చయంతో ముందుకుసాగుతున్నారు. 2014కు ముందు భారత్‌లో పరిస్థితి వేరేలా ఉండేది.
కానీ ఇప్పుడు భారత్ పూర్తి ఆత్మవిశ్వాసంతో తొణికిసలాడుతోంది. ఆత్మవిశ్వాసమే భారత్‌కున్న అతిపెద్ద మూలధనం. మీలాంటి ప్రజల ఆశీస్సులు ఉంటే పెద్ద ఆశయాలను సైతం దేశం సాధించగలదు. అనుకున్న లక్ష్యాలను భారత్ చేరుకోవడం మీరందరూ చూస్తున్నారు. రాబోయే రోజుల్లో భారత్ తన నిర్దేశిత లక్ష్యాలను సాధిస్తూ నూతన అధ్యాయనాన్ని లిఖించబోతోంది. సవాళ్లకే సవాల్ విసిరే గుణం నా డీఎన్‌ఏలోనే ఉంది. సరిగ్గా నెలరోజుల క్రితం మూడోసారి ప్రధానిగా పగ్గాలు చేపట్టా. మూడో దఫాలో మూడు రెట్లు వేగంతో పనిచేస్తా.
భారత ఆకాంక్షలను నెరవేరుస్తా. భారత్‌ను ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా అవతరింపజేయాలనేదే మా ప్రభుత్వ సంకల్పం. పేదల కోసం మూడు కోట్ల ఇళ్లు నిర్మించి ఇస్తాం. మూడు కోట్ల మంది పేద మహిళలు లక్షాధికారులను చేస్తాం. గత పదేళ్లలో భారత్‌లో కనిపించిన అభివృద్ధి ఒక ట్రైలర్ మాత్రమే. వచ్చే పదేళ్లలో అంతకుమించిన అభివృద్ధిని మీరు చూడబోతున్నారు’’ అని మోదీ అన్నారు.
సర్వకాల సర్వావస్థలయందు స్నేహితుడే
రష్యాతో భారత బంధాన్ని మోదీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. ‘రష్యా అనే పేరు వినబడగానే ప్రతి భారతీయుని మదిలో మెదిలే ఒకే ఒక్క వాక్యం.. సర్వకాల సర్వావస్థలయందు తోడుగా నిలిచే స్నేహితుడు. నమ్మకమైన నేస్తం’ అని మోదీ కొనియాడారు. ‘అన్ని కాలాల్లోనూ రష్యాతో భారత స్నేహం కొనసాగుతుంది. రష్యాలో గడ్డకట్టే చలిలో ఉష్ణోగ్రత సున్నా డిగ్రీ సెల్సియస్‌కు పడిపోతుందేమోగానీ ఇండియా–రష్యా స్నేహబంధం ఎల్లప్పుడూ ‘ప్లస్’లోనే నులివెచ్చగా ఉంటుంది అని మోదీ అన్నారు.
రష్యాతో పర్యాటకం, వాణిజ్యం, విద్యా రంగాల్లో బంధం బలోపేతానికి భారత్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. రష్యాలో కొత్తగా రెండు నగరాల్లో భారత కాన్సులేట్లను ఏర్పాటుచేయబోతోంది. ప్రధాని మోదీ స్వయంగా ఈ విషయాన్ని ప్రకటించారు. కజన్, యెకటేరిన్‌బర్గ్ నగరాల్లో వీటిని నెలకొల్పుతారు. ప్రస్తుతం సెయింట్‌పీటర్స్‌బర్గ్, వ్లాడివోస్టోక్ నగరాల్లో మాత్రమే భారత కాన్సులేట్లు పనిచేస్తున్నాయి.
ఇరుదేశాల ద్వైపాక్షిక బంధాల బలోపేతానికి కృషిచేస్తున్నందుకు సూచికగా ప్రధాని మోదీని పుతిన్ ‘ ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ ది అపోస్టల్’ పురస్కారంతో సత్కరించారు. రష్యా అత్యున్నత పౌర పురస్కారాన్ని అందుకున్న తొలి భారతీయ నేతగా మోదీ రికార్డ్ సృష్టించారు. ఈ పురస్కారాన్ని భారతీయులకు అంకితం చేస్తున్నానని పురస్కారం స్వీకరించిన సందర్భంగా మోదీ ‘ఎక్స్’లో పోస్ట్‌చేశారు. రష్యాలో తొలి క్రైస్తవ మత బోధకుడైన సెయింట్ ఆండ్రూ పేరిట 1698 సంవత్సరంలో రష్యా చక్రవర్తి పీటర్ కృషితో ఈ పురస్కారాన్ని ప్రదానం చేయడం ప్రారంభించారు.
Comments
Please login to add a commentAdd a comment