సంక్షోభాలు సమసిపోవాలంటే శాంతి చర్చలు, దౌత్య మార్గాలే శరణ్యం
తూర్పు ఆసియా శిఖరాగ్ర సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ స్పషీ్టకరణ
వీయెంటియాన్: ప్రపంచంలో పలుచోట్ల కొనసాగుతున్న సంఘర్షణలు, ఉద్రిక్త పరిస్థితులతో గ్లోబల్ సౌత్ దేశాలపై తీవ్ర ప్రభావం పడుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తంచేశారు. యూరేషియా, పశి్చమాసియాలో సాధ్యమైంత త్వరగా శాంతి నెలకొనాలని ఆకాంక్షించారు. చర్చలు, దౌత్య మార్గాల్లో శాంతియుత వాతావరణాన్ని పునరుద్ధరించాలని సూచించారు.
లావోస్ రాజధాని వీయెంటియాన్‌లో శుక్రవారం 19వ తూర్పు ఆసియా శిఖరాగ్ర సదస్సులో ప్రధాని మోదీ ప్రసంగించారు. ఇండో–ఫసిఫిక్ ప్రాంతంలో సంపూర్ణ శాంతిని, అభివృద్ధిని కోరుకుంటున్నామని చెప్పారు. ఇందుకోసం స్వేచ్ఛాయుత, సమగ్ర, సౌభాగ్యవంతమైన, నిబంధనల ఆధారిత ఇండో–పసిఫిక్ అవసరమని తేలి్చచెప్పారు. ఇండో–పసిఫిక్‌లో డ్రాగన్ దేశం చైనా విస్తరణవాదాన్ని మోదీ పరోక్షంగా తప్పుపట్టారు. భారత్ ప్రతిపాదించిన తూర్పు కార్యాచరణ(యాక్ట్ ఈస్ట్) విధానానికి తూర్పు ఆసియా సదస్సు ఒక మూలస్తంభమని ఉద్ఘాటించారు. ప్రధానమంత్రి ఇంకా ఏం మాట్లాడారంటే...
విశ్వబంధుగా బాధ్యతలు నిర్వర్తిస్తాం
‘‘గౌతమ బుద్ధుడు జని్మంచిన దేశం నుంచి వచ్చా. ఇది యుద్ధాల యుగం కాదని పదేపదే చెబుతున్నా. సమస్యలకు పరిష్కారాలు యుద్ధక్షేత్రం నుంచి రావు. మానవతా దృక్పథంతో వ్యవహరించాలి. సంక్షోభాలు సమసిపోవాలంటే శాంతి చర్చలు, దౌత్య మార్గాల్లో సంప్రదింపులపై తప్పనిసరిగా దృష్టి పెట్టాలి. విశ్వబంధుగా మా బాధ్యతలు నిర్వర్తిస్తాం. ప్రపంచంలో శాంతి కోసం అన్ని ప్రయత్నాలూ చేస్తూనే ఉంటాం. మనమంతా ఒక్కటై పోరాడితే ఉగ్రవాదం నామరూపాల్లేకుండాపోవడం ఖాయం. అలాగే సైబర్ భద్రత, అంతరిక్షం తదితర రంగాల్లో పరస్పర సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవాలి.
మన దృష్టి అభివృద్ధి పైనే ఉండాలి
మొత్తం ఇండో–పసిఫిక్ ప్రాంత ప్రయోజనాల కోసం దక్షిణ చైనా సముద్రంలో శాంతి, భద్రత, స్థిరత్వం అత్యవసరం. ఈ ప్రాంతంలో వివిధ దేశాల నౌకలు, విమానాలు స్వేచ్ఛగా రాకపోకలు సాగించే వాతావరణం ఉండాలి. సముద్ర చట్టంపై ఐక్యరాజ్యసమితి తీర్మానం (అన్‌క్లోస్) తరహాలో దక్షిణచైనా సముద్రంలోనూ కార్యకలాపాల కోసం ఒక స్పష్టమైన విధానం అవసరం. ప్రభావవంతమైన ప్రవర్తనా నియమావళిని అభివృద్ధి చేయాలి. మన దృష్టి ఎప్పుడూ అభివృద్ధిపైనే ఉండాలి తప్ప విస్తరణవాదంపై కాదు’’ అని ప్రధాని మోదీ స్పష్టంచేశారు.
కెనడా ప్రధాని ట్రూడోతో మోదీ భేటీ
ప్రధాని మోదీ లావోస్‌లో కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడోతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. వారు ఏం మాట్లాడుకున్నారన్నది తెలియరాలేదు. ఇది స్వల్పకాలం జరిగిన సమావేశమని ట్రూడో పేర్కొన్నట్లు కెనడా వార్త సంస్థ వెల్లడించింది. ఖలిస్తాన్ ఉగ్రవాది నిజ్జర్ హత్య వెనుక భారత్ హస్తం ఉందంటూ ట్రూడో ఆరోపించడంతో గతేడాది భారత్–కెనడా మధ్య సంబంధాలు కొంత బలహీనపడిన సంగతి తెలిసిందే.
మోదీతో సమావేశం అనంతరం ట్రూడో మీడియాతో మాట్లాడారు. కెనడా పౌరుల భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పారు. చేపట్టాల్సిన కార్యాచరణపై భారత ప్రధానితో చర్చించానని అన్నారు. మరోవైపు థాయ్‌లాండ్ ప్రధానమంత్రి షినవత్రా, అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్, లావోస్ ప్రధానమంత్రి సోనెక్సే సిఫాండోన్‌తోనూ నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. ఆయా దేశాలతో భారత్ సంబంధాల పురోగతిని సమీక్షించారు. వ్యాపార, వాణిజ్యపరమైన అంశాలపై చర్చించారు.
భారత హస్త కళాకృతుల బహూకరణ
ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం లావోస్, థాయ్‌లాండ్, న్యూజిలాండ్ దేశాల అధినేతలకు భారత హస్తకళాకృతులను, విలువైన వస్తువులను బహూకరించారు. మహారాష్ట్రలో తయారు చేసిన వెండి ప్రమిదలను న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్‌కు అందజేశారు. లావోస్ అధ్యక్షుడు సిసోలిత్‌కు బుద్ధుడి విగ్రహాన్ని బహూకరించారు. లద్దాఖ్‌లో తయారు చేసిన బల్లను థాయ్‌లాండ్ ప్రధానికి, పశి్చమబెంగాల్‌లో రూపొందించిన వెండి నెమలి బొమ్మను జపాన్ ప్రధానమంత్రికి అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment