
లండన్: బ్రిటన్ ప్రధాని రేసులో భారత సంతతికి చెందిన మాజీ మంత్రి రిషి సునాక్ (42) హవా కొనసాగుతోంది. కన్జర్వేటివ్ పార్టీ నాయకుని ఎన్నిక ప్రక్రియలో మంగళవారం జరిగిన నాలుగో రౌండ్ ఓటింగ్ తర్వాత కూడా రిషియే అగ్రస్థానంలో నిలిచారు. ఆయనకు మద్దతిస్తున్న ఎంపీల సంఖ్య 118కి పెరిగింది. కన్జర్వేటివ్ ఎంపీల్లో మూడో వంతు మంది మద్దతు, అంటే 120 ఓట్లు సాధించేవారు తుది ఇద్దరు అభ్యర్థుల జాబితాలో నిలుస్తారు. దాంతో రిషి తుది పోటీలో నిలవడం దాదాపుగా ఖాయమైంది.
ఆయనతో పాటు తుది పోరులో నిలిచేందుకు వాణిజ్య మంత్రి పెన్నీ మోర్డంట్, విదేశాంగ మంత్రి లిజ్ ట్రస్ మధ్య హోరాహోరీ సాగుతోంది. రిషికి గట్టి పోటీదారుగా భావిస్తున్న మోర్డాంట్ 92 ఓట్లతో రెండో స్థానంలో, ట్రస్ 86 ఓట్లతో మూడో స్థానంలో కొనసాగుతున్నారు. నాలుగో అభ్యర్థి కేమీ బదొనెక్ 59 ఓట్లతో రేసు నుంచి వైదొలిగారు. దీంతో రిషి, మోర్డంట్, ట్రస్ ముగ్గురే పోటీలో మిగిలారు. బుధవారం ఐదో రౌండ్ తర్వాత తుది పోరులో నిలిచే ఇద్దరు ఎవరో తేలుతుంది.
గురువారం నుంచి వారి మధ్య ముఖాముఖి పోరు సాగుతుంది. వారిలో కన్జర్వేటివ్ పార్టీకి చెందిన 1.6 లక్షల పై చిలుకు సభ్యుల్లో అత్యధికుల మద్దతు కూడగట్టుకునేవారు పార్టీ నేత పదవిని, తద్వారా ప్రధాని పీఠాన్ని దక్కించుకుంటారు. కన్జర్వేటివ్ సభ్యుల ఓట్ల లెక్కింపు ఆగస్టు చివరికల్లా పూర్తవుతుంది. విజేతను సెప్టెంబర్ 5న ప్రకటిస్తారు. సోమవారం మూడో రౌండ్ తర్వాత రిషి 115 ఓట్లతో నిలిచారు. అంటే నాలుగో రౌండ్‌లో ఆయన మరో ముగ్గురు ఎంపీల మద్దతే కూడగట్టగలిగారు. మోర్డాంట్ 10 మంది, ట్రస్ 15 మంది ఎంపీల మద్దతు కూడగట్టుకున్నారు. బదొనెక్‌కు ఓటేసిన 59 మంది ఎంపీల్లో ఎక్కువ మంది మద్దతును ఎవరు కూడగడతారన్నది ఆసక్తికరం.