
మాస్కో: ఉక్రెయిన్‌పై దండయాత్ర మొదలుపెట్టి 70 రోజులు దగ్గర పడుతున్నా ఆశించిన ఫలితాలు సాధించలేక మథనపడుతున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను అనారోగ్యమూ వెంటాడుతోంది. ఏడాదిన్నరగా కేన్సర్, పార్కిన్సన్స్‌తో బాధపడుతున్న పుతిన్ కేన్సర్‌కు సర్జరీ చేయించుకోవాల్సిన పరిస్థితులు వచ్చినట్టు సమాచారం. అయితే ఈ వారంలోనే ఆపరేషన్ జరగవచ్చని రష్యా ప్రభుత్వ వర్గాలను ఉటంకిస్తూ ఇంగ్లండ్ మీడియా చెబుతోంది. సర్జరీ జరిగి కోలుకునే దాకా ఉక్రెయిన్‌తో యుద్ధ బాధ్యతలను ఫెడరల్ సెక్యూరిటీ సర్వీసెస్ (ఎఫ్‌ఎస్‌బీ) మాజీ చీఫ్ నికోలాయ్ పత్రుషేవ్‌కు అప్పగించాలని పుతిన్ నిర్ణయించినట్టు తెలుస్తోంది. 70 ఏళ్ల పత్రుషేవ్ యుద్ధ వ్యూహాలను పకడ్బందీగా రచిస్తారని పేరుంది. రెండో ప్రపంచ యుద్ధ విజయానికి గుర్తుగా మే 9న రష్యా విజయోత్సవం లోపే ఆపరేషన్ చేయించుకోవాలని పుతిన్ భావిస్తున్నారు.
హెవీ డోసుల ప్రభావం
కేన్సర్, పార్కిన్సన్స్, స్కిజోఫ్రేనియా వ్యాధులకు హెవీ డోస్ మందులు తీసుకోవడంతో పుతిన్ బాగా బలహీనపడ్డారని వార్తలు వస్తున్నాయి. తక్షణం కేన్సర్ సర్జరీ చేయించుకోవాలని ఆయనకు చికిత్స చేస్తున్న వ్యక్తిగత వైద్యులు సలహా ఇచ్చారు. తాజా వీడియోల్లో పుతిన్ ముఖంలో అనూహ్యమైన మార్పులు కనిపించాయి. కూర్చునే, నడిచే తీరులోనూ తేడాలు కనిపిస్తున్నాయి. అతిథులతో కరచాలనం సందర్భంగా చేతులు వణుకుతున్న వీడియోలు వైరలయ్యాయి.
ప్రధానిని కాదని..
రష్యా అధ్యక్షుడు అనారోగ్యం బారిన పడితే దేశ రాజ్యాంగం ప్రకారం ప్రధాని తాత్కాలికంగా అధికార బాధ్యతలు చేపట్టాలి. కానీ ప్రధాని మిఖైల్ మిషుస్తిన్ (56)లో ప్రొఫైల్‌లో ఉంటారు. దేశ నిఘా వ్యవస్థ, సంబంధిత సమాచారంతో ఆయనకు పెద్దగా లింకులు లేవంటారు. యుద్ధం కీలక దశకు చేరిన నేపథ్యంలో దూకుడుగా ముందుకు తీసుకెళ్లేవారు కావాలన్న ఉద్దేశంలో పత్రుషేవ్ వైపు పుతిన్ మొగ్గారంటున్నారు. ఆయనకు ఉదర సంబంధ క్యాన్సరని కొన్ని పత్రికలు, థైరాయిడ్ క్యాన్సరని మరికొన్ని రాస్తున్నాయి. చికిత్స కోసం గతంలో పలుమార్లు పుతిన్ రోజుల తరబడి మాయమైనా రష్యా మీడియా దాన్ని రహస్యంగా ఉంచింది. కానీ ఇప్పుడు మాత్రం పేర్లు వెల్లడించడానికి ఇష్టపడని కొందరు ప్రభుత్వ ఉన్నతాధికారులు పుతిన్ సర్జరీ చేయించుకుంటున్నారని తొలిసారిగా అనధికారిక సంభాషణల్లో చెప్పుకుంటున్నట్టు భోగట్టా.
Comments
Please login to add a commentAdd a comment