అదో చిన్న రోబో.. తనకు చెప్పినపని చేస్తుంది. అదే సమయంలో తనలాంటి మరిన్ని రోబోలనూ తయారు చేసుకుంటుంది. ఆ రోబోలు మరిన్ని రోబోలను ‘కనేస్తుంటాయి’.. రజనీకాంత్ రోబో సినిమాలో విలన్‌గా మారిన ‘చిట్టి’ తనలా రోబోలను తయారుచేసి ఫైటింగ్‌కు దిగే సీన్ గుర్తొస్తుంది కదా.. మరి అలాంటి రోబోలకు మనలా ప్రాణం కూడా ఉంటే.. వామ్మో ఇంక అంతే సంగతులు అనిపిస్తోందా? మరీ అంతపెద్ద రోబోలు కాదుగానీ.. తమలాంటి రోబోలను తయారు చేసుకోగలిగిన అతి సూక్ష్మ ‘బయో రోబో’లను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఆ వివరాలు ఏమిటో తెలుసుకుందామా..
– సాక్షి సెంట్రల్ డెస్క్
సాధారణంగా రోబోలు అంటే యంత్రాలే. ముందే నిర్దేశించిన మేరకు, మనం చెప్పిన మేరకు మన పనులన్నీ చక్కబెడతాయి. మనుషులు చేయలేని ఎన్నో కష్టమైన పనులూ చేసిపెడతాయి. కానీ శాస్త్రవేత్తలు జీవకణాలతో రోబో (బయో రోబో)లను తయారు చేయడంపై కొంతకాలంగా పరిశోధనలు చేస్తున్నారు. అవి సజీవంగా ఉంటూనే.. మనం చెప్పినట్టు వినే, ముందే నిర్ధారించిన పనులు చేసేలా ప్రోగ్రామింగ్ చేస్తున్నారు. ఈ దిశగా ఇప్పటికే మిల్లీమీటర్ కన్నా చిన్నగా ఉండే బయో రోబోలను రూపొందించారు. ‘జెనోబోట్స్’గా పిలిచే ఈ రోబోలు తమలాంటి మరిన్ని రోబోలను పునరుత్పత్తి చేసుకునేలా అభివృద్ధి చేశారు.
కప్పల మూల కణాల నుంచి..
అమెరికాకు చెందిన టఫ్ట్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ వెర్మోంట్, హార్వర్డ్ యూనివర్సిటీకి చెందిన విస్ ఇన్‌స్టిట్యూట్ పరిశోధకులు ‘జెనోబోట్స్’పై పరిశోధన చేస్తున్నారు. జోనోపస్ లావియెస్ అనే జాతి కప్పలకు చెందిన మూలకణాల (స్టెమ్‌సెల్స్)ను సేకరించి.. వాటిని కంప్యూటర్ సిమ్యులేషన్స్ ఆధారంగా రీప్రోగ్రామింగ్ చేసి గత ఏడాదే ‘జెనోబోట్స్’ను తయారు చేశారు.
అవి సొంతంగా కదలడం, జట్టుగా కలసి పనిచేయడం, వాటికి అప్పజెప్పిన పని పూర్తిచేయడం, ఏవైనా గాయాలు అయితే సొంతంగా నయం చేసుకోవడం వంటివి చేయగలిగేవి. తాజా జెనోబోట్లు తమలాంటి మరిన్ని ప్రతిరూపాలను తయారు చేసుకునేలా ప్రోగ్రామింగ్ చేశారు. వీటికి జెనోబోట్స్ 3.0గా పేరుపెట్టారు.
ఎలా ఉత్పత్తి చేసుకుంటాయి?
‘జెనోబోట్ 3.0’ రోబోలు గుండ్రంగా ఉంటాయి. కానీ ఒకవైపున ‘V’ ఆకారంలో నోరు ఉంటుంది. ఈ రోబోలు అటూఇటూ కదులుతూ ఉన్నప్పుడు.. అక్కడ చెల్లాచెదురుగా ఉన్న మూలకణాలను ఒకచోటికి చేర్చుతాయి. తర్వాత ఆ కణాలను వి ఆకారంలోని తమ నోటిలోకి తీసుకుని.. తమలాంటి రూపంలోకి మార్చి.. బయటికి వదిలేస్తాయి. కొద్దిరోజుల తర్వాత ఈ పిల్ల రోబోలు కూడా ప్రతిరూపాలను తయారు చేయగలుగుతాయి.
ప్రయోజనం ఏంటి?
కేవలం మిల్లీమీటర్ పరిమాణంలో ఉండే ఈ ‘జెనోబోట్ల’తో వైద్యారోగ్య రంగంలో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. తీవ్రమైన గాయాలు, పుట్టుకతో వచ్చే లోపాలు, కేన్సర్, వయసుతోపాటు వచ్చే సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు, చికిత్స అందించేందుకు ఈ రోబోలను వినియోగించుకోవచ్చని స్పష్టం చేస్తున్నారు. ఇవి శరీరంలో దెబ్బతిన్న, కేన్సర్‌కు గురైన కణాలకు నేరుగా ఔషధాన్ని తీసుకెళ్లగలవని వివరిస్తున్నారు.
ప్రమాదమేమీ లేదా?
తమను తాము పునరుత్పత్తి చేసుకునే ఈ జెనోబోట్స్ ద్వారా భవిష్యత్తులో ఏమైనా ప్రమాదం వస్తే ఎలా అన్న సందేహాలూ వ్యక్తమవుతున్నాయి. అయితే ఆ కోణంలో క్షుణ్నంగా పరిశీలించే జెనోబోట్లకు రీప్రోగ్రామింగ్ చేశామని పరిశోధనకు నేతృత్వం వహించిన టఫ్ట్ యూనివర్సిటీ శాస్త్రవేత్త మైఖేల్ లెవిన్ తెలిపారు.
ఎన్ని ఉత్పత్తి కావాలి.. ఏ పని చేయాలి.. ఎలా పనిచేయాలనే అంశాలన్నింటినీ ముందే ప్రోగ్రామ్ చేసి పెడతామని వివరించారు. కంప్యూటర్ ద్వారా వాటిని ఎప్పటికప్పుడు నియంత్రిస్తూ.. మనకు ముప్పుగా పరిణమించకుండా అభివృద్ధి చేశామని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment