ఆ ఉద్యోగాలకు రోబోలతో ముప్పు లేదు!
హోస్టన్: ప్రస్తుతం అన్ని ఉద్యోగాల్లో రోబోల వినియోగం క్రమక్రమంగా పెరిగిపోతోంది. దీంతో చాలా మంది ఉద్యోగాలకు భద్రత లేకుండా పోయింది. కానీ అధిక స్థాయిలో ఐక్యూతోపాటు ఆర్ట్స్, సైన్స్ రంగాలపై ఆసక్తి ఉన్నవారి ఉద్యోగాలకు మాత్రం ఎలాంటి ఢోకా ఉండబోదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వ్యక్తిత్వ లక్షణాలు, వృత్తిపరమైన ఆసక్తి, మేధస్సు, సామాజిక ఆర్థిక స్థితులకు జాబ్ మార్కెట్‌లో ఏ మేరకు ప్రాధాన్యత ఉందో తెలుసుకునేందుకు దాదాపు 3.5 లక్షల మందిపై శాస్త్రవేత్తలు అధ్యయనం నిర్వహించారు.
సామాజిక ఆర్థిక స్థితితో సంబంధం లేకుం డా అధిక స్థాయిలో మేధస్సు, పరిపక్వత, కలుపుగోలుతనంతోపాటు ఆర్ట్స్, సైన్స్‌లో ఎక్కువ ఆసక్తి కలిగినవారు రానున్న రోజుల్లో కంప్యూటర్ సంబంధిత ఉద్యోగాలను తక్కువ స్థాయిలో ఎంచుకుంటారని పరిశోధకులు చెబుతున్నారు. ఆయా ఉద్యోగాల కు కంపెనీలు కూడా వీరిని తక్కువగానే ఎంపిక చేసుకుంటాయని వివరించారు. ఐక్యూ స్థాయి ప్రతి 15 పాయింట్లు పెరిగే కొద్దీ కంప్యూటర్ సంబంధిత ఉద్యోగాల్లో చేరేవారు 7 శాతం తగ్గుతారని అసిస్టెంట్ ప్రొఫెసర్ రొడికా డామియన్ చెప్పారు.