వాటికి ఆకలి గురించి తెలియదు కానీ వండగలవు.. శుచి గురించి తెలియదు కానీ ఇంటిని శుభ్రంగా ఉంచగలవు, మమతానురాగాల గురించి తెలియదు కానీ మనిషికి తోడును అందించగలవు, బాధ, ప్రేమ, పగ, ప్రతీకారాలు తెలియవు కానీ యుద్ధాలు చేయగలవు. సృష్టికి ప్రతిసృష్టిగా తయారయ్యాయి. ఇప్పుడు సృష్టిలోని రహస్యాలను వెలుగులోకి తీసుకు వస్తున్నాయి. అవే.. రోబోలు అలియాస్ హ్యూమనాయిడ్స్. దినదిన ప్రవర్ధమానం అవుతున్న రోబోటిక్ సైన్స్‌లో రోజుకొక అభివృద్ధి కనిపిస్తోంది. కొత్త కొత్త ఆవిష్కరణ రూపంలో రోబోల శక్తియుక్తులు ప్రదర్శితమవుతున్నాయి. ఈ నేపథ్యంలో హ్యూమనాయిడ్‌ల ప్రస్థానం గురించి..
రోబో అంటే చెక్ భాషలో ‘బానిస’ అని అర్థం. ఈ బానిసలే మానవ నిర్మిత అద్భుతాలుగా... మానవుడికి సహాయకారులుగా నిలుస్తున్నాయి. చిట్టి చిట్టి అడుగులేసుకొంటూ అభివృద్ధి పథాన నడుస్తున్నాయి. ప్రత్యేకించి హ్యూమనాయిడ్ రోబోల విషయంలో.. శాస్త్రవేత్తలు సరికొత్త ఆవిష్కరణలు చే స్తున్నారు. తాజాగా ముమ్మూర్తులా మనిషిని పోలినట్టుగా నడిచే రోబోను ఆవిష్కరించారు. శాక్సోఫోన్‌ను శ్రుతిబద్ధంగా వాయించే రోబోలు ఆవిష్కృతం అయ్యాయి. గత పదిహేను రోజుల్లో జరిగిన ఆవిష్కరణలివి. ఈ నేపథ్యంలో.. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వినియోగంలో ఉన్న హ్యూమ నాయిడ్ రోబోల విశేషాలివి..
యంత్రాలు మాత్రమే కాదు..!
రోబో అంటే స్టీల్ బాడీతో, అమర్చినట్టుగా ఉంటే అవయవాలతో ఉండేవే కాదు... శంకర్ సినిమా ‘రోబో’లో కనిపించే ‘చిట్టి’లాంటివి కూడా ఉన్నాయి. వీటినే హ్యూమనాయిడ్స్ అనవచ్చు. మనిషి మనగలిగే వాతావరణానికి, ప్రకృతికి అనుగుణంగా స్పందించేవే హ్యూమనాయిడ్ రోబోలు. సెన్స్, కామన్ సెన్స్ లాంటి లక్షణాలను అలవరుచుకొంటున్న హ్యూమనాయిడ్‌లు ఆవిష్కృతం అవుతున్నాయిప్పుడు. కంప్యూటర్ ప్రోగ్రామింగ్ రూపంలో ఫిక్స్ చేసిన కదలికలే అయినా.. వేగం అనే ప్రత్యేకతతో, అద్భుతమైన సాంకేతిక పరిజ్ఞానంతో ఉన్న వీటి హావభావాలను చూస్తే మాత్రం వాటంతట అవే ఆలోచించి పనిచేస్తున్నాయనే భ్రమ కలుగుతుంది.
మనిషి లాగా నడక..
మనిషిలాగా నడవగల రోబోను తయారు చేయడానికి 20 సంవత్సరాలుగా పనిచేస్తోంది హోండా కంపెనీ. ఈ విషయంలో ఎట్టకేలకు ఇటీవలే విజయం సాధించింది. పదమూడు సంవత్సరాల క్రితం ‘ఎసిమో’ రూపంలో హోండా ఒక హ్యూమనాయిడ్‌ను సృష్టించింది. ప్రత్యేకించి నడక విషయంలో దీనికి మావన లక్షణాలను సంక్రమింపజేసే ప్రయత్నాలు చేసింది. నడకకు అనుగుణంగా, అనుకూలంగా ఉండే మోకాళ్లు, పాదంలో ఒంపు, సులువుగా కదిలే సొంపుతో అచ్చం మనిషిలా ఎసిమోను తీర్చిదిద్దింది హోండా కంపెనీ. ఐదడుగుల ఎత్తు, 64 కిలోల బరువుతో ప్రస్తుతం ప్రపంచంలోని హ్యూమనాయిడ్స్‌లో కెల్లా నడక విషయంలో మానవుడితో అత్యంత సామీప్యం ఉన్న రోబో ఇది. ఇది 0.6 సెకన్లకు ఒక అడుగు చొప్పున వేయగలదు. 12 డిగ్రీల యాంగిల్‌లో పాదం కదలిక ఉంటుంది. ఎసిమో తను నడుస్తున్న దారిలో ఎత్తు పల్లాలను, అడ్డంగా ఉన్న వాటిని గుర్తించగలదు. దీనిలోని కంప్యూటింగ్ పవర్ కారణంగా దారిలోని అడ్డంకులను తప్పించుకొంటూ గంటకు దాదాపు పదికిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేయగలదు ఎసిమో! శామ్‌సంగ్ రూపొందించిన ‘రోబో రే’ అనే హ్యూమనాయిడ్ కూడా నడక విషయంలో మనిషిని పోలినదిగా పేరు తెచ్చుకొంది.
మనుషుల్లాగే యుక్తులు...
ఎసిమో కేవలం పరిగెత్తడం మాత్రమే కాదు, తన తెలివితేటలను ఉపయోగించి మానవుడికి సేవలను అందిస్తుంది. ప్లాస్క్‌లోని జ్యూస్ గ్లాస్‌లో పోసి మనిషికి అందిస్తుంది. డైనింగ్ టేబుల్ వద్ద సహాయకారిగా ఉంటుంది. ఫుట్‌బాల్‌లో నైపుణ్యాన్ని చూపుతుంది. అంతెందుకు... అచ్చం దర్శకుడు శంకర్ సృష్టించిన ‘చిట్టి’ లక్షణాలెన్నింటినో కలిగి ఉంది ఎసిమో!
భావోద్వేగాలను పండించడంలోనూ..!
జపాన్ వసీదా యూనివర్సిటీ వారు సృష్టించిన కొబియన్ రోబోను చూసిన వారెవరైనా కళ్లెగరేయాల్సిందే! ఎందుకంటే కళ్లతో భావోద్వేగాలను ప్రదర్శిస్తుంది కొబియన్. బాధ, ఆనందం, దుఃఖం, భయం, ఆశ్చర్యం, గర్వం, విధేయత వంటి ఏడురకాల ఎమోషన్లను పండించగలదు ఈ రోబో. చేతులు, కళ్ల కదలికలతో ఇది తన భావోద్వేగాలను ప్రదర్శించగలదు. అయితే, ఇది పూర్తిగా యాంత్రికమే. ఎక్స్‌ప్రెషన్స్ మాత్రమే ఇవ్వగలదు. అయితే పరిస్థితులకు అనుగుణంగా సొంతంగా ఎక్స్‌ప్రెస్ చెయ్యలేదు. ఆ సెన్స్ మాత్రం లేదు ఈ హ్యూమనాయిడ్‌కు.
శాస్త్రవేత్త రూపంలోనిది..
శంకర్ సినిమాలో రజనీకాంత్ రూపంలోని రోబోను చూశాం. ఇప్పుడు ఈ విషయాన్ని నిజం చేస్తున్నారు ఇంగ్లండ్ శాస్త్రవేత్తలు. మనుషుల కోసం తయారు చేసిన కృత్రిమ అవయవాలతో ‘బయోనిక్ మ్యాన్’ ను వీరు ఆవిష్కరించారు. ఇంగ్లండ్‌లోని ‘షాడో రోబో కో’ అనే కంపెనీ సైంటిస్టులు దీన్ని రూపొందించారు. అతి త్వరలో ఇది పూర్తి మనిషి రూపాన్ని సంతరించుకుంటుంది. ఒక శాస్త్రవేత్తను పోలిన రూపాన్ని ఆ రోబోకు ఇస్తున్నారు. దీన్ని త్వరలో ప్రదర్శనకు ఉంచనున్నారు.
భయానక రూపం..
కురాటాస్..యుద్ధవిద్య నిపుణురాలు ఇది. అంతేకాదు... వినాశనాన్ని సృష్టించగల శక్తియుక్తులను కూడా కలిగి ఉంది. కొన్ని మైళ్ల దూరంనుంచి శాటిలైట్ ద్వారా కూడా కురాటాస్‌ను ఆపరేట్ చేయవచ్చు. మెషీన్ గన్స్‌ను ఆపరేట్ చేయడంలో ఈ రోబో ఆరితేరింది.
నవ్యతతో కూడిన నవ్..
సెన్స్, కామన్‌సెన్స్ ఉన్న రోబో ఇది. దీన్ని ఫ్రాన్స్‌కు చెందిన ఆల్డిబరాన్ కంపెనీ వాళ్లు రూపొందించారు. పవర్ సీపీయూతో, హెచ్‌డీ కెమెరాలతో ఉండే నవ్‌లో కొత్త వెర్షన్‌లను ఎప్పటికప్పుడు డెవలప్‌చేస్తోంది ఫ్రెంచ్ కంపెనీ.
నవ్ తెలివితేటల విషయానికి వస్తే.. ఇది సొంతంగా నిర్ణయాలు తీసుకోగలదు. ప్రోగ్రామింగ్‌కు అనుగుణంగానే స్పందిస్తుంది. ఇతర రోబోలతో కో ఆర్డినేషన్ చేయగలదు. నవ్ రోబోలతో ఫుట్‌బాల్ ఆడించి వాటి వ్యూహరచనా శక్తి గురించి ప్రపంచానికి వివరించారు శాస్త్రవేత్తలు.
ఆరడుగుల బుల్లెట్టు..!
అట్లాస్: ఈయేడాదిలోనే ఆవిష్కృతం అయిన మరో యంత్రుడితను. బోస్టన్‌డైనమిక్స్ కంపెనీ వారు దీన్ని రూపొందించారు. ఈ హ్యూమనాయిడ్‌ను మిలటరీ అవసరాల కోసం వాడతారు. ‘కంప్యూటర్‌కు కాళ్లూ చేతులు వచ్చి భౌతిక ప్రపంచంలోకి అడుగుపెడితే దానికి ప్రతిరూపమే అట్లాస్’ అని వర్ణించారు శాస్త్రవేత్తలు. రెస్క్యూ ఆపరేషన్‌లలో ఇది ఉపయోగపడుతుందని వారు అంటున్నారు.
రోబోలు రంగులేస్తున్నాయి!
భారతదేశంలో ఇప్పుడు రోబోలు చేస్తున్న పనుల్లో అత్యంత ముఖ్యమైనది పెయింటర్ డ్యూటీ. వీటిని ఎత్తై భవనాలకు రంగులేయడానికి, వెల్డింగ్ పనులకు వినియోగిస్తున్నారు. మోటార్ బైకులకు రంగులేసేది రోబోలే. కొన్నిరకాల రోబోలు పరిశ్రమలకు ఉపయుక్తంగా ఉన్నాయి. పరిశ్రమల అవసరాలను తీర్చడమే కాదు వ్యక్తిగతంగా మానవుడికి సేవలందించే రోబోలు కూడా ఉన్నాయి. వైద్యుల స్థానాన్ని కూడా ఆక్రమించాయి. చెఫ్‌లుగా వంటపనిలో సాయం చేస్తున్నాయి. ఇంటిపనులు చేసిపెట్టడానికి సహాయపడే రోబోలు కూడా ఉన్నాయి. ఈ విధంగా మానవుడి జీవితంతో హ్యూమనాయిడ్ల ప్రస్థానం అంతకంతకు బలపడుతోంది. మరికొంతకాలం గడిస్తే... రోబోలు కూడా నిత్యజీవితంలో భాగంగా మారినా ఆశ్చర్యం లేదేమో!
**********************
హ్యూమనాయిడ్‌లు రెండు రకాలు. ఒకటి ఆండ్రాయిడ్.. అంటే పురుషుడి రూపంలోని రోబో. రెండు గైనాయిడ్ అంటే స్త్రీ రూపాన్ని పోలిన రోబో.
రోబోలకూ ఒలింపిక్స్ ఉన్నాయి.. అంతర్జాతీయ స్థాయిలో రోబోలకు ప్రతియేటా ఒలింపిక్స్ జరుగుతున్నాయి. వివిధ దేశాలకు చెందిన రోబోలు 500 బృందాలు పోటీ పడుతుంటాయి. మన దేశానికి చెందిన రోబోలు కూడా గతంలో ఈ పోటీల్లో పతకాలు సాధించాయి. 2009, 2010లలో ఐఐటీ విద్యార్థులు సృష్టించిన రోబోలు కుంగ్‌ఫూ, మెట్లు ఎక్కడం, నృత్యం, రేసింగ్‌లలో సత్తా చాటాయి.
శాస్త్రీయ పరిభాషలో ఇప్పుడు ‘రోబో’ అనే పదం అంతర్థానం అయ్యే సమయం వచ్చేసింది. పెరిగిన ప్రాధాన్యత రీత్యా వీటికి ప్రత్యేకమైన పేర్లను పెట్టుకొని, ‘హ్యూమనాయిడ్స్’గా వ్యవహరిస్తున్నారు.
- జీవన్‌రెడ్డి. బి