రోబో మేస్త్రీ... | Robot tindal ... | Sakshi
Sakshi News home page

రోబో మేస్త్రీ...

Published Mon, Nov 16 2015 1:41 AM | Last Updated on Sun, Sep 3 2017 12:32 PM

రోబో మేస్త్రీ...

రోబో మేస్త్రీ...

పెళ్లి చేసి చూడు... ఇల్లు కట్టి చూడు అని నానుడి. పెళ్లి మాటేమోగానీ ఇల్లు కట్టడమంటే మాత్రం ఈ రోజుల్లో కూడా అంత ఆషామాషీ వ్యవహారమేమీ కాదు. పునాదులతో మొదలుపెట్టి ఒక ఇల్లు పూర్తి చేయడంలో నెలలు ఖర్చయిపోతాయి. దీన్ని దృష్టిలో ఉంచుకునే కాబోలు... జ్యూరిచ్‌లోని ఆర్కిటెక్ట్‌లు, రోబో శాస్త్రవేత్తలు ఈ ‘ఇన్‌సిటూ ఫ్యాబ్రికేటర్’ను తయారు చేశారు. కావాల్సిన పదార్థాలు, డిజైన్ అందిస్తే చాలు.. ఈ రోబో ఎంచక్కా నిర్మాణాన్ని మొదలుపెట్టేస్తుంది. ఇటుకలను ఒకదానిపై ఒకటి అందంగా పేర్చడం మాత్రమే కాదు.. అత్యంత క్లిష్టమైన డిజైన్లను కూడా సులువుగా పూర్తి చేయగలదు.

ఒక మొబైల్ బేస్, రోబోటిక్ చేయితో కూడిన ఈ ఇన్‌సిటూ ఫ్యాబ్రికేటర్‌లో బోలెడు సెన్సర్లు కూడా ఉంటాయి. ఈ సెన్సర్లు నిర్మాణ ప్రాంతాన్ని పరిశీలించి ఓ త్రీడీ మ్యాప్‌ను ఏర్పాటు చేసుకుంటాయి. ఫలితంగా నిర్మాణ ప్రాంతంలో ఏ మాత్రం ఇబ్బంది లేకుండా అటుఇటూ కదలడం వీలవుతుంది. అంతేకాకుండా అప్పటికే అందించిన మ్యాప్‌కు అవసరమైన మార్పులు చేసుకుని పని మొదలుపెడుతుందన్నమాట. గోడ నిర్మాణంలో ఇటుకల కూర్పు ఎలా ఉండాలో మనమే నిర్ణయించుకోవచ్చు. అంతేకాదు... ఈ రోబోతో రకరకాల ఆకారాల్లో నిర్మాణాలు చేపట్టడం చాలా వేగంగా, సులువుగా జరిగిపోతుంది. మరో ఐదేళ్లలో ఈ రోబో అందుబాటులోకి వచ్చే అవకాశముందని అంచనా.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement