మియామీ: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరికొద్ది గంట్లలో మియామీ ఫెడరల్ కోర్టుకు హాజరు కానున్నారు. అధ్యక్ష భవనం వీడిన తర్వాత కూడా.. జాతీయ భద్రతకు సంబంధించి కీలక పత్రాలను తన ఇంట దాచినందుకుగానూ ఆయన క్రిమినల్ అభియోగాలను ఎదుర్కొంటున్నారు.
ఇదిలా ఉంటే.. అమెరికా చరిత్రలోనే నేరారోపణలు ఎదుర్కొంటూ.. కోర్టుకు హాజరైన మాజీ అధ్యక్షుడు కూడా డొనాల్డ్ ట్రంప్ కావడం గమనార్హం. ట్రంప్ కోర్టుకు హాజరు కావడం ఈ మధ్యకాలంలోనే ఇది రెండోసారి. ఓ పోర్న్‌స్టా* అనైతిక ఒప్పందాల వ్యవహారంలో ఏప్రిల్‌లో ఆయన న్యూయార్క్ కోర్టు ఎదుట హాజరయ్యారు. తాజాగా కీలక పత్రాల వ్యవహారంలో ఇప్పుడు హాజరు కానున్నారు.
భారత కాలమానం ప్రకారం.. మంగళవారం అర్ధరాత్రి 12.30 గంటల ప్రాంతంలో ఆయన మియామీ కోర్టుకు హాజరవుతారు. అటుపై నేరుగా న్యూజెర్సీలోని గోల్ఫ్ కోర్సుకు చేరుకుని.. అక్కడ తన మద్దతుదారులను ఉద్దేశించి ప్రసంగిస్తారని తెలుస్తోంది. ఈ కేసులో తాను అమాయకుడని మొదటి నుంచి ఆయన వాదిస్తున్న సంగతి తెలిసిందే., రాజకీయంగా తనను ఇరికించి అధ్యక్ష ఎన్నికలకు దూరం చేసే కుట్ర జరుగుతోందని, శిక్షపడినా తాను పోటీ చేసి తీరతానని అంటున్నారాయన.
రహస్య పత్రాలను దాచినందుకుగానూ మొత్తం 37 నేరారోపణలు ఎదుర్కొంటున్నారాయన. అందులో గూఢచర్యం, నిబంధనల ఉల్లంఘన, రక్షణ సమాచారాన్ని అనధికారికంగా కలిగి ఉండటం లాంటి తీవ్ర నేరాలు ఉన్నాయి. వీటితో పాటు న్యాయాన్ని అడ్డుకునే కుట్ర కూడా ఉంది. ఒకవేళ ఆయన దోషిగా తేలితే.. గరిష్టంగా 20 సంవత్సరాల జైలు శిక్ష విధించబడుతుంది. ఇదిలా ఉంటే ట్రంప్‌కి బుధవారం(జూన్ 14)తో 77 పడిలోకి అడుగుపెట్టనుండగా, అంతకు ముందురోజే క్రిమినల్ అభియోగాలతో కోర్టుకు హాజరు అవుతుండడం గమనార్హం.
హింసకు ఛాన్స్?
January 6, 2021 క్యాపిటల్ హిల్ ముట్టడి.. దాడి ఘటనను ప్రపంచం అంత తేలికగా మర్చిపోలేదు. అయితే ట్రంప్ మద్దతుదారుల నుంచి మళ్లీ ఆ తరహా హింస చెలరేగే అవకాశం ఉందని భావిస్తున్నారు భద్రతా సిబ్బంది. ఈ క్రమంలో మియామీ కోర్టు బయట ఉద్రిక్త వాతావరణం నెలకొనగా.. భారీగా భద్రతను మోహరించారు. ఇంతకు ముందు ట్రంప్ న్యూయార్క్ కోర్టుకు హాజరైనప్పుడు కూడా కోర్టు బయట తీవ్ర గందరగోళం నెలకొన్నప్పటికీ.. పరిస్థితి అదుపులోనే ఉంది. అయితే మియామీ కోర్టు బయట ట్రంప్ మద్దతుదారులు 50 వేల మందిదాకా గుమిగూడొచ్చని అంచనాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏం జరగనుందా? అనే ఉత్కంఠ నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment