కొలంబో: దేశాధ్యక్షుడు గొటబయ రాజపక్సే ఎలాంటి పరిస్థితుల్లో రాజీనామా చేసే ప్రసక్తే లేదని శ్రీలంక ప్రభుత్వం తేల్చి చెప్పింది. తమ ప్రభుత్వం ప్రస్తుత సంక్షోభాలను ఎదుర్కొంటుందని తెలిపింది. దేశంలో ఎమర్జెన్సీ విధించాలన్న గొటుబయ నిర్ణయాన్ని సమర్థించింది. ఆందోళనలను అణచివేసేందుకు గొటుబయ దేశంలో ఎమర్జెన్సీ విధించి అనంతరం ప్రజాగ్రహానికి తలవంచి ఉపసంహరించుకున్న సంగతి తెలిసిందే! అధ్యక్ష పదవికి ఎన్నికైన గొటబయ రాజీనామా చేయాల్సిన అవసరం లేదని పార్లమెంట్‌లో ప్రభుత్వం చీఫ్ విప్, మంత్రి జాన్‌స్టన్ ఫెర్నాండో చెప్పారు. గతవారం దేశంలో విధించిన అత్యవసర పరిస్థితిని మంగళవారం రాత్రి గొటబయ రద్దు చేశారు.
సభలో వాదనలు..
మంగళవారం పార్లమెంట్‌లో ప్రతిపక్ష, అధికార పక్షాల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. దీంతో సభను స్పీకర్ రెండుమార్లు వాయిదా వేశారు. లంకలో పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నట్లు ఐరాస మానవహక్కుల కార్యాలయం పేర్కొంది. శాంతియుత పరిష్కారం కోసం రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలతో సమావేశాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరింది. దేశంలో పరిస్థితులు కొన్ని వారాలుగా క్షీణించాయని ఐరాస ప్రతినిధి లిజ్ చెప్పారు.
మే నాటికి మునిగిపోవడమే!
లంకలో ఆర్థిక, రాజకీయ సంక్షోభాలు మే చివరికి మరింత ముదిరిపోతాయని ఆర్థికవేత్తలు హెచ్చరించారు. ఈ రెండు సంక్షోభాలకు తక్షణ పరిష్కారం చూడకపోతే భవిష్యత్‌లో భారీ మూల్యం తప్పదని ఆర్థికవేత్త జనక్ సింఘే చెప్పారు. కేబినెట్ నియామకాలపై అధ్యక్షుడు మల్లగుల్లాలు పడుతున్నారు. ప్రభుత్వంలో చేరాలన్న ఆయన పిలుపునకు రాజకీయపార్టీలేవీ స్పందించలేదు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత రాజపక్సే కుటుంబం కీలక పదవులన్నీ తమ గుప్పిట్లో పెట్టుకుంది. సంక్షోభం ముదిరిపోవడంతో ఇప్పుడు పదవులు పంచుతామని పిలిచినా ఏ పార్టీ స్పందించడం లేదు. దీంతో అటు రాజకీయ, ఇటు ఆర్థిక సంక్షోభం కొనసాగుతూనే ఉంది.
Comments
Please login to add a commentAdd a comment