వారం అనుకుంటే.. అటు తిరిగి ఇటు తిరిగి అదికాస్త ఆరు నెలలు దాటేసింది. నాసా వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుట్చ్ విల్‌మోర్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌కు వెళ్లి ఆరు నెలలు పూర్తైంది. మరో రెండు నెలలపాటు వాళ్లు అక్కడ ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ఈలోపు సునీతా విలియమ్స్ ఆరోగ్యం పాడైపోయిందంటూ కథనాలు వెలువడ్డాయి. ఇంకొన్ని కథనాలైతే ఆమె బ్రెయిన్ డెడ్‌కు గురయ్యే అవకాశాలున్నాయంటూ భయపెట్టిస్తున్నాయి. ఇంతకీ నాసా ఏమంటోంది?
🚀జూన్ 5వ తేదీన బోయింగ్ కొత్త స్టార్‌లైనర్ క్రూ క్యాప్సూల్‌లో.. సునీత, విల్‌మోర్‌లు ఐఎస్‌ఎస్‌కు చేరుకున్నారు. వారంపాటు టెస్ట్ ఫ్లైట్ తర్వాత వాళ్లు తిరిగి భూమికి చేరాల్సి ఉంది. కానీ..
🚀బోయింగ్ స్టార్‌లైనర్‌కు సాంకేతిక సమస్య తలెత్తింది. థ్రస్టర్ ఫెయిల్యూర్స్, హిలీయం లీకేజీలతో.. ఇద్దరూ అక్కడే ఉండిపోయారు. దీంతో సెప్టెంబర్ 7వ తేదీన ఆ ఇద్దరు వ్యోమగాములు లేకుండానే క్యాప్సూల్ భూమ్మీదకు వచ్చేసింది. వాళ్లు భూమ్మీదకు ఎప్పుడు తిరిగి వస్తారో అనే ఆందోళన మొదలైంది.
🚀టెంపరరీ విజిటర్స్‌గా వెళ్లిన విలియమ్స్, విల్‌మోర్‌లు.. ఐఎస్‌ఎస్‌కు ఫుల్‌టైం సిబ్బందిగా మారిపోయారు.స్పేస్‌వాక్, ఐఎస్‌ఎస్ నిర్వహణతో పాటు ఆ భారీ ప్రయోగశాలలో వీళ్లిద్దరితో శాస్త్రీయ పరిశోధనలు చేయించింది నాసా. అంతేకాదు.. వీళ్ల పరిస్థితిని మరో రూపకంలోనూ ‘ఛాలెంజ్’గా తీసుకుంది నాసా. ఇలాంటి విపత్కర పరిస్థితిల నడుమ అంతరిక్షంలో ఇరుక్కుపోయినవాళ్లను రక్షించేందుకు మంచి ఐడియాలు గనుక ఇస్తే.. వాళ్లకు రూ.17 లక్షల క్యాష్ ప్రైజ్ ఇస్తామని నాసా ప్రకటించింది.
🚀తప్పనిసరిగా ఇద్దరూ ఎనిమిది నెలలు అక్కడ ఉండాల్సిన పరిస్థితి. దీంతో.. సునీతా విలియమ్స్ ఆరోగ్యం క్షీణిస్తోందన్న కథనాలు కలవరపాటుకు గురి చేశాయి. తాజాగా విడుదల చేసిన ఫొటోలు, వీడియోల్లోనూ ఆమె బరువు తగ్గినట్లు స్పష్టమైంది. గురుత్వాకర్షణ శక్తి లేని అలాంటి చోట.. కండరాలు, ఎముకలు క్షీణతకు గురవుతాయి. అలాంటప్పుడు.. రోజుకి రెండున్నర గంటలపాటు వ్యాయామాలు చేయడం తప్పనిసరి.
🚀అయితే నాసా మాత్రం ఆమె ఆరోగ్యంపై వస్తున్న కథనాలను.. పుకార్లుగా కొట్టిపారేస్తోంది. బరువు తగ్గినప్పటికీ ఆమె ఆరోగ్యంగానే ఉన్నారంటూ ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ను అందిస్తూ వస్తోంది. కానీ, ఐఎస్‌ఎస్‌లో ఆమె పరిస్థితిని చూసి నాసా ఏమైనా దాస్తోందా? అనే అనుమానాలు కలిగాయి. ఈ తరుణంలో తాను క్షేమంగానే ఉన్నానంటూ స్వయంగా సునీతనే ఓ వీడియో విడుదల చేశారు.
🚀సెప్టెంబర్ 19న.. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌లోనే ఈసారి ఆమె పుట్టినరోజు జరిగింది. అయితే అంతరిక్షంలో ఇదే ఆమెకు తొలి పుట్టినరోజేం కాదు. 2012లో జులై 14 నుంచి నవంబర్ 18 మధ్య ఆమె స్పేస్‌లోనే గడిపారు.
🚀భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్.. అంతరిక్షం నుంచే కోట్లాది మందికి దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. అంతేకాదు.. జులై 26వ తేదీన ఓ సరదా వీడియోను విడుదల చేసింది నాసా. భూమికి మైళ్ల దూరంలో స్పేస్ స్టేషన్‌లో వ్యోమగాములు సరదా యాక్టివిటీస్‌లో భాగం అవుతారని ‘ఒలింపిక్స్’పేరిట వీడియో రిలీజ్ చేశారు.
🚀ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్. 1998 నవంబర్‌లో ఇది ప్రారంభమైంది. నాసాతో పాటు ఐదు దేశాల స్పేస్ స్టేషన్లు దీనిని నిర్వహణ చూసుకుంటాయి. అంతరిక్ష పరిశోధనల కోసం భూమి ఉపరితలం నుంచి 400 కిలోమీటర్ల దూరంలో లో ఎర్త్ ఆర్బిట్(LEO) వద్ద ఏర్పాటు చేశారు. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ బరువు 4 లక్షల 45 వేల కేజీలు. 59ఏళ్ల సునీతా విలియమ్స్.. ప్రస్తుతం దీనికి కమాండర్‌గా ఉన్నారు.
🚀మరో రెండు నెలల తర్వాత.. ఫిబ్రవరిలో ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్ ఎక్స్ ఫాల్కన్ -9 రాకెట్ అక్కడికి వెళ్లనుంది. అందులో సునీతా విలియమ్స్, బుట్చ్ విల్‌మోర్‌లను భూమ్మీదకు తీసుకు వస్తారు.
🚀అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్‌ఎస్)లో ఉన్న భారత–అమెరికన్ వ్యోమగామి సునీతా విలియమ్స్ వచ్చే ఏడాది స్పేస్‌వాక్ చేయబోతున్నారు. ఇందుకోసం సన్నాహాలు ప్రారంభించారు. ఐఎస్‌ఎస్ నుంచి బయటకు వచ్చి కాసేపు అంతరిక్షంలో విహరించడమే స్పేస్‌వాక్.
🚀భారత సంతతికి చెందిన అమెరికన్ వ్యోమగామి సునీతా విలియమ్స్.. అమెరికాలోని ఒహాయో పట్టణంలో 1965లో జన్మించారు. ఆమె తండ్రి గుజరాతీ. తల్లి స్లొవేనియన్. మసాచుసెట్స్‌లోని నీధమ్ హైస్కూల్‌లో స్కూలింగ్ పూర్తిచేసిన ఆమె.. యూఎస్‌లోని నావల్ అకాడమీలో ఫిజిక్స్‌లో డిగ్రీ పూర్తిచేశారు. ఇంజినీరింగ్ మేనేజ్‌మెంట్‌లో మాస్టర్స్ పూర్తిచేసిన సునీత.. తొలుత అమెరికన్ నావికా దళంలో ఉద్యోగానికి ఎంపికయ్యారు. డైవింగ్ ఆఫీసర్‌గా కొన్నాళ్ల పాటు పనిచేసిన ఆమె.. అంతరిక్షంపై మక్కువతో 1998లో రోదసీ యానానికి సంబంధించిన శిక్షణ తీసుకున్నారు.
🚀తన తొలి పర్యటనలో భాగంగా 2006 డిసెంబర్ నుంచి 2007 జూన్ వరకు.. సుమారు ఏడు నెలల పాటు ఐఎస్‌ఎస్‌లో గడిపారామె. ఈ సమయంలోనే 29 గంటల 17 నిమిషాల పాటు ఐఎస్‌ఎస్ వెలుపల నాలుగుసార్లు స్పేస్‌వాక్ చేశారు. ఇది అప్పట్లో రికార్డుగా నిలిచింది. ఇక 2012లో రెండోసారి అంతరిక్ష యాత్రకు వెళ్లారు సునీత.
ఈ క్రమంలో నాలుగు నెలల పాటు ఐఎస్‌ఎస్‌లోనే గడిపిన ఆమె.. అక్కడి ఆర్బిటింగ్ ల్యాబొరేటరీపై పరిశోధనలు చేశారు. ఈ సమయంలోనూ అంతరిక్షంలో నడిచిన ఆమె.. మొత్తంగా 50 గంటల 40 నిమిషాల పాటు స్పేస్‌వాక్ చేసి.. ఎక్కువ సమయం స్పేస్‌వాక్ చేసిన రెండో మహిళా వ్యోమగామిగా చరిత్రకెక్కారు. ఇలా గత రెండు స్పేస్షటిల్స్‌తో కలిపి మొత్తంగా 322 రోజులు అంతరిక్షంలో గడిపారు సునీత.
🚀కల్పనా చావ్లా తర్వాత అంతరిక్షంలోకి వెళ్లిన రెండో ఇండో-అమెరికన్ మహిళగా ఖ్యాతి గడించారు. ఇప్పటిదాకా రెండుసార్లు వెళ్లొచ్చారు. నాసా స్టార్‌లైనర్ వ్యోమనౌకలో ముచ్చటగా మూడోసారి అంతరిక్షంలోకి వెళ్లారు. అంతరిక్ష యానంలోనూ భారతీయ మూలాలను ఆమె ఏనాడూ వదల్లేదు. భగవద్గీతతో పాటు ఉపనిషత్తులను, గణపతి విగ్రహాన్ని వెంట తీసుకెళ్తానని ఆమె చెబుతూ ఉంటారు.
Comments
Please login to add a commentAdd a comment