
న్యూఢిల్లీ: తొమ్మిది నెలలుగా అంతరిక్షంలో చిక్కుకుపోయిన భారత సంతతి నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్(NASA astronaut Sunita Williams) భూమికి తిరిగి వచ్చారు. ఆమె ఈరోజు (బుధవారం) తెల్లవారుజామున స్పేస్‌ఎక్స్ డ్రాగన్ నుండి దిగారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది. ఈ నేపధ్యంలో వ్యోమగామి సునీతా విలియమ్స్ బంధువు ఫల్గుణి పాండ్యా భావోద్వేగానికి లోనవుతూ, సునీతాకు సంబంధించిన పలు విషయాలు మీడియాకు తెలిపారు.
సునీతా విలియమ్స్ ఎంతో భక్తితో గణేశుని విగ్రహాన్ని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి తీసుకువెళ్లారని, దానిని నిత్యం తనతో పాటే ఉంచుకున్నారని అమెరికాలోని న్యూజెర్సీలో ఉంటున్న ఆమె వరుస సోదరి ఫల్గునీ పాండ్యా తెలిపారు. సునీతా విలియమ్స్ తిరిగి రావడం ఎంతో సంతోషంగా ఉన్నదని, ఈ వార్త తెలియగానే, తమ కుటుంబ సభ్యులంతా ఆలయంలో ప్రత్యేక ప్రార్థనలు, హోమాలు చేయనున్నామని తెలిపారు. సునీతా ఎప్పుడు తిరిగి వస్తుందా అని తామంతా ఇంతకాలం ఎదురు చూశామని తెలిపారు. సునీతా విలియమ్స్ అంతరిక్షంలో తేలియాడుతున్న గణేశ విగ్రహం ఫోలోను షేర్ చేశారని ఆమె తెలిపారు.
సునీతా విలియమ్స్‌కు భారతీయ వంటకాలంటే(Indian cuisine) ఎంతో ఇష్టమని, మరీ ముఖ్యంగా సమోసా ఇష్టమని, ఆమె భూమికి తిరిగి వచ్చిన తర్వాత భారతదేశాన్ని సందర్శించాలని అనుకుంటున్నారని తెలిపారు. 2007లో మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తాము ఆయనను కలుసుకున్నామని, ఆ తర్వాత సునీత, ఆమె తండ్రి అమెరికాలో ప్రధాని మోదీని కలుసుకున్నారన్నారు. సునీత స్వస్థలం గుజరాత్ అని, ఆమె పూర్వీకుల గ్రామమైన ఝులసాన్‌లో సంబరాలు జరుగుతున్నాయన్నారు.
తాను కుంభమేళా సమయంలో భారతదేశానికి వచ్చినప్పుడు ఆ వివరాలను తెలుసుకునేందుకు సునీత చాలా ఆసక్తి చూపారన్నారు. తాను ఆమెకు కుంభమేళా చిత్రాలను చూపించానని, అప్పుడు ఆమె తనకు అంతరిక్షం నుండి కుంభమేళా చిత్రాన్ని పంపారన్నారు. కుంభమేళాలో అది మరపురాని ఫోటో అని ఫల్గుణి పాండ్యా పేర్కొన్నారు. త్వరలోనే తాము సునీతాను కలుసుకుంటామని, సమోసా పార్టీ జరుపుదామని అంటున్నారామె.
ఇది కూడా చదవండి: సునీతా విలియమ్స్ స్వగ్రామంలో సంబరాలు
Comments
Please login to add a commentAdd a comment