
ఘటన జరిగిన రిస్‌బెర్గ్‌స్కా క్యాంపస్ వద్ద భద్రతా సిబ్బంది, ఎమర్జెన్సీ బృందం
ఒరెబ్రో: ప్రశాంత వాతావరణానికి మారుపేరైన స్వీడన్‌లో కాల్పులు కలకలం రేపాయి. రాజధాని స్టాక్‌హోంకు 200 కిలోమీటర్ల దూరంలోని ఒరెబ్రోలో జరిగిన కాల్పుల ఘటనలో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. నగర శివార్లలోని రిస్‌బెర్గ్‌స్కా వయోజన విద్యా కేంద్రం క్యాంపస్‌లో మంగళవారం మధ్యాహ్నం ఘటన చోటుచేసుకుంది. ఇక్కడ ప్రైమరీ, అప్పర్ సెకండరీ స్కూళ్లు ఉన్నాయి. ఇక్కడే వలసదారులకు స్వీడిష్ బోధిస్తారు. తరగతులు ముగియడంతో చాలా మంది విద్యార్థులు ఇళ్లకు వెళ్లిపోయారని, కాల్పుల సమయంలో అక్కడ కొద్ది మంది మాత్రమే ఉన్నట్లు సమాచారం.
మృతుల్లో కాల్పులకు తెగబడిన వ్యక్తి కూడా ఉన్నాడు. అతడొక్కడే ఈ దారుణానికి పాల్పడినట్లుగా భావించడం లేదని పోలీసులు తెలిపారు. దుండగుడిని గుర్తించాల్సి ఉందన్నారు. గాయాలతో చికిత్స పొందుతున్న వారి సంఖ్యను పోలీసులు వెల్లడించలేదు. ఘటన ప్రాంతంలో భీతావహ పరిస్థితిని బట్టి చూస్తే మరణాల సంఖ్యను కచ్చితంగా చెప్పలేమని ఓ అధికారి చెప్పడం గమనార్హం. దారుణానికి దారి తీసిన కారణాలపై దర్యాప్తు జరుగుతోందని పోలీసులు చెప్పారు. ప్రస్తుతానికైతే ఉగ్ర లింకులున్నట్లు చెప్పలేమన్నారు. అధికారులు మృతులను గుర్తించే పనిలో ఉన్నారు.

Comments
Please login to add a commentAdd a comment