పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న భీకర యుద్ధం ఎనిమిదో రోజుకు చేరుకుంది. ఉధృతంగా సాగుతున్న ఈ ఆధిపత్య పోరులో ఇరువర్గాలకు చెందిన 3,200 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడిలో 600 చిన్నారులతో 1,900 పాలస్తీన్లు, సహా మరణించినట్లు గాజా అధికారులు వెల్లడించారు. మరోవైపు హమాస్ ఉగ్రవాదుల ఊచకోతలో 1300 మంది ఇజ్రాయెల్ పౌరులు మృత్యువాతపడ్డారు.
తాజాగా ఉత్తర గాజాను ఖాళీ చేయాలంటూ ఇజ్రాయెల్ సైన్యం ఆదేశించడంతో ఇక్కడి పాలస్తీనియన్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే గాజాలో కరెంట్, మంచి నీళ్లు, ఆహారం, ఇంధన కొరతతో అల్లాడుతున్న అక్కడి పౌరులు ఇజ్రాయెల్ ఆదేశాలతో మరింత భయాందోళన చెందుతున్నారు. ప్రాణాలను అరచేతిలో పట్టుకొని వేలాది మంది పాలస్తీనియన్లు ఖాళీ నడకన సౌత్ గాజాకు తరలివెళ్తున్నారు.
ఆరంభం మాత్రమే..
మరోవైపు హమాస్ ఉగ్రవాదులను నిర్మూలించడమే లక్ష్యంగా గాజాపై పూర్తిస్థాయి యుద్ధానికి ఇజ్రాయెల్ సైన్యం సిద్ధమవుతోంది. గాజాను ఆక్రమించుకునేందుకు దాని సరిహద్దుల్లో 3.60 లక్షలమంది రిజర్వ్ సైనికులు సిద్ధం చేసింది. గత ఏడు రోజులుగా గాజాలోని హమాస్ స్థావరాలపై వైమానిక దాడులు చేస్తున్న ఇజ్రాయెల్ సేనలు తాజాగా గ్రౌండ్ ఆపరేషన్ దాడులను ప్రారంభించింది. దీనిపై ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజామిన్ నెతన్యాహు మాట్లాడుతూ.. తమ దేశం ఇప్పుడే ప్రతీకారం తీర్చుకోవడం మొదలు పెట్టిందని తెలిపారు. ఇజ్రాయెల్ సేనలు సింహాల్లా పోరాడుతున్నాయని, ఇది కేవలం ప్రారంభం మాత్రమేనని పేర్కొన్నారు.
ఉత్తర గాజాలోనే హమాస్ మిలిటెంట్ల మకాం
ఉత్తర గాజాపై హమాస్‌కు గట్టి పట్టుంది. అగ్రనాయకులంతా అక్కడే మకాం వేశారు. అందుకే తొలి టార్గెట్‌గా అదే ప్రాంతాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఉత్తర గాజాను వదిలి దక్షిణ గాజాకు వెళ్లాలని పాలస్తీనా ప్రజలకు ఇజ్రాయెల్ సైన్యం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. సామాన్య ప్రజలకు నష్టం కలిగించే ఉద్దేశం లేదని, యుద్ధం ముగిసిన తర్వాత వారంతా తిరిగిరావొచ్చని సూచించింది.
హమాస్ మిలిటెంట్లు జనావాస ప్రాంతాల్లో మకాం వేసి, కార్యకలాపాలు సాగిస్తున్నారు. సాధారణ ప్రజలను కవచంగా వాడుకుంటూ ఇజ్రాయెల్‌పై రాకెట్లు ప్రయోగిస్తున్నారు. ప్రజలను అక్కడి తరలిస్తే మిలిటెంట్ల ముసుగు తొలగిపోతుందని ఇజ్రాయెల్ చెబుతోంది. కాగా గాజా మొత్తం జనాభా 20 లక్షలు కాగా ఉత్తర గాజాలో 10 లక్షల మంది నివాసం ఉంటున్నారు. ఇజ్రాయెల్ ఆదేశాల మేరకు జనాలు దక్షిణ గాజాకు పయనవతున్నారు.అయితే ఇప్పటికే జనంతో కిక్కిరిపోయిన దక్షిణ గాజాపై మరింత ఒత్తిడిపెరగనుంది.
చదవండి: అమేయ సైనిక శక్తి.. అతి శక్తిమంతమైన సైన్యం ఇజ్రాయెల్ సొంతం
దారుణంగా గాజా పరిస్థితి
గాజాలో పరిస్థితిలు మరి దారుణంగా మారాయి. ఎటు చూసిన శిథిలాలు.. వాటి కింది చిక్కుకున్న మృతదేహాలే కనిపిస్తున్నాయి. కరెంట్, తాగునీరు, నిత్యవసరాల కొరతతో పాలస్తీనియన్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గాజా పాఠశాలల్లో ఏర్పాటు చేసిన ఐక్యరాజ్యసమితి శిబిరాల్లో లక్ష మందికిపైగా జనం ఆశ్రయం పొందుతున్నారు. ఆకలి తీర్చుకోవడం, ప్రాణాలు కాపాడుకోవడమే ప్రథమ కర్తవ్యంగా మారిపోయింది. మరోవైపు మృత్యువు ఎటువైపు నుంచి దాడి చేస్తుందో, రాకెట్లు, డ్రోన్లు ఎప్పుడు వచ్చిపడతాయో, ఎవరి ప్రాణాలు గాల్లో కలిసిపోతాయోనన్న భయాందోళనతో ప్రాణాలను అరచేతిలో పట్టుకొని గడుతున్నారు.
ఖాళీ చేయించే ఆలోచన మానుకోండి: ఐరాస
ఉత్తర గాజాను ఖాళీ చేయాలంటూ ఇజ్రాయెల్ సైన్యం జారీ చేసిన ఉత్తర్వులపై ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసింది. లక్షలాది మందిని బలవంతంగా తరలించడం మానవ విపత్తు అవుతుందని పేర్కొంది. సామూహికంగా జనమంతా ఒకేసారి తరలివెళ్లడం సంక్షోభానికి దారితీస్తుందని స్పష్టం చేసింది. జనాన్ని ఖాళీ చేయించే ఆలోచన మానుకోవాలని ఐక్యరాజ్యసమితి ప్రతినిధి స్టెఫానీ డుజారిక్ ఇజ్రాయెల్‌కు సూచించారు.
ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా నిరసనలు
గాజా స్ట్రిప్‌లో మొత్తం 150 మంది ఇజ్రాయెల్ పౌరుల్ని, విదేశీయుల్ని తమ బంధీలుగా ఉంచుకోడంతో ఇజ్రాయెల్ సైన్యం గాజాపై శక్తివంతమైన రాకెట్లు ప్రయోగిస్తోంది. ఇటు హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్‌పై విరుచుకుపడుతున్నారు. గాజా నుంచి రాకెట్ల వర్షం కురిపిస్తున్నారు. మరోవైపు గాజాపై ఇజ్రాయెల్ సైన్యం దాడులను దక్షిణ ప్రాచ్చంలోని దేశాలు ఖండిస్తున్నాయి. బీరూట్, ఇరాక్, ఇరాన్, జోర్డాన్ బహ్రెయిన్‌లో పాలస్తీనియన్లకు భారీగా మద్దతు లభిస్తోంది. ఇజ్రాయెల్ దాడులకు వ్యతిరేకంగా నిరసలను వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment