ధ్రువీకరించిన లెబనాన్
మృతులు 37కు చేరినట్టు వెల్లడి
బీరుట్: బీరుట్‌పై శుక్రవారం ఇజ్రాయెల్ జరిపిన భీకర క్షిపణి దాడిలో హెజ్బొల్లా విభాగం ఎలైట్ రద్వాన్ ఫోర్స్ చీఫ్ ఇబ్రహీం అకీల్ మృతి చెందినట్లు లెబనాన్ ప్రభుత్వం ధ్రువీకరించింది. మరో సీనియర్ కమాండర్ అహ్మద్ వహబీ కూడా చనిపోయినట్లు ప్రకటించింది. ఘటనలో మృతుల సంఖ్య 37కి చేరుకుందని తెలిపింది. వీరిలో ఏడుగు రు మహిళలు, ముగ్గురు చిన్నారులున్నట్లు వివరించింది.
క్షతగాత్రులైన 68 మందిలో 15 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు ఆరోగ్య మంత్రి ఫిరాస్ అబియడ్ శనివారం చెప్పారు. మరో 23 మంది జాడ తెలియడం లేదన్నారు. నేలమట్టమైన అపార్టుమెంట్ శిథిలాల తొలగింపు ప్రక్రియ ఇంకా కొనసాగుతున్నందున మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని మంత్రి పేర్కొ న్నారు. కాగా, శుక్రవారం తమ దాడిలో హెజ్బొల్లాకు చెందిన 16 మంది హతమైనట్లు ఇజ్రాయెల్ ఆర్మీ తెలిపింది.
హెజ్బొల్లా కూడా ఇదే విషయాన్ని ధ్రువీకరించింది.శనివారం హెజ్బొల్లా మీడియా విభాగం జర్నలిస్టులను ఘటనాస్థలికి తీసుకెళ్లింది. మొత్తం 16 అపార్టుమెంట్లున్న ఆ సముదాయంలో క్షిపణి దాడి తీవ్రతకు మిలిటెంట్ల సమావేశం జరిగిన పక్క అపార్టుమెంట్ కూడా దెబ్బతింది. క్షిపణి భవనాన్ని చీల్చుకుంటూ నేరుగా బేస్‌మెంట్‌లోకి దూసుకుపోయిందని ఏఎఫ్‌పీ తెలిపింది. ఆ సమీపంలోని పలు దుకాణాలు కూడా ధ్వంసమయ్యాయి. పేజర్లు, వాకీటాకీలు, రేడియోలు పేలిన ఘటనల్లో గాయపడిన వారితో దేశంలోని ఆస్పత్రులన్నీ కిటకిటలాడుతున్నాయని ఆరోగ్య మంత్రి ఫిరాస్ చెప్పారు.
అకీల్‌పైనే ఎందుకు గురి?
ఇబ్రహీం అకీల్ ప్రధాన లక్ష్యంగా శుక్రవారం బీరుట్‌పై ఇజ్రాయెల్ భారీ దాడికి పాల్పడింది. బీరుట్‌లోని తమ ఎంబసీపై 1983లో జరిగిన దాడికి అకీలే సూత్రధారి అని అమెరికా అనుమానం. అప్పటి నుంచి అతడిని హిట్‌లిస్టులో ఉంచింది. పట్టిచ్చిన/ జాడ తెలిపిన వారికి 70 లక్షల డాలర్ల రివార్డును కూడా ప్రకటించింది.
బీరుట్‌లోని జనసమ్మర్థం ఉండే ప్రాంతంలోని ఆ అపార్టుమెంట్ సముదాయం బేస్‌మెంట్‌లో అకీల్ మిలిటెంట్లతో సమావేశమైనట్లు తమ కు ముందుగానే సమాచారం అందిందని శుక్రవారం ఆర్మీ ప్రకటించింది. ఈ మేరకు దాడి చేపట్టామని వెల్లడించింది. కాగా, హెజ్బొల్లా కార్యకలాపాల్లో దశాబ్దాలుగా మహ్మద్ వహబీ కీలకంగా ఉన్నాడు. ఇతడిని ఇజ్రాయెల్ 1984లో బంధించి జైలులో ఉంచింది. 1997లో దక్షిణ లెబనాన్‌లో 12 మంది ఇజ్రాయెల్ సైనికులను చంపిన ఫీల్డ్ కమాండర్లలో వహబీ ఒకరని చెబుతారు.
లెబనాన్‌పై మరిన్ని దాడులు
లెబనాన్ దక్షిణ ప్రాంతంపై శనివారం కూడా ఇజ్రాయెల్ వైమానిక దాడులను కొనసాగించింది. హెజ్బొల్లా స్థావరాలే లక్ష్యంగా దాడులు జరిపామని తెలిపింది. హెజ్బొల్లా కూడా ఇజ్రాయెల్‌పైకి పెద్ద సంఖ్యలో రాకెట్లు ప్రయోగించింది. వాటితో వాటిల్లిన నష్టమెంతో తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment