Lemminkainen Hoard Story: Temple Twelve Group Continue Their Search For The Worlds Largest Hoard
Sakshi News home page

34 ఏళ్లు.. లక్షన్నర కోట్ల నిధి!

Published Thu, Nov 11 2021 1:40 PM | Last Updated on Thu, Nov 11 2021 2:17 PM

Treasure Hunters Continue Their Search For The Worlds Largest Hoard - Sakshi

జానపద కథల నుంచి మొన్నటి కేజీఎఫ్‌దాకా గుప్తనిధుల సినిమాలంటే జనంలో క్రేజ్‌ అంతాఇంతా కాదు. దాన్ని దక్కించుకోవడం కోసం జరిగే పోరును ఆసక్తికరంగా చూస్తారు. నిధుల గురించిన సమాచారం అంటే ఆత్రుతగా ఉంటుంది. ఆసక్తి, ఆత్రుత ఓకే. కానీ ఆ నిధులను గుర్తించడం కోసం జీవితంలో విలువైన 34 ఏళ్లు కేటాయించడమంటే.. ఊహించడానికే కష్టంగా ఉంది కదా! ఆ కష్టమైన పనిని ఇష్టంగా చేయడానికి కారణం ఆ నిధి విలువ అక్షరాలా లక్షన్నర కోట్లు. అన్వేషణ కొనసాగిస్తున్న టీమ్‌ ‘టెంపుల్‌ట్వెల్వ్‌’. మూడు దశాబ్దాలుగా ఈ ‘లెమ్మిన్‌కినెన్‌ హోర్డ్‌’ కోసం వేటను నిరాటంకంగా కొనసాగిస్తోంది. ఆ రహస్య నిధికి దగ్గర్లోనే ఉన్నామని తాజాగా వెల్లడించిందీ బృందం.  

ఎవరీ లెమ్మిన్‌కినెన్‌? 

ఫిన్నిష్‌ పురాణాల్లో ప్రముఖ వ్యక్తి లెమ్మిన్‌కినెన్‌. ఆయన మీద అనేక పురాణగాథలు, కావ్యాలున్నాయి. ఫిన్‌లాండ్‌ రాజధాని హేల్సింకికి 20 మైళ్ల దూరంలో ఉన్న సిబ్బోస్బర్గ్‌ గుహల్లో ఆయన పేరుతో దేవాలయం ఉందట. అందులోనే లెమ్మిన్‌కినెన్‌కు సంబంధించిన నిధులు ఉన్నాయట. అయితే, ఆ నిధులకు సంబంధించిన ఆనవాళ్లను లెమ్మిన్‌కినెన్‌ వారసుడు యోగి ఓర్‌బాక్‌ 1987లో తొలిసారిగా ప్రపంచానికి  వెల్లడించాడు. ఆ భూమి వారసత్వంగా తమ పూర్వీకుల నుంచి తనకు వచ్చిందని ఆ ప్రాంతంలో గుప్త నిధులున్నాయని తెలిపాడు. గుడి ద్వారానికి అడ్డుగా పెద్దపెద్ద బండరాళ్లుపెట్టారని, నాటినుంచి ఆ నిధులకు రక్షకులం తామేనని చెప్పాడు. ఈ నేపథ్యంలో పై వివరాలతో కార్ల్‌ బోగన్‌ రాసిన పుస్తకంలోని సమాచారం ఆధారంగా అన్వేషణ మొదలైంది.  



లక్షల కోట్ల సంపద!?
నిజానికి అక్కడ నిధులున్నాయని ఆధారాలేం లేవు.  అయినా ‘ప్రపంచంలోనే అతిపెద్ద నిధి’గా పిలువబడే దీని విలువ లక్షన్నర కోట్లకుపైగా ఉండొచ్చని భావిస్తున్నారు. నిధుల్లో 50వేల దాకా కెంపులు, పగడాలు, నీలమణులు, వజ్రాలు, మరో వెయ్యి అద్భుత కళాఖండాలు ఉంటాయని వారి నమ్మకం. 18 క్యారెట్ల బంగారంతో తయారు చేసిన మానవ విగ్రహాలు కూడా ఉన్నాయని విశ్వాసం. బాక్‌తోపాటు 1987లో ‘టెంపుల్‌ట్వెల్వ్‌’ బృందం ఆ నిధుల కోసం వేట మొదలుపెట్టింది. దాతల సహాయంతో తవ్వకాలు జరుపుతోంది. ట్యునెలా నది తీరాన ఉన్న ఈ పర్వత ప్రాంతంలో చలికాలంలో మంచు గడ్డకట్టుకుపోయి ఉంటుంది. వేసవిలో కరిగి ఆ నీరు గుహ అంతా నిండిపోతుంది. వేసవి దాకా ఎదురుచూసి పదిహేను లక్షల లీటర్ల నీటిని తోడేసి... తవ్వకాలు జరుపుతున్నారు. ముప్పై ఏళ్లుగా.. ఏటా ఇదే తంతు.  

‘టెంపుల్‌ ట్వెల్వ్‌’ అంటే ఏమిటి?

ఒకే భావజాలాలు కలిగిన పన్నెండుమంది మహిళలు, పన్నెండు మంది పురుషులతో మొదలైందీ ‘టెంపుల్‌ ట్వెల్వ్‌’ బృందం. ఈ మూడు దశాబ్దాల్లో కొందరు చనిపోయారు. కొందరు రిటైర్‌ అయ్యారు. పాతవాళ్లు ఇద్దరే మిగిలారా బృందంలో. ఎప్పటికప్పుడు కొత్తవాళ్లు చేరుతున్నారు. ఇదిలా ఉండగా లెమ్మిన్‌కినెన్‌ యజమాని ఓర్‌ బాక్‌ 2010లో తన వ్యక్తిగత సహాయకుని చేతిలో హత్యకు గురయ్యాడు. ఈ కేసులో సంబంధం ఉందని ఇద్దరు భారతీయులను అప్పట్లో పోలీసులు అరెస్టు చేశారు. తరువాత ఇద్దరూ విడుదలయ్యారు. అయితే ఈ హత్యకు కారణాలేమీ తెలియలేదు. దానికంటే ముందు పెనుగులాట జరిగిందని వైద్య నివేదిక తెలిపింది.  

కొన్ని నెలల్లో ముగింపు.. 
34 ఏళ్ల ప్రయత్నాలు ఫలించాయని, ఆ నిధికి ఇంకా కొన్ని నెలల దూరంలోనే ఉన్నామని చెబుతోంది బృందం. గుడి ద్వారానికి అడ్డంగా ఉన్న పెద్ద బండరాయిని తొలగిస్తే అందులో ఉన్న నిధులు తమ చేతికొస్తాయని ఈ బృందం చెబుతోంది. ‘34 ఏళ్ల అన్వేషణకు ఇంకొన్ని నెలల్లో ముగింపు వస్తుంద’ని బృందానికి నేతృత్వం వహిస్తున్న బోరెన్‌ తెలిపారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement