కెనడాపై ట్రంప్ వెటకారం
కెనడా ప్రధాని ట్రూడోతో భేటీ సందర్భంగా వ్యాఖ్య
వాషింగ్టన్: తాను అధికారంలోకి వస్తే కెనడా నుంచి దిగుమతి అయ్యే ఉత్పత్తులపై భారీ సుంకాలు విధిస్తానని ప్రకటించి కెనడా కలవరపాటుకు గురయ్యేలా చేసిన డొనాల్డ్ ట్రంప్ ఈసారి ఏకంగా కెనడా ప్రధానితోనే వెటకారంగా మాట్లాడారు. అమెరికా పర్యటనలో భాగంగా కాబోయే అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో భేటీ అయిన సందర్భంగా ఈ అనూహ్య సంభాషణ చోటుచేసుకుందని సమాచారం.
అమెరికా మీడియా కథనాల ప్రకారం ట్రంప్‌ను ప్రసన్నం చేసుకునే చర్యల్లో భాగంగా కెనడాపై పన్నుల భారం తగ్గించుకునేందుకు ట్రూడో శనివారం రాత్రి ఫ్లోరిడాలోని పామ్‌బీచ్ ప్రాంతంలో ట్రంప్‌కు చెందిన మార్–ఏ–లాగో రిసార్ట్‌లో కలిశారు. మెక్సికో, కెనడా, చైనాలపై అదనపు దిగుమతి సుంకాలు విధిస్తానన్న అంశం, అక్రమ వలసలు, మాదకద్రవ్యాల అక్రమ రవాణా అంశాలు ట్రంప్, ట్రూడో మధ్య ప్రస్తావనకు వచ్చాయి. పన్నులు పెరిగితే తమ దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావాలు తప్పవని ట్రంప్‌కు ట్రూడో స్పష్టంచేశారు. దీనిపై వెంటనే ట్రంప్ స్పందించారు.
‘‘ అమెరికా వాణిజ్య లోటు 100 బిలియన్ డాలర్లకు చేరువవుతోంది. ఇలాంటి కష్టకాలంలో మేం పన్నులు పెంచక తప్పదు. కెనడా నుంచి అమెరికాలోకి అక్రమ వలసలను అరికట్టండి. మాదకద్రవ్యాల అక్రమ రవాణాను అడ్డుకోండి. ప్రత్యేక దేశంగా ఉంటూ కూడా ఇవన్నీ చేయడం మీ వల్ల కాకపోతే అంతటి భారీ పన్నులను తప్పించుకోవడం కోసమైనా అమెరికాలో 51వ రాష్ట్రంగా చేరిపోండి’’ అని ట్రంప్ వ్యంగ్య వ్యాఖ్యలుచేశారు.
దీంతో ట్రూడో నిశ్చేష్టులయ్యారని వినికిడి. ట్రంప్‌తో వాగ్వాదానికి దిగలేక ట్రూడో ముఖంపై కృత్రిమ నవ్వును ఒలకబోశారని అక్కడి వారు చెప్పారు. ‘‘ కెనడా అమెరికాలోకి చేరాక రెండు రాష్ట్రాలుగా ముక్కలైతే బెటర్. ఒక ముక్కకు ట్రూడో గవర్నర్‌గా ఉండటం ఇంకా బెటర్. రెండు రాష్ట్రాల్లో ఒకటి లిబరల్ స్టేట్‌గా, మరోటి కన్జర్వేటివ్ స్టేట్‌గా ఉంటే బాగుంటుంది’’ అని ట్రంప్ ముక్తాయించాడు.
Comments
Please login to add a commentAdd a comment