వాషింగ్టన్ డీసీ: క్వీన్ ఎలిజబెత్-2 అంత్యక్రియలకు అంతా సిద్ధం అయ్యింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆదివారమే బ్రిటన్‌కు చేరుకుని రాణి శవపేటిక వద్ద నివాళి అర్పించారు. రాజకుటుంబానికి నివాళులర్పించే క్రమంలో తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారాయన.
క్వీన్ ఎలిజబెత్-2 తన తల్లితో సమానం అంటూ వ్యాఖ్యానించారాయన. అంతా బాగుందా? నేనేమైనా సాయం చేయగలానా? మీకేం కావాలి? అంటూ ఆప్యాయంగా పలకరించేవారని గుర్తు చేసుకున్నారాయన. అంతేకాదు.. మీరేం చేయాలనుకుంటున్నారో చేయండి అంటూ ఒక తల్లిలా వెన్నుతట్టి ముందుకు ప్రొత్సహించేవారని గుర్తుచేసుకున్నారాయన.
బ్రిటన్ నూతన రాజు, క్వీన్ ఎలిజబెత్-2 తనయుడు కింగ్ ఛార్లెస్-3కి ధైర్యం చెప్పిన బైడెన్.. యావత్ బ్రిటన్ ప్రజానీకానికి సంఘీభావం ప్రకటిస్తున్నట్లు తెలిపారు. 70 ఏళ్ల ఆమె పాలనలో ప్రపంచం మొత్తం ఆమె ఔనత్యాన్ని కళ్లారా వీక్షించిందని, ఆమెతో గడిపిన సరదా క్షణాలు మరువలేనివని, ఆ సమయంలో ఆమెను చూస్తే తన తల్లి గుర్తుకు వచ్చారంటూ భావోద్వేగ ప్రకటనను వైట్‌హౌజ్ ద్వారా విడుదల చేయించారు బైడన్.
రాణి అంత్యక్రియల షెడ్యూల్
► సోమవారం ఉదయం ఆరు గంటల వరకు మాత్రమే రాణికి సందర్శకుల నివాళి కొనసాగుతుంది.
► ఆపై.. తుది నివాళుల కోసం దేశాధినేతలు, ప్రముఖుల రాక మొదలవుతుంది.
► 11 గంటలకు రాణి శవపేటికను వెస్ట్‌మినిస్టర్ హాల్ నుంచి అధికార లాంఛనాలతో సమీపంలోని.. వెస్ట్‌మినిస్టర్ అబేకు తరలిస్తారు.
► ప్రార్థనల అనంతరం మధ్యాహ్నం 12.15కు చారిత్రక లండన్ వీధుల గుండా రాణి అంతిమయాత్ర మొదలవుతుంది.
► శవపేటిక విండ్సర్ కోటకు చేరుకుంటుంది.
► అక్కడి సెయింట్ జార్జ్ చాపెల్‌లో గతేడాది మరణించిన భర్త ఫిలిప్ సమాధి పక్కనే రాణి భౌతికకాయాన్ని ఖననం చేస్తారు.
► వెస్ట్‌మినిస్టర్ డీన్ ఆధ్వర్యంలో సాయంత్రానికల్లా కార్యక్రమం పూర్తవుతుంది. అంత్యక్రియలను ప్రత్యక్షప్రసారం చేయనున్నారు.
► 10 వేల మంది పై చిలుకు పోలీసులు, వేలాది మంది సైనిక తదితర సిబ్బందితో లండన్‌లో బందోబస్తు ఏర్పాట్లు కనీవినీ ఎరగనంతటి భారీ స్థాయిలో జరుగుతున్నాయి. జనాన్ని అదుపు చేసేందుకు ఒక్క సెంట్రల్ లండన్లోనే ఏకంగా 36 కిలోమీటర్ల మేరకు బారికేడ్లు ఏర్పాటు చేశారు.
► అంత్యక్రియల సందర్భంగా సోమవారం కనీసం 10 లక్షల మంది లండన్‌కు వస్తారని ఒక అంచనా.
Comments
Please login to add a commentAdd a comment