భార్యాబిడ్డలతో డానియల్ పోర్టర్ (ఫోటో కర్టెసీ: టైమ్స్‌నౌ)
వాషింగ్టన్: మనిషికి మరుపు సహజం. మనిషి జీవితంలో మరుపు అనేది లేకపోతే.. జీవనం చాలా కష్టం అవుతుంది. ఎందుకంటే జీవితం సుఖదుఖాల సమాహారం. మధుర స్మృతులను గుర్తు పెట్టుకోవాలి.. మనసును బాధ పెట్టేవాటిని మరిచి పోవాలి. అవసరం లేనివాటిని మర్చిపోతే ఏం కాదు.. అలా కాకుండా ప్రతి చిన్న విషయాన్ని మర్చిపోతే.. జీవితం ఎలా ఉంటుందో నాని భలే భలే మగాడివోయ్ సినిమా చూస్తే అర్థం అవుతుంది.
ఇప్పుడు ఈ మతి మరుపు ముచ్చట ఎందుకంటే.. నిద్ర లేస్తూనే ఓ వ్యక్తి తన గతం మర్చిపోయాడు. భార్యాబిడ్డలతో సహా తనను కూడా మర్చిపోయాడు. అద్దంలో తనను చూసుకుని ఆశ్చర్యపోయాడు. కాలచక్రం అతడిని తన 16వ ఏట నిలిపింది. దాంతో స్కూల్‌కు వెళ్లేందుకు రెడీ అవ్వసాగాడు. అతడి వింత ప్రవర్తన చూసి కుటుంబ సభ్యులు షాకయ్యారు. ఈ అరుదైన సంఘటన వివరాలు..
అమెరికా టెక్సాస్‌కు చెందిన డానియల్ పోర్టర్(37) హియరింగ్ స్పెషలిస్ట్‌గా పని చేస్తుండేవాడు. ఈ క్రమంలో పోర్టర్ ఓ రోజు నిద్ర నుంచి లేస్తూనే తన గతం మర్చిపోయాడు. తనని తాను 16 ఏళ్ల యువకుడిలా భావించాడు. తన భార్య రుత్, పదేళ్ల కూతురిని కూడా మరిచిపోయాడు. అద్దంలో తనని తాను చూసుకుని ‘‘నేను ఎందుకు ఇంత లావుగా, పెద్దవాడిలాగా ఉన్నాను’’ అని ఆలోచించసాగాడు. ఇంతలో వారి గదిలోకి వచ్చిన భార్యను చూసి బిత్తరపోయాడు.. ఎవరని ప్రశ్నించాడు. పోర్టర్ ప్రవర్తనతో భయపడిన ఆమె.. తాను అతడి భార్యనని.. వారికి కొన్నేళ్ల క్రితమే పెళ్లయ్యిందని గుర్తు చేసింది. కానీ పోర్టర్ ఒప్పుకోలేదు. తాను ఇంకా స్కూలుకు వెళ్లే పిల్లాడినేనని వాదించాడు.
ఈ సందర్భంగా పోర్టర్ భార్య రుత్ మాట్లాడుతూ.. ‘‘ఉదయాన్నే అతడు నిద్రలేచాడు. నేను ఎవరో తెలియనట్లు చూశాడు. చాలా గందరగోళానికి గురయ్యాడు. మేము ఉన్న గదిని కూడా అతడు గుర్తుపట్టలేదు. బాగా తాగేసి ఆ ఇంటికి వచ్చేడా.. లేక తనను ఎవరో కిడ్నాప్ చేసి మా రూమ్‌లో బంధించారా అని భావించాడు. నా భర్త మా గది నుంచి బయటకు పారిపోయేందుకు ప్రయత్నించడం నేను చూశాను’’ అని ఆమె ఓ వార్త సంస్థకు తెలిపింది.
ఈ సందర్భంగా రూత్ మాట్లాడుతూ.. ‘‘ఆ తర్వాత పోర్టర్‌కి.. నేను తన భార్యను అనే చెప్పే ప్రయత్నం చేశాను. అయితే, అతడు ఇంకా 90వ దశకంలో ఉన్నట్లు భావించాడు. అద్దంలో చూసుకుని ఆగ్రహానికి గురయ్యాడు. నేను ఎందుకు ఇంత లావుగా, పెద్దవాడిలాగా ఉన్నానని అరిచాడు. అతడు హియరింగ్ స్పెషలిస్ట్. అయితే, ఆ రోజు తన ఉద్యోగం, చదివిన చదువు.. అన్నీ మరిచిపోయాడు. దీంతో అతడిని హాస్పిటల్‌కు తీసుకెళ్లాం’’ అని తెలిపింది.
పోర్టర్‌ని పరీక్షించిన వైద్యులు.. అతడు ట్రాన్సియెంట్ గ్లోబల్ అమ్నీసియాతో బాధపడుతున్నట్లు తెలిపారు. దీన్నే ‘షార్ట్ టెర్మ్ మెమరీలాస్’ అని కూడా అంటారన్నారు. 24 గంటల్లో సర్దుకుంటుందని తెలిపారు. అయితే, ఈ సమస్య వల్ల డానియల్ సుమారు 20 ఏళ్ల గతాన్ని మరిచిపోయాడు. దాంతో భార్య అతడు బాల్యంలో నివసించిన ఊరికి తీసుకెళ్లింది. అతడిని పాత స్నేహితులతో కలిపింది. చిత్రం ఏమిటంటే మెమరీ లాస్ తర్వాత అతడి ఆహారపు అలవాట్లు కూడా మారిపోయాయి. ఇదంతా జరిగి ఆరు నెలలు అవుతోంది. ఇప్పుడిప్పుడే అతడికి అన్నీ నెమ్మదిగా గుర్తుకొస్తున్నాయి. ప్రస్తుతం పోర్టర్ థెరపీకి వెళ్తున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment