
కాలిఫోర్నియా: మహమ్మారి కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఆన్‌లైన్ సమావేశాలకు మరింత ప్రాధాన్యం పెరిగింది. విద్యార్థులు ఇంట్లోనే ఉండి ఆన్‌లైన్‌లో పాఠాలు నేర్చుకుంటుండగా, వర్క్ ఫ్రం హోం చేస్తున్న ఉద్యోగులు ఎప్పటికప్పుడు కొలీగ్స్‌తో వర్చువల్ మీటింగ్‌లు జరుపుతున్నారు. అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన చార్లెట్ కొజినెట్ అనే మహిళా ఉద్యోగి కూడా తమ సీఈవోతో ఇలాగే భేటీ అయ్యారు. అయితే, అప్పుడు జరిగిన అనుకోని సంఘటనతో సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. చార్లెట్ ఓ ఫర్నీచర్ కంపెనీలో సేల్స్ అసోసియేట్‌గా పనిచేస్తున్నారు.
ఈ క్రమంలో మూడు రోజుల క్రితం తమ సీఈఓ నిర్వహించిన ఆన్‌లైన్ మీటింగ్‌లో పాల్గొన్నారు. సహోద్యోగులంతా సీరియస్‌గా చర్చిస్తున్న సమయంలో చార్లెట్ కూర్చున్న కుర్చీ ఒక్కసారిగా విరిగిపోయింది. దీంతో ఆమె ఢమాలున కిందపడింది. అయితే, వెంటనే తేరుకున్న ఆమె.. లైవ్ విషయం గుర్తుకొచ్చి.. ఇదంతా రికార్డు అయ్యిందా ఏంటి అంటూ సరదాగా సహోద్యోగులను అడుగుతూ గంభీర వాతావరణాన్ని తేలిక చేసేందుకు ప్రయత్నించారు.
వారు సైతం చార్లెట్‌కు దెబ్బలేమీ తగలలేదని తెలిసి.. చిరునవ్వులు చిందిస్తూ జాగ్రత్తగా ఉండాలంటూ ఆమెకు సూచించారు. ఈ క్రమంలో లైవ్ రికార్డింగ్ ఆపేసి... మరో కుర్చీ తెచ్చుకుని భేటీని కొనసాగించారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఇన్‌స్టాలో షేర్ చేసిన చార్లెట్.. ‘‘సీఈవోతో కాల్‌లో ఉన్న సమయంలో నా కుర్చీ ఇలా విరిగిపోయింది. చూసి ఎంజాయ్ చేయండి’’ అంటూ సరదా క్యాప్షన్ జతచేశారు. ఇందుకు స్పందనగా.. ‘‘వాళ్లు చెల్లించే జీతం సరిపోవడం లేదని ఈ విధంగా నిరసన తెలియజేశావా? ఏదేమైనా ఫన్నీ వీడియో షేర్ చేసినందుకు థాంక్స్’’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment