1,976కి పైగా ప్రతినిధుల నుంచి ఆమోదం
అధికారిక ప్రకటనే తరువాయి
ప్రచార బృందంతో భేటీ అయిన హారిస్
వాషింగ్టన్: డెమొక్రాట్ల అధ్యక్ష అభ్యర్థిగా అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ పేరు దాదాపు ఖరారైంది. అధ్యక్ష అభ్యర్థికి కావాల్సిన 1,976 కంటే ఎక్కువ మంది ప్రతినిధులు ఆమెకు మద్దతు తెలిపారు. అధ్యక్ష అభ్యర్థిగా కమలా హారిస్ పేరు అనధికారికంగా ఖరారు కావడంతో ఇప్పుడు ఉపాధ్యక్షుడిగా ఆమె ఎవరిని ఎన్నుకుంటారనేది ప్రశ్నార్థకంగా మారింది. డెలావెర్‌లోని ప్రచార ప్రధాన కార్యాలయాన్ని హారిస్ సోమవారం సందర్శించారు.
అధ్యక్షుడు జో బైడెన్ ప్రతిపాదించిన అనంతరం హారిస్ మొదటిసారి రోజంతా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. బైడెన్ ప్రచారం బృందంతో ఆమె సమావేశమయ్యారు. అదే బృందంతో కలిసి పనిచేయనున్నట్లు స్పష్టం చేశారు. ఎన్నికలకు ఇంకా 106 రోజులే ఉన్నాయని, గెలుపు కోసం నిర్విరామంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా.. తన రిపబ్లికన్ ప్రత్యర్థి డోనాల్డ్ ట్రంప్‌పై హారిస్ విరుచుకుపడ్డారు.
ఆయన కుంభకోణాలను గుర్తు చేశారు. నేరాలను ఎత్తి చూపారు. మహిళలను వేధించిన మృగం, మోసగాడు, తన స్వార్థ ప్రయోజనాలకోసం నియమా లను ఉల్లంఘించిన వ్యక్తని విమర్శించారు. ‘ట్రంప్ ఏ రకమో నాకు తెలుసు’ అంటూ ఎద్దేవా హారిస్ చేశారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో కలిసి పనిచేయడం తనకు దక్కిన ఒక గొప్ప గౌరవమన్నారు.
ఆయన అమెరికా ప్రజలకోసం నిరంతరం శ్రమించారని కొనియాడారు. ఇక కరోనా బారినపడి ఐసోలేషన్‌లో ఉన్న అధ్యక్షుడు జో బైడెన్ ఫోన్‌లైన్‌లో సమావేశంలో పాల్గొన్నారు. కమలా హారిస్‌ను గెలిపించడానికి పనిచేయాలని డెమొక్రాట్లకు విజ్ఞప్తి చేశారు. తాను కోలుకోగానే ప్రచారంలో పాల్గొంటానని హామీ ఇచ్చారు.
ట్రంప్‌పై విరుచుకుపడిన హారిస్..
ఇక హారిస్‌కు 40 మందికి పైగా డెమొక్రటిక్ సెనేటర్లు, దాదాపు 100 మంది హౌస్ సభ్యుల మద్దతు ఉంది. అత్యంత కీలకమైన మలుపు మాజీ హౌస్ స్పీకర్ నాన్సీ పెలోసీ సైతం హారిస్‌కు మద్దతు పలకడం. అంతేకాదు కాంగ్రెషనల్ బ్లాక్ కాకస్, కాంగ్రెషనల్ హిస్పానిక్ కాకస్, కాంగ్రెషనల్ ప్రోగ్రెసివ్ కాకస్‌తోపాటు సర్వీస్ ఎంప్లాయీస్ ఇంటర్నేషనల్ యూనియన్, అమెరికన్ ఫెడరేష ఆఫ్ టీచర్స్ అనే రెండు కీలక కార్మిక సంఘాలు సైతం ఆమెకు మద్దతు తెలుపుతున్నాయి.
ఉపాధ్యక్ష రేసులో కెంటకీ గవర్నర్ ఆండీ బెషీర్, యుఎస్ ట్రాన్స్‌పోర్టేషన్ సెక్రటరీ పీట్ బుట్టిగీగ్, నార్త్ కరోలినా గవర్నర్ రాయ్ కూపర్, అరిజోనా సెనేటర్ మార్క్ కెల్లీ, పెన్సిల్వేనియా గవర్నర్ జోష్ షాపిరో, ఇల్లినాయిస్ గవర్నర్ జె.బి. ప్రిట్జ్‌కర్, మిచిగాన్ గవర్నర్ గ్రెట్చెన్ విట్మర్ ఉండొచ్చని భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment