చంద్రుడిపై నీటి జాడలు.. ఇదే తొలిసారి! | Water on The Moon: China Says Its Lander Detected | Sakshi
Sakshi News home page

చంద్రుడిపై నీటి జాడలు.. ఇదే తొలిసారి!

Published Mon, Jan 10 2022 8:36 PM | Last Updated on Mon, Jan 10 2022 8:39 PM

Water on The Moon: China Says Its Lander Detected - Sakshi

బీజింగ్‌: చైనాకు చెందిన ఛంగి5 లూనార్‌ లాండర్‌ చంద్రుడిపై నీటి జాడలను కనిపెట్టింది. గతంలో పలు పరోక్ష అధ్యయనాలు చంద్రుడిపై నీరున్నట్లు గుర్తించినా, ఆన్‌సైట్‌లో ప్రత్యక్షంగా నీటి జాడను గుర్తించడం ఇదే తొలిసారి. ఈ అధ్యయన వివరాలు జర్నల్‌ సైన్స్‌లో ప్రచురితమయ్యాయి. లాండర్‌ దిగిన ప్రదేశంలోని మట్టిలో 120 పీపీఎం (పార్ట్స్‌ పర్‌ మిలియన్‌) నీరు( అంటే ఒక టన్ను మట్టిలో 120 గ్రాముల నీరు) ఉన్నట్లు, ఒక రాతిలో 180 పీపీఎం నీరు ఉన్నట్లు  అధ్యయనం వెల్లడించింది.

భూమిపై మట్టితో పోలిస్తే ఈ నీటి జాడలు చాలా స్వల్పం. సౌర గాలులు (సోలార్‌ విండ్స్‌) కారణంగా చంద్రుడి ఉపరితలంపైకి హైడ్రోజన్‌ అణువులు చేరుతుంటాయని, ఇలా వచ్చిన హైడ్రోజన్‌ చంద్రుడినిపై స్వల్ప స్థాయిలో ఉన్న ఆక్సీజన్‌తో కలిసి నీటిని ఏర్పరుస్తుందని చైనీస్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌ తెలిపింది. ఇలా ఏర్పడిన నీరు ఉపరితల మట్టిలో ఉందని, రాతిలో అధికంగా కనిపించిన తేమ శాతం చంద్రుడి అంతర్భాగంలో చర్యల వల్ల ఏర్పడిఉండొచ్చని వివరించింది. (చదవండి: వరల్డ్‌ స్ట్రాంగెస్ట్‌ గర్ల్‌: దెబ్బ పడితే ఖతమే!)

ఒకప్పుడు చంద్రుడి ఆవరణ(మాంటిల్‌ రిజర్వాయిర్లు) నుంచి వాయువులు వెడలిపోవడం (డీగ్యాసింగ్‌) వల్ల చంద్రావరణం కాలక్రమంలో ఇలా పొడిగా మారిఉండొచ్చని తెలిపింది. తాజా పరిశోధనలు ఛంగి 6, 7 మిషన్లలో ఉపయోగపడతాయని నిపుణులు భావిస్తున్నారు. వచ్చే దశాబ్దంలో మానవ సహిత లూనార్‌ స్టేషన్లు నిర్మించాలని ప్రణాళికలు సిద్ధమవుతున్న వేళ ఈ నీటి నిల్వల వివరాలు బయటపడడం ఉపయుక్తంగా ఉంటుందన్నారు.  (నాడు కలిచివేసిన ఫొటో.. నేడు ‘కన్నీటి’ సుఖాంతం)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement