బంగ్లాదేశ్‌లో తాత్కాలిక ప్రభుత్వం.. ప్రధానిగా ముహమ్మద్ యూనస్! | Who Is Nobel Laureate Muhammad Yunus, Chosen As Chief Advisor Of Interim Bangladesh Government | Sakshi
Sakshi News home page

బంగ్లాదేశ్‌లో తాత్కాలిక ప్రభుత్వం.. ప్రధానిగా ముహమ్మద్ యూనస్!

Published Tue, Aug 6 2024 9:00 AM | Last Updated on Tue, Aug 6 2024 9:49 AM

Who Is Nobel Laureate Muhammad Yunus, Chosen As Chief Advisor Of Interim Bangladesh Government

ఢాకా : బంగ్లాదేశ్‌లో అత్యంత నాటకీయ పరిణామాల నడుమ 15  ఏళ్ల పాటు ప్రధానిగా దేశాన్ని ఏలిన షేక్‌ హసీనా తన పదవికి రాజీనామా చేశారు. అనంతరం 40  నిమిషాల వ్యవధిలో బంగ్లాదేశ్‌ నుంచి సైనికుల సహాయంతో భారత్‌కు వచ్చారు. అయితే ఈ సంక్షోభంతో బంగ్లాదేశ్‌ ప్రభుత్వాన్ని నడిపించేది ఎవరన్నది ప్రశ్నార్ధకంగా మారింది. 

ఈ తరుణంలో నోబెల్ గ్రహీత ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని మధ్యంతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ విద్యార్థి ఉద్యమ సమన్వయకర్తలు ప్రతిపాదించారు.

సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోలో, విద్యార్ధుల ఉద్యమానికి కీలకంగా వ్యవహరించిన సమన్వయకర్త నహిద్ ఇస్లాం, దేశంలోని ప్రస్తుత పరిస్థితులను బట్టి ఈ పదవిని చేపట్టడానికి అంగీకరించిన యూనస్‌తో ఇప్పటికే  చర్చించినట్లు ప్రకటించారు.

 మరోవైపు నిరసనకారుల ఆందోళనలతో అట్టుడికిపోయిన బంగ్లాదేశ్‌ను గాడిన పెట్టేందుకు ఆ దేశ రాష్ట్రపతి మహ్మద్ షహబుద్దీన్ రంగంలోకి దిగారు.ప్రతి పక్ష పార్టీలతో ఏర్పాటు చేసిన సమావేశంలో బంగ్లాదేశ్‌ నేషనలిస్ట్‌ పార్టీ (బీఎన్‌పీ) చీఫ్‌ ఖలేదా జియాను విడుదల చేసేలా ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

అధికారులు ఉదయం 6 గంటలకు కర్ఫ్యూను ఎత్తివేసిన తర్వాత మంగళవారం వ్యాపారాలు తిరిగి తెరవాలని, సాధ్యమైనంత త్వరగా ఎన్నికలు జరుగుతాయని ఆయన పేర్కొన్నారు. అంతకుముందు, ఆర్మీ చీఫ్, వాకర్ ఉజ్-జమాన్ ఈ ఎన్నికల ముందే షహబుద్దీన్‌తో సంప్రదించి కొత్త మధ్యంతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఇదే అంశంపై  మంగళవారం సాయంత్రానికి  స్పష్టత రానుంది. ప్రతి మరణానికి న్యాయం జరుగుతుందని, సైన్యంపై విశ్వాసం ఉంచాలని ఆయన విజ్ఞప్తి చేశారు.  

బంగ్లాదేశ్‌లో మధ్యంతర ప్రభుత్వ ఏర్పాటును స్వాగతించిన అమెరికా  
ప్రధాన మంత్రి షేక్ హసీనా రాజీనామా, ఆ తర్వాత దేశం నుంచి నిష్క్రమణపై యుఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్ ప్రతినిధి మాథ్యూ మిల్లెర్ స్పందించారు. బంగ్లాదేశ్‌లోని పరిస్థితుల్ని నిశితంగా పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆ దేశ ప్రజలకు అమెరికా అండగా నిలుస్తోందని హామీ ఇచ్చారు. ఘర్షణల్లో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారని,ఆందోళనలను విరమించుకోవాలని కోరారు.  బంగ్లాదేశ్‌ ప్రజలు సంయమనంతో ఉండాలని పిలుపునిచ్చారు  తాత్కాలిక ప్రభుత్వ ప్రకటనను స్వాగతించారు.

 

బంగ్లాదేశ్‌కు శ్రీలంక మద్దతు 
బంగ్లాదేశ్‌లో రాజకీయ సంక్షోభంపై శ్రీలంక విదేశాంగ మంత్రి అలీ సబ్రీ స్పందించారు. కష్టకాలంలో ఉన్న బంగ్లాదేశ్‌కు శ్రీలంక అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. బాధిత కుటుంబాలకు సానుభూతి తెలిపారు. శ్రీలంక, బంగ్లాదేశ్‌ల మధ్య బలమైన స్నేహం ఉందని అన్నారు.  

సురక్షితంగా భారత్‌ సరిహద్దు ప్రాంతాలు  
ప్రధాన మంత్రి షేక్ హసీనా రాజీనామా తరువాత బంగ్లాదేశ్‌లో కొనసాగుతున్న సంక్షోభం మధ్య, బంగ్లాదేశ్-పశ్చిమ బెంగాల్ సరిహద్దులు సురక్షితంగా ఉన్నాయని పశ్చిమ బెంగాల్ గవర్నర్ సివి ఆనంద బోస్ సోమవారం హామీ ఇచ్చారు, ప్రజలు భయాందోళన చెందవద్దని కోరారు.

బంగ్లాదేశ్ నుండి అనధికార ప్రవేశాన్ని నిరోధించడానికి దేశం సమర్థవంతమైన చర్యలు తీసుకుంటుందని గవర్నర్ ఉద్ఘాటించారు. సరిహద్దులు సురక్షితంగా ఉన్నాయి. భయాందోళనలు అవసరం లేదు. పుకార్ల నమ్మొద్దని, అలాంటి వాటి పట్ల జాగ్రత్తగా ఉండాలని పేర్కొన్నారు.

రెచ్చగొట్టే వీడియోలు షేర్‌ చేయొద్దు.. పశ్చిమ బెంగాల్‌ పోలీసుల హెచ్చరిక
పొరుగున ఉన్న బంగ్లాదేశ్‌లో ప్రస్తుత పరిస్థితులపై రాష్ట్రంలో రెచ్చగొట్టేలా వ్యవహరించడం, సంబంధిత వీడియోలు షేర్‌ చేస్తే ఉపేక్షించేది లేదని పశ్చిమ బెంగాల్‌ రాష్ట్ర పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. వదంతులను ఉపేక్షించవద్దని, రెచ్చగొట్టే వీడియోలను షేర్ చేయడం మానుకోవాలని, ఫేక్ న్యూస్ ట్రాప్‌లో పడకుండా ఉండాలని ప్రజలకు సూచించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement