వాషింగ్టన్ : కాలిఫోర్నియాను కార్చిచ్చు దహించివేస్తోంది. మంటలను అదుపులోకి తెచ్చేందుకు అగ్ని మాపకదళాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. మంటల కారణంగా ఆరెగాన్ పరిసర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో విద్యుత్ అధికారులు ప్రజలకు ఓ విజ్ఞప్తి చేస్తున్నారు. విద్యుత్ కోతలను అధిగమించటానికి వీలైనంత తక్కువగా విద్యుత్‌ను వినియోగించుకోవాలని కోరారు. ఇందుకోసం ఐదు గంటల ‘ప్లెక్స్ అలర్ట్’ను ప్రకటించారు. ఈ అలర్ట్ సాయంత్రం 4 గంటలనుంచి ప్రారంభమవుతుంది.
కాగా, ఉత్తర కాలిఫోర్నియాలో కార్చిచ్చు అలజడి రేపుతోంది. శనివారం మొహావే కౌంటీలో అగ్ని తీవ్రతపై సర్వే నిర్వహిస్తున్న చిన్న విమానం పేలిపోయింది. అందులో ప్రయాణిస్తున్న ఇద్దరు మృత్యువాతపడ్డారు. చనిపోయినవారిని ఎయిర్ టాక్టికల్ గ్రూప్ సూపర్‌వైజర్ జెఫ్ పిచుర్రా, మాజీ టక్‌సన్ ఏరియా ఫైర్ చీఫ్ మాథ్యూ మిల్లర్‌లుగా గుర్తించారు.
ఈ కార్చిచ్చు ఆదివారం నాటికి 83,256 ఎకరాల విస్తీర్ణంలో వ్యాపించింది. దాదాపు 20 ఇళ్లను నాశనం చేసింది. కార్చిచ్చు కారణంగా కాలిఫోర్నియాలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తారాస్థాయికి చేరాయి. శనివారం మొజావే డెసెర్ట్‌లో 53 డిగ్రీల సెల్సియస్(127 ఫారెన్‌హీట్) ఉష్ణోగ్రతలు నమోదవ్వగా.. ఫర్నెస్ క్రీక్ డెసెర్ట్‌లో ఏకంగా 57 డిగ్రీల సెల్సియస్(135ఫారెన్‌హీట్) ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 1913 తర్వాత ఇంత పెద్ద మొత్తంలో ఉష్టోగ్రతలు నమోదు కావటం ఇదే ప్రథమం.
Comments
Please login to add a commentAdd a comment