సాక్షి ప్రతినిధి, కరీంనగర్: రజతోత్సవ వేడుకల వేళ పార్టీని మరింత బలోపేతం చేస్తామని, కార్యకర్తలకు జిల్లా కార్యాలయాల్లో శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేస్తామని బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారకరామారావు అన్నారు. ఆదివారం కరీంనగర్‌లోని వీ కన్వెన్షన్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన ఉమ్మడి జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్‌ను సీఎం చేయడమే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. బీఆర్‌ఎస్ హయాంలో వివిధ వర్గాలకు జరిగిన అభివృద్ధిని అంకెలతో సహా వివరించేలా కార్యకర్తలు తయారవాలన్నారు. ఇందుకోసం పార్టీ అధిష్టానం నుంచి పరిశీలకులు, సమన్వయకర్తలు వస్తారని వెల్లడించారు. కేసీఆర్‌కు కరీంనగర్ అంటే ప్రత్యేకమైన అభిమానమని, సింహగర్జన నుంచి రైతుబంధు, దళితబంధు వరకు అనేక కార్యక్రమాలు ఇక్కడే మొదలుపెట్టారని గుర్తుచేశారు. గత ఎన్నికల్లో 13 స్థానాల్లో కేవలం ఐదుమాత్రమే గెలిచామని, అందులో జగిత్యాల ఎమ్మెల్యే కాంగ్రెస్‌లోకి వెళ్లారన్నారు. ఈసారి వచ్చే ఎన్నికల్లో 13 అసెంబ్లీ స్థానాలు మనమే గెలవాలని పిలుపునిచ్చారు.
చెక్‌పోస్టులు పెట్టి మరీ: గంగుల
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక చెక్‌పోస్టులు పెట్టి మరీ ప్రజల్ని పీల్చి పిప్పి చేస్తున్నారని మాజీమంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. బీఆర్‌ఎస్ హయాంలో మానేరు రివర్ ఫ్రంట్, తీగల బ్రిడ్జి వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు మొదలుపెడితే.. వాటిని ఖతం చేశారని, ఇదేంటని కాంట్రాక్టర్‌ను అడిగితే.. కాంగ్రెస్ హయాంలో అనేక మంది లీడర్లు ఇబ్బందులు పెడుతున్నారని వాపోయాడని చెప్పారు. అమాయక ప్రజలను చెక్‌పోస్టులు పెట్టి పీల్చిపిప్పి చేస్తున్నారని కట్టెలమోపు కథ ద్వారా వివరించారు.
ఉద్యమ వ్యతిరేకి చేతిలో..
ఆరు గ్యారంటీలు అమలు చేయకుండా పదేళ్లు రాష్ట్రాన్ని వెనక్కి తీసుకుపోయారని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. తెలంగాణ ప్రజలు ఎవరి పాలనలో అయితే సుఖశాంతులతో ఉంటారో దాని కోసం పోరాడాల్సిన సమయం వచ్చిందన్నారు. ‘ఎన్నో పోరాటాలు, త్యాగాలతో రాష్ట్రం సాధించుకున్నాం. ఉద్యమానికి వ్యతిరేకంగా కరీంనగర్ ప్రజల మీదకు తుపాకీ పట్టుకుని వచ్చిన వాడి చేతిలో రాష్ట్రం ఉంది. ఈ చెర నుంచి విడిపించాల్సిన బాధ్యత మనపై ఉంది’ అని పిలుపునిచ్చారు.
ఒక తరాన్ని పరిచయం చేశారు
బీఆర్‌ఎస్ పార్టీకి 25 ఏళ్లు నిండుతున్న సందర్భంగా వరంగల్‌లో గొప్ప సభ ఏర్పాటు చేయనున్నట్లు మాజీ ఎంపీ బి.వినోద్‌కుమార్ పేర్కొన్నారు. పార్టీకి ఎప్పుడు ఇబ్బందులు వచ్చినా ఆదుకునేది ఉమ్మడి వరంగల్, కరీంనగర్లే. కేసీఆర్‌ను శత్రువులు ఇబ్బందులు పెడితే, ఇక్కడికి వచ్చి గాలిపీలిస్తే ఆయనకు ఉత్తేజం వస్తదని తెలిపారు. ‘ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెడితే అందులో కేసీఆర్ లీడర్‌గా ఎదిగారు. బీఆర్‌ఎస్ పార్టీ పెట్టినప్పుడు హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి, నేను పోటీ చేశాం. పిల్లగాళ్లు అని కాంగ్రెస్ వాళ్లు ఎగతాళి చేసినా గెలిచి చూపించాం. అలా కేసీఆర్ కొత్త తరాన్ని రాజకీయాలకు పరిచయం చేశారు. 33 శాతం రిజర్వేషన్లను ఆధారంగా చేసుకుని మహిళలు నాయకులుగా ఎదగాలని పిలుపునిచ్చారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, ఎమ్మెల్యేలు పాడి కౌశిక్, కల్వకుంట్ల సంజయ్, ఎమ్మెల్సీ ఎల్.రమణ, మాజీ ఎమ్మెల్యేలు విద్యాసాగర్‌రావు, సుంకె రవిశంకర్, రసమయి బాలకిషన్, కోరుకంటి చందర్, మనోహర్‌రెడ్డి, పుట్ట మధు, బాల్క సుమన్, నాయకులు రాజేశంగౌడ్, చల్మెడ లక్ష్మీనరసింహరావు, నారదాసు లక్ష్మణరావు, తోట ఆగయ్య, కర్ర శ్రీహరి, రాగిడి లక్ష్మారెడ్డి, రవీందర్‌రావు, గెల్లు శ్రీనివాస్‌యాదవ్, దావ వసంత, రాకేశ్, తుల ఉమ, కోలేటి దామోదర్, హరీశ్ శంకర్, పొన్నం అనిల్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
జోష్‌నింపిన బైక్ ర్యాలీ
అంతకుముందు కేటీఆర్‌కు ఘనస్వాగతం పలికిన గులాబీ నాయకులు మంకమ్మతోట సత్యనారాయణ స్వామి ఆలయం నుంచి బైపాస్ రోడ్డులోని వీ కన్వెన్షన్ వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. సమావేశ మందిరం నాయకులతో కిక్కిరిసిపోయింది. కరీంనగర్, జగిత్యాల, సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాల నుంచి భారీగా కార్యకర్తలు, నాయకులు తరలిరావడంతో బైపాస్ రోడ్డుపై ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మొత్తానికి కేటీఆర్ రాకతో బీఆర్‌ఎస్ నాయకుల్లో కొత్త జోష్ నిండింది.
● ఉమ్మడి జిల్లా బీఆర్‌ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో క