● నూతనంగా 65 గ్రామపంచాయతీలు ఏర్పాటు ● ఇప్పటికీ పాత రేషన్ దుకాణాలే దిక్కు ● నూతన గ్రామపంచాయతీలకు భారమవుతున్న రేషన్ సరుకులు
రాయికల్: జిల్లా ఆవిర్భవించి 11 ఏళ్లు గడుస్తున్నా.. జిల్లాలో 65 కొత్త పంచాయతీలు పెరిగినా.. గ్రామాల్లో రేషన్ దుకాణాల సంఖ్య పెరగకపోవడంతో ప్రజలు పాత రేషన్ దుకాణాల నుంచే సరుకులు తీసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. లబ్ధిదారులు రెండు నుంచి మూడు కిలోమీటర్ల దూరం వెళ్లి సరుకులు తెచ్చుకుంటున్నారు. జిల్లాలో 20 మండలాలతోపాటు, జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి, రాయికల్, ధర్మపురి మున్సిపాలిటీలు ఉన్నాయి. వీటి పరిధిలో మొత్తం 592 రేషన్ దుకాణాలు ఉన్నాయి. జిల్లాలో గతంలో 320 పంచాయతీలు ఉండగా.. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించినప్పటి నుంచి నేటి వరకు 65 కొత్తగా ఏర్పడి మొత్తం 385కు చేరాయి. కానీ రేషన్ దుకాణాలు మాత్రం 592 దుకాణాలే ఉన్నాయి.
పెరుగుతున్న దూరభారం
జిల్లాలో నూతనంగా 65 గ్రామపంచాయతీలు ఏర్పడగా.. గతంలో ఉన్న రేషన్ దుకాణాల నుంచే ఆయా గ్రామస్తులు రేషన్ సరుకులు తీసుకెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. పలు మండలాల్లో మారుమూల ప్రాంతాల్లో రేషన్ దుకాణాల వద్దకు రెండు నుంచి మూడు కిలోమీటర్ల దూరం కాలిబాటన వెళ్లి రేషన్ సరుకులు తెచ్చుకోవాల్సి వస్తోందని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కొత్త దుకాణాల్లో సాంకేతిక సమస్య
కొత్తగా ఏర్పాటైన గ్రామ పంచాయతీల్లో రేషన్ దుకాణాల ఏర్పాటులో సాంకేతిక సమస్య ఏర్పడుతుంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం 400 నుంచి 450 రేషన్ కార్డులు ఉంటేనే దుకాణాలు ఏర్పాటు చేయాలి. కానీ నూతనంగా ఏర్పడిన గ్రామపంచాయతీల్లో 200 నుంచి 500 వరకే ఉండటంతో ప్రభుత్వపరంగా సాంకేతిక సమస్య ఏర్పడుతుది. కొత్త దుకాణాలు ఏర్పడితే పాత షాపులో కార్డులు తగ్గుతాయని, అక్కడ, ఇక్కడ వచ్చే ఆదాయం తగ్గుతుందని, దీంతో నూతన రేషన్ దుకాణాలు మంజూరు కావడం లేదనే విమర్శలు సైతం విన్పిస్తున్నాయి. కానీ నూతన గ్రామపంచాయతీల సమస్యలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం స్పందించి వెంటనే రేషన్ దుకాణాలను మంజూరు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.
గ్రామపంచాయతీలు 385
నూతన గ్రామపంంచాయతీ 65
ప్రస్తుతం ఉన్న రేషన్ షాపులు 592
రేషన్‌కార్డుల సంఖ్య 3,07,555
కొత్త రేషన్ దుకాణాలకు మోక్షమెప్పుడో..?


