సాయం చేయబోతే ప్రాణమే పోయింది
స్వాతంత్య్ర ఫలాలు అందరికీ అందేలా ప్రభుత్వం కృషి
● రాష్ట్ర సాంస్కృతిక శాఖ చైర్‌పర్సన్ వెన్నెల
కథలాపూర్: స్వాతంత్య్ర స్వేచ్ఛ ఫలాలు అందరికీ అందేలా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర సాంస్కృతిక శాఖ చైర్‌పర్సన్ వెన్నెల అన్నారు. జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలకేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో శనివారం నిర్వహించిన జైబాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమానికి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌తో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే దేశం అభివృద్ధి చెందిందన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక నియంతృత్వ పోకడలతో పరిపాలన చేస్తోందని మండిపడ్డారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ రాజ్యాంగాన్ని కాపాడుకునే బాధ్యత అందరిపై ఉందన్నారు. ఏఐసీసీ నేత రాహుల్‌గాంధీ దేశంలోని వివక్షను రూపుమాపేందుకు కృషి చేస్తున్నారన్నారు. దేశంలో పేద ప్రజలకు ఉపయోగపడే ప్రతీ పథకాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రారంభం చేసిందన్నారు. నియోజకవర్గాల పునర్విభజన పేరుతో దక్షిణాది రాష్ట్రాల్లో ఎంపీ స్థానాలు తగ్గించేందుకు బీజేపీ కుట్ర చేస్తోందన్నారు. నియోజకవర్గ కో–ఆర్డినేటర్ ఎండీ.ఆవేజ్, పీసీసీ కార్యవర్గసభ్యుడు తొట్ల అంజయ్య, ఏఎంసీ చైర్మన్ పూండ్ర నారాయణరెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కాయితి నాగరాజు, వాకిటి రాజారెడ్డి, వంగ మహేశ్, జవ్వాజి చౌదరి, గడ్డం చిన్నారెడ్డి, కల్లెడ గంగాధర్, వేముల కృష్ణ, కూన అశోక్ పాల్గొన్నారు.
మల్యాల: రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తికి సాయం చేయబోయిన యువకుడు బైక్ ఢీకొని మృతి చెందాడు. మండలంలోని గొర్రెగుండ గ్రామానికి చెందిన వంశీ ధర్‌రావు జగిత్యాలలో కొరియర్‌గా పనిచేస్తున్నాడు. తన మిత్రులతో కలిసి ఒక శుభకార్యంలో పాల్గొని ఇంటికి తిరిగి వెళ్తుండగా శుక్రవారం రాత్రి జగిత్యాల–కరీంనగర్ జాతీయ రహదారిపై మధుర నరేశ్ అనే ద్విచక్ర వాహనదారుడు అదుపుతప్పి కిందపడి, గాయపడ్డాడు. అటుగా వెళ్తున్న వంశీధర్ తన బైక్‌ను రోడ్డు పక్కన నిలిపి, లేవలేని స్థితిలో రోడ్డుపై పడిన నరేశ్‌కు సాయం చేసేందుకు వెళ్లాడు. అదే సమయంలో పల్లెపు రాజేశ్ బైక్‌పై అతివేగంగా వచ్చి ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. వంశీధర్‌ను జగిత్యాల ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. గొర్రెగుండెంలో దహన సంస్కారాలు నిర్వహించారు. వంశీధర్‌కు భార్య జ్యోతి, నాలుగేళ్ల కుమారుడు, రెండేళ్ల కూతురు ఉన్నారు. వంశీధర్ తల్లిదండ్రులు గతంలోనే మృతిచెందారు. సోదరుడు అనిల్ 15 ఏళ్ల క్రితం నూకపల్లిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. నాలుగేళ్ల కుమారుడు తండ్రి చితికి నిప్పటించడం స్థానికులను కంటతడి పెట్టించింది.
సాయం చేయబోతే ప్రాణమే పోయింది


