● 13 నెలలుగా విడుదల కాని నిధులు ● పేరుకుపోతున్న చెత్తాచెదారం ● అత్యవసర పనులకూ ఇబ్బందులే..
జగిత్యాలరూరల్: ప్రత్యేక అధికారుల పాలనలో గ్రామాలు అభివృద్ధికి నోచుకోవడం లేదు. పాలన అస్తవ్యస్తంగా మారింది. ప్రజలకు అత్యవసరమైన పనులు చేపట్టేందుకూ నిధులు లేక గ్రామీణులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లాలో 385 గ్రామపంచాయతీలు ఉన్నాయి. సర్పంచులు పదవిలో ఉన్నప్పుడు జిల్లాకు ఏటా రూ.80 కోట్ల కేంద్ర నిధులు.. దాదాపు రూ.40 కోట్ల రాష్ట్ర నిధులు అభివృద్ధి పనులకు మంజూరయ్యాయి. ప్రత్యేక పాలన ప్రారంభం నుంచి కేంద్రం నిధులు, ఇటు రాష్ట్రప్రభుత్వ నిధులు కూడా పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో గ్రామపంచాయతీల్లో అత్యవసర పనులు చేసేందుకు కూడా నిధులు లేక పరిస్థితి అస్తవ్యస్తంగా మారుతోంది.
13 నెలలుగా నిధులు కరువు
సర్పంచుల పదవీకాలం ముగిసిన నుంచి ఇప్పటివరకు కేంద్ర, రాష్ట్ర నిధులు రాక పంచాయతీలు అభివృద్ధి పనులకు నోచుకోవడం లేదు. ప్రజలకు అత్యవసరమైన మురికికాలువల శుభ్రత, వీధిదీపాలు, తాగునీటి సరఫరా వంటి అత్యవసర పనులకు కూడా నిధులు లేకపోవడంతో గ్రామాల్లో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అత్యవసరమైన తాగునీటి సరఫరాలోని మరమ్మతుకు కూడా డబ్బులు లేక పనులు చేపట్టడం లేదు.
గ్రామాలకు రాని ప్రత్యేకాధికారులు
గ్రామపంచాయతీల్లో పేరుకే ప్రత్యేకాధికారులు. ఏ ఒక్క రోజు కూడా పంచాయతీలకు వచ్చి పాలనపై దృష్టి పెట్టడం లేదు. ఏదైనా అత్యవసర పని ఉంటే పంచాయతీ కార్యదర్శులే తమ జేబుల్లోంచి డబ్బు ఖర్చు పెట్టి మరమ్మతు చేయించాల్సిన పరిస్థితి నెలకొంది. ఆ మరమ్మతు డబ్బులకు కూడా ప్రత్యేకాధికారులు బిల్లులు చెల్లిస్తున్నప్పుడు కార్యదర్శులను ఇబ్బందికి గురిచేస్తుండడం గమనార్హం.
పంచాయతీ కార్యదర్శులకు అప్పుల గండం
గ్రామపంచాయతీ పాలన కార్యదర్శులకు నిత్యం గండంగా మారింది. గ్రామాల భారమంతా కార్యదర్శులపైనే పడుతోంది. పంచాయతీల్లో పారిశుధ్య పనులు, నీటి సరఫరా, ఏ చిన్న సమస్య తలెత్తినా కార్యదర్శి సొంతంగా డబ్బులు పెట్టి పనులు చేయించాల్సిన పరిస్థితి నెలకొంది. ఫలితంగా వారు అప్పులపాలవుతున్నారు. ప్రభుత్వం నుంచి రెండు నెలలుగా స్వచ్ఛదనం, పచ్చదనం కార్మికుల వేతనాలకు నిధులు మంజూరయ్యాయి. ఆ బిల్లులను పంచాయతీ కార్యదర్శులు సమర్పించినా ఇప్పటివరకు విడుదల కాలేదు. మరోవైపు కార్మికులు తమకు వేతనాలు ఇస్తేనే పనులకు వస్తామని, లేకుంటే మానేస్తామని చెబుతున్నారు. దీంతో పంచాయతీ కార్యదర్శులు అప్పు చేసి కార్మికుల వేతనాలు కొంతమేర చెల్లిస్తున్నారు. శానిటేషన్, బ్లీచింగ్, విద్యుత్ బల్బుల ఏర్పాటు, మోటార్ల రిపేర్, పైప్‌లైన్ లీకేజీ వంటి పనులకు పంచాయతీ కార్యదర్శులే అప్పు తెచ్చి పెడుతున్నారు. ప్రభుత్వం నిధులు మంజూరు చేయకపోవడంతోపాటు, మంజూరైన నిధులకు కూడా బిల్లులు పాస్ కాకపోవడంతో కార్యదర్శులంతా ఆందోళన చెందుతున్నారు.
నిధులు రావడం లేదు
ప్రత్యేకాధికారుల పాలన నుంచి జిల్లాలో గ్రామ పంచాయతీ అభివృద్ధి పనులకు నెలనెలా నిధులు రావడం లేదు. గ్రామాల్లో అత్యవసర పనులు చేసేందుకు పంచాయతీల నిధులే వెచ్చించడం జరుగుతుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నెలనెలా నిధులు రావాల్సి ఉంది.
– మదన్‌మోహన్,
జిల్లా ఇన్‌చార్జి పంచాయతీ అధికారి
‘ప్రత్యేక పాలన’లో పంచాయతీలు అస్తవ్యస్తం
‘ప్రత్యేక పాలన’లో పంచాయతీలు అస్తవ్యస్తం


