సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలి
సారంగాపూర్: ప్రభుత్వ ఆస్పత్రుల్లో సాధారణ ప్రసవాలు పెంచాలని, జిల్లా మాతా శిశు సంరక్షణాధికారి డాక్టర్ జయపాల్‌రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన సారంగాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యసిబ్బందితో సమావేశమయ్యారు. బీర్‌పూర్ మండలకేంద్రంలోని ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ పల్లె దవాఖానాను సందర్శించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. గర్భిణులు ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే సాధారణ ప్రసవం చేయించుకునేలా ఏఎన్‌ఎం, ఆశాలు వారి ఇంటికి వెళ్లి అవగాహన కల్పించాలన్నారు. బీర్‌పూర్ పల్లెదవాఖానాను త్వరలో కేంద్ర జాతీయ ప్రమాణాల బృందం పరిశీలించనుందని, ఇందుకు అనుగుణంగా రికార్డులు, సేవలు సక్రమంగా ఉండేలా చూసుకోవాలన్నారు. ఆయన వెంట వైద్యాధికారి డాక్టర్ రాధారెడ్డి, సీహెచ్‌వో కుద్దుస్, సూపర్‌వైజర్లు కిశోర్, తార, ఎంఎల్‌హెచ్‌పీ, ఏఎన్‌ఎం, ఆశాలు తదితరులు పాల్గొన్నారు.


