వ్యవసాయంపై వాతావరణ ప్రభావం
● ఏడాదిలో వివిధ పంటల్లో అనేక సమస్యలు ● సతమతమవుతున్న అన్నదాతలు ● అభిప్రాయపడిన వ్యవసాయ శాస్త్రవేత్తలు ● పొలాసలో ఉత్తర తెలంగాణ జోన్ శాస్త్రవేత్తల సమావేశం
జగిత్యాలఅగ్రికల్చర్: అత్యధిక వర్షాలు, పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, చలి తీవ్రత వంటి వాతావరణ మార్పులు వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని, రైతులు సాగు చేసిన పంటల్లో అనేక సమస్యలు ఏర్పడుతున్నాయని ఉత్తర తెలంగాణ జోనల్ స్థాయి వ్యవసాయ శాస్త్రవేత్తల సదస్సు అభిప్రాయపడింది. జగిత్యాల రూరల్ మండలం పొలాస వ్యవసాయ పరిశోధన స్థానంలో రెండు రోజులపాటు జరుగనున్న ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల వ్యవసాయ శాస్త్రవేత్తల, అభ్యుదయ రైతుల సదస్సు గురువారం ప్రారంభమైంది. ఈ సదస్సుకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ వర్సిటీ డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ ఎన్. బలరాం అధ్యక్షత వహించారు. వ్యవసాయ వర్సిటీ ఉన్నతాధికారులతోపాటు వివిధ జిల్లాల నుంచి వచ్చిన వ్యవసాయ శాస్త్రవేత్తలు, రైతులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు.
సాగులో సమస్యలపై వ్యవసాయ శాస్త్రవేత్తలు
ఉత్తర తెలంగాణలోని పది జిల్లాలో ఈ ఏడాది సాధారణ వర్షపాతం కన్నా 64 శాతం అధికంగా నమోదు కావడంతో వరి, సోయాబీన్, పత్తి, కంది వంటి పంటలకు విఘాతంగా మారింది. ముఖ్యంగా వరిలో పురుగుల, తెగుళ్ల ఉధృతి పెరిగి పంటలపై ఉల్లికోడు, కాండం తొలిచే పురుగు, ఆకుచుట్టు పురుగు, తాటాకు తెగులు ఆశించాయి. మొక్కజొన్న నీట మునగడంతో ఎదుగుదల లోపించి దిగుబడి తగ్గింది. పత్తి తొలి దశలో అధిక వర్షాలతో మొక్క పెరుగుదల లోపించి దిగుబడిపై ప్రభావం చూపింది. యాసంగి వరిలో పొడి వాతావరణం, రాత్రి తక్కువ ఉష్ణోగ్రతలతో కాండం తొలిచే పురుగు ఎక్కువగా ఆశించింది. జనవరిలో రాత్రి తక్కువ ఉష్ణోగ్రతలు నమోదై, చలి పెరగడంతో వరి నారుమడులతోపాటు నువ్వులు, వేరుశనగ, మినుము, నేరుగా విత్తిన వరిపై ప్రభావం చూపిందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. అయినప్పటికీ విపత్కర పరిస్థితుల్లోనూ కొన్ని రకాల విత్తనాలు ఆటుపోట్లను తట్టుకుని మంచి దిగుబడి ఇచ్చాయని పేర్కొన్నారు.
ఏప్రిల్ మొదటి వారంలోనే కోతలు పూర్తి కావాలి
యాసంగి సీజన్‌లో రైతులు ముందుగా వరి నారుమడులు పోసుకోవాలని, ఏప్రిల్ మొదటివారంలోపు వరి కోతలు పూర్తి చేయాలని జిల్లా అడిషనల్ కలెక్టర్ బీఎస్.లత అన్నారు. ఆలస్యంగా కోయడం ద్వారా అధిక ఉష్ణోగ్రతలకు వరి గింజ పగిలి నూక శాతం ఎక్కువ అవుతుందని, ఇందుకు శాస్త్రవేత్తలు, వ్యవసాయాధికారులు సరికొత్త ప్రణాళికలు సిద్ధం చేయాలని కోరారు. నూక శాతం పెరగడంతో ఇతర ప్రాంతాలకు ఎగుమతి కష్టంగా మారుతుందన్నారు. వ్యవసాయ వర్సిటీ డీన్ ఆఫ్ రీసెర్చ్ డాక్టర్ బలరాం మాట్లాడుతూ.. పరిశోధన ప్రగతిని ఎప్పటికప్పుడు రైతులకు అందించేందుకు ప్రయత్నిస్తున్నట్లు వివరించారు. రైతుల ఆదాయం పెంచేందుకు పరిశోధనలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో పరిశోధన స్థానం డైరెక్టర్ శ్రీలత తాము చేస్తున్న పరిశోధనల గురించి వివరించారు. పరిశోధన విస్తరణకు సంబంధించిన విషయాలపై శాస్త్రవేత్తలు రాంప్రసాద్, శివకృష్ణ వివరించారు. రైతులు తాము ఎదుర్కొంటున్న పలు సమస్యలను శాస్త్రవేత్తల దృష్టికి తీసుకొచ్చారు.
వ్యవసాయంపై వాతావరణ ప్రభావం


