ఎల్‌ఆర్‌ఎస్ అంతంతే..!
మున్సిపాలిటీల్లో కొరవడిన స్పందన
● ఫీజు కట్టడానికి ముందుకు రాని దరఖాస్తుదారులు ● రాయితీ ప్రకటించినా నామమాత్రంగానే.. ● ఈనెల 30 వరకు మరోమారు గడువు పొడిగించిన ప్రభుత్వం
మెట్‌పల్లి: అక్రమ ప్లాట్లు, లేఅవుట్ల క్రమబద్ధీకరణ కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న ఎల్‌ఆర్‌ఎస్ పథకానికి జిల్లాలోని మున్సిపాలిటీల్లో స్పందన కొరవడింది. గత నెల 31లోపు దరఖాస్తుదారులు ఫీజు చెల్లిస్తే 25శాతం రాయితీ కల్పిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయినప్పటికీ అశించిన స్థాయిలో దరఖాస్తుదారులు ముందుకు రాలేదు. క్రమబద్ధీకరణ కోసం ఐదేళ్ల క్రితం దరఖాస్తులు చేసుకోగా, అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం వీటిని పరిష్కరించడంలో జాప్యం ప్రదర్శిస్తూ వచ్చింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్‌ఆర్‌ఎస్‌పై దృష్టి సారించి దరఖాస్తులు పరిష్కరించాలని నిర్ణయించింది. పెద్ద మొత్తంలో ఆదాయం వచ్చే అవకాశం ఉండడంతో ఫీజు చెల్లించే వారికి రాయితీని కూడా కల్పించింది. కానీ దరఖాస్తుదారుల నుంచి స్పందన నామమాత్రంగా ఉండడంతో గడువును మరోమారు పొడిగించింది.
వేల సంఖ్యలో దరఖాస్తులు
● జిల్లాలో జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి, ధర్మపురి, రాయికల్ మున్సిపాలిటీలు ఉన్నాయి.
● వీటిల్లో లేఅవుట్ నిబంధనలు పాటించకుండానే ప్లాట్ల విక్రయాలు సాగాయి.
● అయితే వీటిని ఎల్‌ఆర్‌ఎస్ కింద క్రమబద్ధీకరించడం కోసం 2020లో అప్పటి ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరించింది.
● ఆ సమయంలో ఒక్కొక్కరి నుంచి దరఖాస్తు ఫీజు కింద రూ.వెయ్యి వసూలు చేశారు.
● ఆ తర్వాత ఐదేళ్లుగా వీటిని పరిష్కరించకుండా పెండింగ్‌లోనే పెట్టారు.
● ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం గత నెలలో క్రమబద్ధీకరణకు శ్రీకారం చుట్టింది.
నామమాత్రంగానే పరిష్కారం
ప్రభుత్వం దరఖాస్తుదారులను ఆకట్టుకోవడానికి 25శాతం రాయితీ అవకాశాన్ని కల్పించినా అశించిన స్థాయిలో దరఖాస్తుదారుల నుంచి స్పందన రాలేదు. ప్రధాన మున్సిపాలిటీలైనా జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లిల్లో 24,568 దరఖాస్తులుంటే.. వీటిలో ఇప్పటి వరకు ఫీజులు చెల్లించిన వారు మూడు వేలకు మించకపోవడం గమనార్హం. ప్రతీ మున్సిపాలిటీలో అధికారులు ఎల్‌ఆర్‌ఎస్‌పై క్షేత్ర స్థాయిలో ప్రచారం చేయడం లేదనే విమర్శలు ఉన్నాయి. దీనివల్ల అవగాహన లేక దరఖాస్తుదారులు ముందుకు రావడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు పట్టణాల్లో ప్లాట్ల క్రయ విక్రయాల వ్యాపారం మందగించింది. దీంతో ఫీజులు కట్టడం భారంగా మారడం కూడా కారణమనే వాదనలు వినిపిస్తున్నాయి.


