తాగునీరు సురక్షితమేనా..?
చర్యలు తీసుకుంటున్నాం
ప్రతీ 15 రోజులకోసారి ఖచ్చితంగా వాటర్‌ట్యాంక్‌లను శుభ్రం చేయాలి. ఆ విధంగా చర్యలు తీసుకుంటున్నాం. దీంతో పాటు ప్రతీ ట్యాంక్ వద్ద బోర్డులను ఏర్పాటు చేసి, లీకేజీలను అరికట్టేలా చూడాలని అధికారులను ఆదేశించాం.
– స్పందన,
మున్సిపల్ కమిషనర్, జగిత్యాల
● పరిశుభ్రతకు నోచుకోని వాటర్ ట్యాంకులు
● కలుషితమవుతున్న నీరు
● పట్టించుకోని మున్సిపల్ అధికారులు
జగిత్యాల: వేసవి కాలం అయినప్పటికీ చిన్నపాటి వర్షాలు కురియడంతో పారిశుధ్యం అంతా అస్తవ్యస్తంగా మారుతోంది. కలుషిత నీటితోనే వైరల్ ఫీవర్స్ వచ్చే అవకాశాలున్నాయి. ఈ సమయంలో ట్యాంక్‌లు శుభ్రం చేయాల్సిన మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. అలాగే జిల్లా కేంద్రంలో అనేక లీకేజీలు ఉన్నాయి. పైపులు సైతం పాకురుతో నిండిపోయాయి. కొన్ని అయితే చెట్ల పొదల మధ్యలోనే ఉన్నాయి. నిబంధనల ప్రకారం 15 రోజులకోసారి శుభ్రం చేయాల్సిన వాటర్ ట్యాంక్‌లను నెలలు గడుస్తున్నా శుభ్రం చేయడం లేదనే ఆరోపణలున్నాయి. ఇప్పటికై నా అధికారులు స్పందించి వాటర్ ట్యాంక్‌లను శుభ్రం చేయడంతో పాటు లీకేజీలను అరికట్టాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది.
కలుషిత నీటితో వ్యాధులు
ప్రతీరోజు మానవునికి నీరు ఎంతో అవసరం. ప్రతీ మున్సిపాలిటీలో ఫిల్టర్‌బెడ్ నుంచి ప్రధానంగా పట్టణాల్లో కొన్ని ఏరియాలకు ఒక ట్యాంక్ చొప్పున నిర్మించారు. అక్కడి నుంచి వివిధ కాలనీలకు మంచినీటి సరఫరా జరుగుతుంది. కానీ శుభ్రత విషయంలో మాత్రం అధికారులు పట్టించుకోవడం లేదు. మున్సిపాలిటీల్లో ఉదయం లేవగానే నీరు పట్టుకుంటారు. జిల్లా కేంద్రంలో కొన్ని కాలనీల్లో అయితే రంగుమారిన నీరే వస్తున్నాయి. పూర్తి బురదమయంగా, పసుపు రంగులో రావడంతో వాటిని తాగేందుకు ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. లీకేజీలతో పాటు, ట్యాంకులు శుభ్రం చేయకపోవడంతో ప్రజలకు ఇబ్బందికరంగా మారింది. జిల్లాలోని జగిత్యాలతో పాటు, కోరుట్ల, మెట్‌పల్లి, రాయికల్, ధర్మపురి మున్సిపాలిటిల్లో సైతం ఇదే పరిస్థితి నెలకొంది.
శుభ్రత ఎక్కడ?
ప్రతీ వాటర్ ట్యాంక్‌ను ఖచ్చితంగా 15 రోజులకోసారి పూర్తిగా శుభ్రం చేసి ప్రజలకు నీరందించాల్సి ఉంటుంది. దీంతో పాటు అక్కడ ఏరోజు శుభ్రం చేశాం, మళ్లీ ఏ రోజు చేయాలి అన్న తేదీల బోర్డు సైతం వాటర్ ట్యాంక్‌ల వద్ద ఏర్పాటు చేయాలి. కొన్ని చోట్ల నెల రోజుల క్రితం కడిగిన తేదీలే ఉన్నాయి. జగిత్యాల కొత్తబస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన బోర్డులో లోలెవల్, హైలెవల్ కడిగిన తేదీ 27.02.2025 ఉండగా, మళ్లీ కడగాల్సిన తేదీ 27.03.2025 అని ఉంది. జగిత్యాల జిల్లాలో జగిత్యాల, మెట్‌పల్లి, కోరుట్ల, ధర్మపురి, రాయికల్ ఐదు మున్సిపాలిటీలు ఉండగా, ఎక్కడ కూడా నిబంధనలు పాటించడం లేదు. దీంతో ప్రజలకు కలుషిత నీరే దిక్కవుతుంది. ఈ విషయంపై కొందరు మున్సిపల్ అధికారులను ట్యాంక్‌లను ఎందుకు శుభ్రం చేయడం లేదని అడుగగా ట్యాంక్‌లను ఇటీవలే శుభ్రం చేయడం జరిగిందని, అక్కడ తేదీలు వేయడం మరిచిపోయామని చెప్పడం కొసమెరుపు.
లీకేజీలే అధికమే..
ఒకవైపు ట్యాంక్‌లు శుభ్రంగా లేకపోవడంతో పాటు ఇటీవల మిషన్ భగీరథ పైప్‌లైన్‌లో భాగంగా అనేక చోట్ల మంచినీటి పైప్‌లైన్ పగిలిపోవడంతో నీరంతా కలుషితమవుతుంది. అధికారులు ట్యాంక్‌లు శుభ్రం చేయకపోవడం, అటు పైప్‌లైన్ లీకేజీలను అరికట్టకపోవడంతో ఫలితంగా ప్రజలకు అపరిశుభ్రమైన నీరే సరఫరా అవుతోంది.
ఇది కొత్తబస్టాండ్‌లోని వాటర్‌ట్యాంక్. ట్యాంక్ అంతా అపరిశుభ్రతతో నిండిపోయింది. పైప్‌లన్నీ పాకురు పట్టాయి. శుభ్రం చేయడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. ప్రజలకు కలుషిత నీరే సరఫరా చేయాల్సిన పరిస్థితి నెలకొంది. జిల్లాలో ప్రతీ ఒక్క వాటర్ ట్యాంక్ పరిస్థితి ఇదే. ఇక్కడ సైతం గతనెల తేదీ రాసినప్పటికీ అక్కడున్న ట్యాంక్ నిర్వాహకులు తేదీలు రాయలేదని, గతనెలలో రాసిందే ఉందన్నారు. అసలు శుభ్రం చేస్తున్నారా? లేదా? అన్న అనుమానం వ్యక్తమవుతున్నాయి.
ఇది జిల్లా కేంద్రంలోని విద్యానగర్‌లో పురాతనకాలంలో కట్టిన వాటర్ ట్యాంక్. నిబంధనల ప్రకారం 15రోజులకోసారి ట్యాంక్‌ను శుభ్రం చేయాల్సి ఉండగా శుభ్రతను అధికారులు విస్మరిస్తున్నారు. దీంతో కలుషిత నీరే ప్రజలకు సరఫరా అవుతోంది. ఈ ట్యాంక్ వద్ద ఎలాంటి సూచికలు, బోర్డులు, శుభ్రపర్చిన తేదీలు లేవు.
తాగునీరు సురక్షితమేనా..?
తాగునీరు సురక్షితమేనా..?
తాగునీరు సురక్షితమేనా..?
తాగునీరు సురక్షితమేనా..?


